ఒప్పందమెందుకు చేసుకోవడం లేదు?
విద్యా సంస్థలపై ఏపీ సర్కార్‌ను నిలదీసిన హైకోర్టు
విద్యార్థుల జీవితాలతో ఈ కేసు ముడిపడి ఉంది
రేపటి నుంచే చర్చలు ప్రారంభించండి
ఉభయ రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులకు ధర్మాసనం ఆదేశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో తెలంగాణ ప్రభుత్వానికి హక్కులున్న విద్యాసంస్థల విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకోవడం లేదని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు మంగళవారం ప్రశ్నించింది. ఆ విద్యాసంస్థల సేవలు కావాలంటే చట్టప్రకారం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉండగా, ఆ పని ఎందుకు చేయడం లేదని, ఇందుకు ఎవరు అడ్డుపడుతున్నారని నిలదీసింది. విద్యార్థుల జీవితాలు ముడిపడి ఉన్న ఇటువంటి వ్యవహారాల్లో ప్రతిష్టకు వెళ్లొద్దని, చట్టం ప్రకారం ముందుకెళ్లాలని హితవు పలికింది. శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సేవలను ఏపీలోని దాని ప్రాంతీయ కేంద్రాలకు, క్యాంపస్‌లకు అందించేందుకు వీలుగా పరస్పరం చర్చలు జరపాలని ఇరురాష్ట్రాల విద్యాశాఖల కార్యదర్శులను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 3న తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి చాంబర్‌లో మధ్యాహ్నం 2గంటలకు చర్చలు జరపాలని స్పష్టం చేసింది. చర్చల్లో పురోగతి ఉండాలని, కార్యదర్శులు సహకరించుకోని పక్షంలో ఇరువురుని కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తామంది. ఈ చర్చల సారాన్ని తమ ముందుంచాలని ఇరురాష్ట్రాల అడ్వొకేట్స్ జనరల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 4కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథస్థితి(స్టేటస్ కో) కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
కేసు పూర్వాపరాలివీ..
ఆంధ్రప్రదేశ్‌లోని క్యాంపస్‌లకు తమ సేవలను నిలిపేస్తూ తెలుగు విశ్వవిద్యాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో ఉన్న ప్రాంతీయకేంద్రాలకు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం తన సేవలను నిలిపేసిందని, దీనివల్ల 3.5లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన సంగతి విదితమే. ఈ రెండు వ్యాజ్యాలను మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(స్పెషల్ జీపీ) రమేష్ వాదనలు వినిపిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగు విశ్వవిద్యాలయం క్యాంపస్‌ల్లో తమ సేవలను నిలిపేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని వివరించారు. ఈ సమయంలో తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ, ఈ వ్యాజ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని రమేష్‌కు స్పష్టం చేసింది. రామకృష్ణారెడ్డి తన వాదనలను కొనసాగిస్తూ, పునర్విభజన చట్టప్రకారం మొదటి ఏడాది తర్వాత కూడా సేవలు కావాలంటే అందుకు తెలంగాణ ప్రభుత్వానికి కొంతమొత్తం చెల్లించి ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుందన్నారు. డబ్బు చెల్లిస్తే సేవలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కోర్టుకు నివేదించారు. యూనివర్సిటీ వద్ద కార్పస్‌ఫండ్ ఉందని, దాని పంపిణీ ఇంకా జరగలేదని, కాబట్టి ఆ నిధులను వాడుకోవచ్చునని రమేష్ తెలిపారు.
దీనికి ధర్మాసనం స్పందిస్తూ, పదవ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల సేవల విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో ఎందుకు ఒప్పందం కుదుర్చుకోవడం లేదని ఏపీ సర్కార్‌ను ప్రశ్నించింది. దీనికి రమేష్ సమాధానమిస్తూ, ఒప్పందం కుదుర్చుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పలుమార్లు అభ్యర్థనలు పంపారన్నారు. దీనికి రామకృష్ణారెడ్డి స్పందిస్తూ, డబ్బిస్తామంటే తాము ఎందుకు వద్దంటామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ఒకరి ఒకరు నిందించుకోవడం ఆపి, సమస్యకు పరిష్కారం చూడండంటూ చర్చల నిమిత్తం ఉత్తర్వులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.