సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలస్వామి
దుబ్బాక : విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం జీతాలను పెంచిందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కాముని గోపాలస్వామి అన్నారు. ఆదివారం దుబ్బాకలో నిర్వహించిన వేతనాల పెంపు విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ వీఆర్‌ఏల వేతనాలను ప్రభుత్వం పెంచిందని, రూ. 6500 ఉన్న వేతనం ప్రస్తుతం రూ. 10500లకు పెరిగిందని, తెలంగాణ సాధన ఇంక్రిమెంట్ కింద రూ. 200 ఇస్తోందన్నారు.
వీఆర్‌ఏలకు డబుల్ బెడ్రూం ఇళ్లతో పాటు అర్హులైన వారికి వీఆర్వో, అటెండర్ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వేతనాల పెంపుతో వీఆర్‌ఏలకు ఆర్థిక ప్రయోజనం లభించినప్పటికీ 010 పద్దుల కింద జీతాలు ఇవ్వకుంటే ప్రతి నెలా వేతనాలు అందడంలో చాలా ఇబ్బందులొస్తాయన్నారు. పెంచిన వేతనాలను వీఆర్‌ఏలకు 010 పద్దు ఖాతాల ద్వారానే అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.