విద్యాశాఖ కోర్టు ధిక్కారంపై పిటిషన్లు
మినహాయింపు ఉన్నా వేధిస్తున్నారని ఫిర్యాదు
విశాఖపట్నం: విద్యాశాఖ అధికారుల తీరుతో ఆందోళన చెందుతున్న ట్యుటోరియల్ స్కూళ్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. గుర్తింపు నుంచి మినహాయింపు పొందిన తమ స్కూళ్లను విద్యాశాఖ అధికారులు సీజ్ చేస్తున్నారంటూ నిర్వాహకులు కొద్ది రోజుల నుంచి ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా విద్యాశాఖాధికారి, కలెక్టర్, ఇతర అధికారులకు వీరు వినతి పత్రాలు అందజేశారు. మరోవైపు జిల్లా విద్యాశాఖ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందంటూ హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేస్తున్నాయి. తాజాగా ఈనెల 13న నగరంలోని పెదగంట్యాడకు చెందిన రాజీవ్ ట్యుటోరియల్స్ నిర్వాహకులు తమ స్కూలును విద్యాశాఖాధికారులు సీజ్ చేశారంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఇందులో రాష్ట్ర విద్యాశాఖ, విద్యాశాఖ కమిషనర్, డీఈవో, ఎంఈవో (పెదగంట్యాడ)లను ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై 16న విచారణ చేపట్టిన హైకోర్టు విద్యాశాఖ అధికారులు రాజీవ్ ట్యుటోరియల్స్‌ను మూసివేయడం నిరంకుశమని, అక్రమమని, రాజ్యాంగ విరుద్ధమని, సహజ న్యాయసూత్రాలకు వ్యతిరేకమని స్పష్టం చేసింది. తక్షణమే సీలు వేసిన తాళాలను తెరచి ట్యుటోరియల్ నడపడానికి వీలు కల్పించాలని ఆదేశించింది.
ఈ ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లా, నగర వ్యాప్తంగా ఉన్న ఇతర ట్యుటోరియల్ స్కూళ్ల తరఫున హైకోర్టును ఆశ్రయించనున్నట్టు ఏపీ ప్రైవేటు ట్యుటోరియల్ స్కూల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఎన్.విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎస్.సూర్యనారాయణ శుక్రవారం ‘సాక్షి’కి చెప్పారు. తాము ట్యుటోరియల్స్‌ను నడుపుకోవడానికి అనుమతులున్నా విద్యాశాఖాధికారులు ఏటా బడులు తెరిచే సమయానికి ఇబ్బందులు పెడుతూ స్కూళ్లను మూసివేస్తున్నారని ఆరోపించారు. తమ ట్యుటోరియల్స్‌ను రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా ఇవ్వడం లేదని తెలిపారు.