కడుపు కొట్టకండి బాబూ.. | to remove the Farmers, Field Assistants | Sakshi
Sakshi News home page

కడుపు కొట్టకండి బాబూ..

Published Tue, Jul 1 2014 3:51 AM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM

కడుపు కొట్టకండి బాబూ.. - Sakshi

కడుపు కొట్టకండి బాబూ..

కదిరి టౌన్/పెనుకొండ/ కళ్యాణదుర్గం రూరల్/అనంతపురం క్రైం : ‘‘ఇంటికో ఉద్యోగమిస్తామని ఎన్నికలకు ముందు హామీల మీద హామీలిచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు.. ఇలా ఒక్కొక్కరిని తొలగించుకుంటూ పోతున్నారు. ఇదెక్కడి న్యాయం’ అంటూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రశ్నించారు. తమను తొలగించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సోమవారం కదిరి, పెనుకొండ, కళ్యాణదుర్గం, అనంతపురంలో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళన బాట పట్టారు. కదిరిలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ధర్నా చేశారు.

పెనుకొండలో.. డివిజన్ పరిధిలోని ఫీల్డ్ అసిస్టెంట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ నాయకులతో కలిసి బస్టాండ్ నుంచి దర్గా సర్కిల్, అంబేద్కర్ నగర్ మీదుగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకుని బైఠాయించారు. కళ్యాణదుర్గంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచి టీ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ‘బాబు వస్తే జాబు అన్నారు.. బాబు వచ్చె.. జాబు పోయె అన్నట్లుంది పరిస్థితి.. సీఎం డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.

ఆయా ప్రాంతాల్లో నాయకులు మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రాణత్యాగానికైనా సిద్ధమని, ఉద్యోగాల్ని మాత్రం వదులుకునేది లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్ణయంతో జిల్లాలో 850 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 200 మంది మేట్లు ఉద్యోగాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఉద్యోగ భద్రత కల్పించాలని, సీనియర్ మేట్లను ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేయాలన్నారు. నెలసరి వేతనం రూ.13 వేలకు పెంచి బకాయిలు చెల్లించాలన్నారు.

ఇప్పటికే తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఏడాది కాంట్రాక్ట్ ఒప్పందాన్ని రద్దు చేయాలని, వికలాంగులైనఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కూలీల వేతన బకాయిలు చెల్లించాలని, కూలి రూ.250కు పెంచడంతో పాటు క్యూబిక్ మీటర్ రేటు పెంచాలన్నారు. అర్హులైన ఫీల్డ్ అసిస్టెంట్‌లకు సీఓ, టీఏ, ఏపీఓ, ఈసీ పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. కదిరిలో ఆర్‌డీఓ రాజశేఖర్, పెనుకొండలో ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి, కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరికి వినతిపత్రాలు అందజేశారు.

అనంతపురంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు వెంకటేష్, అధ్యక్షుడు నరసింహులు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్‌ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. మంత్రి వర్గం సమావేశంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించాలని ఓ శాఖ మంత్రి చేస్తున్న ప్రకటనలు వేలాది కుంటుంబాలకు తీరని ఆవేదనను మిగిల్చుతోంద ని వారన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లు అవినీతి పరులని, కోట్లకు పడగలెత్తారని మంత్రి మీడియా ముందు లేని పోని ప్రకటనలిస్తున్న తీరు అందరినీ కలచి వేస్తోందన్నారు.

ఆందోళన  కార్యక్రమాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి సరస్వతి, సీఐటీయూ కదిరి డివిజన్ కార్యదర్శి జీఎల్ నరసింహులు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మినారాయణ, పెనుకొండ డివిజన్ అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలునాయక్, సీఐటీయూ కళ్యాణదుర్గం డివిజన్ కార్యదర్శి రంగనాథ్, రెవెన్యూ డివిజన్ అధ్యక్షుడు మురళి, మండలాధ్యక్షులు సర్వోత్తమకుమార్, పెద్ద సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement