హైకోర్టులో సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: నగదు పూచీకత్తు లేకుండానే అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడానికి స్థానిక కోర్టు మరోసారి తిరస్కరించడంతో ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయించింది. అన్ని కేసుల్లో బెయిల్‌కు పూచీకత్తు అవసరం లేదన్న ఆప్ వాదనను కోర్టు తిరస్కరించింది. బెయిల్‌బాండు చెల్లించడానికి నిరాకరించిన ఆయనకు పటియాలా హౌజ్ కోర్టు శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తమ తప్పు ఏంటని న్యాయస్థానాన్ని ప్రశ్నించిన కేజ్రీవాల్‌ను న్యాయమూర్తి మందలించారు. మాజీ ముఖ్యమంత్రిగా చట్టాన్ని పాటించాలని సూచించారు.
జైలుకు వెళ్లకుండా ఉండాలంటే పూచీకత్తు చెల్లించవలసిందేనని కేజ్రీవాల్‌కు స్పష్టం చేశారు. ఫలితంగా ఆప్ అగ్రనాయకుడు వచ్చే నెల రెండో తేదీ వరకు తీహార్ జైలులో ఉండనున్నారు. బీజేపీ నేత నితిన్ గడ్కరీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయనను అరెస్టు చేయడం తెలిసిందే. ఆప్ నాయకుడు, కేజ్రీవాల్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని కేసుల్లో వ్యక్తిగత పూచీకత్తు చెల్లించనవసరం లేదని వాదించారు.
నిందితుడు కోర్టు ఎదుట హాజరుకాలే డని అనుమానం వస్తేనే పూచీకత్తు చెల్లించాలని ఆదేశిస్తారని అన్నారు. అయితే కేజ్రీవాల్ ఎక్కడికీ పారిపోడన్న నమ్మకం తమకు ఉన్నప్పటికీ గతంలో జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేయలేం కాబట్టి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నామని న్యాయమూర్తి ప్రకటించారు. పూచీకత్తు ఇవ్వగల స్తోమత నిందితుడికి ఉన్నప్పటికీ ఆయన బెయిల్ బాండు ఇవ్వనంటూ మొండికేశారని కోర్టు ఆక్షేపించింది. న్యాయస్థానం ఇలాంటి చేష్టలను సహించబోదని పటియాలా హౌజ్ కోర్టు న్యాయమూర్తి బుధవారం నాటి ఉత్తర్వులో పేర్కొన్నారు.తమ ఉత్తర్వుపై అభ్యంతరం ఉన్నట్లయితే హైకోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. ఇక ఈ కేసులో జూన్ ఆరున విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం నితిన్ గడ్కరీని కూడా ఆదేశించింది.
అత్యంత అవినీతిపరుల జాబితాలో గడ్కరీ పేరును కూడా ఆప్ చేర్చడంతో ఆయన కేజ్రీవాల్‌పై జనవరిలో పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం గతంలో కేజ్రీవాల్‌కు నోటీసు పంపింది. అయితే ఎన్నికల ప్రచారంలో ఉన్నందున కోర్టుకు రాలేనని, కొంత సమయం ఇవ్వాలని కేజ్రీవాల్ న్యాయస్థానానికి తెలిపారు. ఎన్నికలు ముగిసిపోవడంతో బుధవారం ఆయన కోర్టు విచారణకు హాజరయ్యారు. గతంలో గైర్హాజరయినందుకు పదివేల రూపాయల బెయిల్‌బాండు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక మీదట కోర్టుకు హాజరవుతానని హామీ ఇచ్చిన కేజ్రీవాల్ బెయిల్ బాండ్ చెల్లించడానికి నిరాకరించారు. దానితో న్యాయస్థానం ఆయనను మూడు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
కేజ్రీవాల్‌ను తీహార్ జైలు నుంచి శుక్రవారం పటియాలా హౌజ్ కోర్టులో హాజరుపర్చారు. బెయిల్ కోసం పూచీకత్తు చెల్లించడానికి ఆయన మరోసారి నిరాకరించడమే కాక తన తప్పేమిటని న్యాయమూర్తిని ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తనను జైలుకు పంపడం అన్యాయమని వాదించారు. కేజ్రీవాల్ వాదనకు నితిన్ గడ్కరీ తరపు న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు.
గడ్కరీ అవినీతిపై మాట్లాడినందుకు తనను జైలుకు పంపారని, తన ఆరోపణలపై కనీసం విచారణకు కూడా ఆదేశించలేదన్నారు. ‘నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావడం లేదు’ అని కోర్టు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం నాటి విచారణకు ఆప్ నాయకులు మనీష్ సిసోడియా, యోగేంద్ర యాదవ్, కుమార్ విశ్వాస్‌తోపాటు కార్యకర్తలు హాజరయ్యారు. న్యాయస్థానం లోపలా వెలుపలా కూడా ఆప్ కార్యకర్తలు గుమిగూడారు. కోర్టు, జైలు వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.