ధార్మిక సంస్థలో అధర్మం రాజ్యమేలుతోంది
తిరుపతి అర్బన్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టీటీడీ ధార్మిక సంస్థలో అధికారుల వైఫల్యం వల్ల అధర్మం రాజ్యమేలుతోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి ఆరోపించారు. టీటీడీకి చెందిన పద్మావతీ కంపెనీ నిర్వాహకుల స్వార్థానికి ఉద్యోగాలు పోగొట్టుకున్న కార్మికులు టీటీడీ పరిపాలనా భవనం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం రెండోరోజుకు చేరాయి. ఈ దీక్షలకు కందారపు మురళి హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి బంధువు కాంట్రాక్ట్ టెండర్ దక్కించుకున్న పద్మావతీ కంపెనీ వారు తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని కోరారు.
ఏడేళ్లుగా పనిచేస్తున్న కార్మికులను నిబంధనల పేరుతో అకస్మాత్తుగా తొలగించడం వల్ల వారి కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక పద్మావతీ కంపెనీ యాజమాన్యం అగ్రిమెంట్‌లో రాసుకున్న విధానానికి తిలోదకాలిచ్చి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడాలని చూస్తే సహించేది లేదన్నారు. అవసరమైతే జిల్లా వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను ఐక్యం చేసి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సుబ్రమణ్యం, గోపినాథ్, రజని, కుమార్, సురేష్, నారాయణ, మల్లికార్జున, మార్కొండయ్యతోపాటు కార్మికులు పాల్గొన్నారు.