Amadmi Party
-
రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు: అరవింద్ కేజ్రివాల్
చంఢీఘడ్: రైతుల ఆత్మహత్యలను నివారించడానికి ఎలాంటి చర్యలనైనా తీసుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. పంజాబ్‌లోని మాన్సాలో రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడకుండా చూస్తామని కేజ్రివాల్ అన్నారు. స్వాత్రంత్ర్యం వచ్చి 70 ఏళ్లు గడిచినప్పటికి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపోందిస్తున్నామని సీఎం అరవింద్ కేజ్రివాల్ అన్నారు. మీకు నేను.. వాగ్దానం చేసి చెబుతున్నాను.. ఒక నెల తర్వాత మళ్లి వచ్చాక దాని వివరాలు తెలియజేస్తామని తెలిపారు. పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 117 స్థానాల్లో అభ్యర్థులు పోటిచేస్తారని అన్నారు. కాగా, ఎన్నికలలో ఆమ్ ఆద్మీపార్టీ అఖండ విజయం సాధిస్తుందని తెలిపారు. అరవింద్ కేజ్రివాల్ రెండు రోజులపాటు పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. ఆయన రేపు(శుక్రవారం) భటిండా వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. చదవండి: ఏపీ గవర్నర్‌ను కలిసిన సీఎం వైఎస్ జగన్ దంపతులు -
‘సుప్రీం’ స్ఫూర్తికి విరుద్ధం
ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులకూ, చట్టసభలకూ ఎనలేని ప్రాధాన్యత వుంటుంది. దేశ రాజధాని కావటం వల్ల కావొచ్చు... ఢిల్లీకి సంబంధించినంతవరకూ అక్కడి అసెంబ్లీకి మొదటి నుంచీ పరిమితమైన అధికారాలే వున్నాయి. పేరుకు ముఖ్యమంత్రి, మంత్రులు వున్నా, దానికి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి లేదు. ఈ విషయమై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గత కొన్నేళ్లుగా ప్రశ్నిస్తూనే వున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)గా వున్నవారితో ఆయనకు భిన్న సందర్భాల్లో ఘర్షణలు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు మరింత కోతపెడుతూ కేంద్ర ప్రభుత్వం మొన్న సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుపై సహజంగానే ఆగ్రహావేశాలు రగుల్కొ న్నాయి. దీనిపై పాలక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఉద్యమం ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వ జాతీయ రాజధాని ప్రాంత చట్టం,1991ని సవరిస్తూ తీసుకొచ్చిన ఈ బిల్లు ప్రకారం ఇకపై అక్కడ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే. పాలనాపరమైన ఏ చర్య తీసుకోవటానికైనా అక్కడి ప్రభుత్వం ఎల్జీని సంప్రదించాలి. ఈ బిల్లు చట్టమైతే అసెంబ్లీ, దానికి సంబంధించిన కమిటీలు రాజధాని ప్రాంతంలో రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన లేదా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం సాధ్య పడదు. మూడేళ్లక్రితం ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కూ, ఎల్జీకీ మధ్య వివాదం తలెత్తినప్పుడు అధికారాల విభజనకు సంబంధించి సమగ్ర చట్టం తీసుకురావాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. ఆ ప్రకారమే తాము తాజా సవరణలు తెస్తున్నామని బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. అయితే ఈ బిల్లు సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తికి అనుగుణంగా వుందని చెప్పటానికి లేదు. 1992లో ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తూ 69వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఆ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన 239ఏఏ అధికరణ ప్రకారం తనకు సర్వాధికారాలూ వున్నాయని ఎల్జీ వాదన. ఢిల్లీ హైకోర్టు ఆయన వాదనను అంగీకరించింది. తాము తీసుకుంటున్న వివిధ నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై ఎల్జీ ఎటూ తేల్చకుండా అవరోధాలు సృష్టిస్తున్నారని కేజ్రీవాల్ సర్కారు వాదించగా, పాలనాపరంగా ఆయనే సర్వాధికారి అని, ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆయన సమ్మతి అవసరమని ఢిల్లీ హైకోర్టు చెప్పింది. కానీ సుప్రీంకోర్టు ఇందుకు భిన్నమైన తీర్పునిచ్చింది. ఎల్జీ స్వతంత్రంగా నిర్ణయాలు తీసు కోవటానికి లేదని, ఆయన మంత్రి మండలి సలహాలు, సూచనలమేరకు పనిచేయాలని స్పష్టం చేసింది. అయితే ఇందుకొక మెలిక పెట్టింది. ఏ నిర్ణయాన్నయినా రాజ్యాంగదత్తమైన అధికారాలతో వ్యతిరేకించేందుకు ఎల్జీకి హక్కుందని, తుది నిర్ణయం కోసం ఆయన రాష్ట్రపతికి నివే దించవచ్చునని తెలిపింది. అదే సమయంలో ఈ నిర్ణయాధికారాన్ని యాంత్రికంగా ఉపయో గించరాదని వివరించింది. 239ఏఏ అధికరణ ప్రకారం ప్రజా భద్రత, పోలీసు, భూ సంబంధ అంశాలు మినహా మిగిలిన విషయాల్లో చట్టాలు చేసేందుకు ఢిల్లీ అసెంబ్లీకి అధికారాలున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సున్నితమైన అంశాలు ఇమిడివున్నవీ, ప్రభుత్వ స్తోమతకు మించి ఆర్థిక భారం పడేవీ, కేంద్రంతో లేదా పొరుగు రాష్ట్రాలతో రాజకీయ సమస్యలకు తావిచ్చేవీ ఎల్జీ రాష్ట్రపతికి నివేదించవచ్చు. కానీ ఆ తీర్పు ద్వారా ఢిల్లీ ప్రభుత్వానికి లభించిన పరిమిత ఉపశ మనాన్ని కాస్తా తాజా సవరణ బిల్లు హరిస్తోంది. కొందరు విశ్లేషకులు చెబుతున్నట్టు అది చట్టమైతే ఢిల్లీ ప్రతిపత్తి మున్సిపాలిటీకన్నా మిన్నగా ఏమీ వుండదు. ఢిల్లీకి 1956కు ముందు పనిచేసిన ఇద్దరు ముఖ్యమంత్రుల మాటేమోగానీ... 1993లో అక్కడ మళ్లీ అసెంబ్లీని పునరుద్ధరించినప్పటినుంచీ తగినన్ని అధికారాలివ్వాలన్న డిమాండ్ పదే పదే వస్తూనేవుంది. బీజేపీ సీనియర్ నేత మదన్‌లాల్ ఖురానా, ఆ తర్వాత అదే పార్టీకి చెందిన సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్ వంటివారు సీఎంలుగా పనిచేసినప్పుడు మాత్రమే కాదు...కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ సైతం ఎన్నికైన ప్రజా ప్రతినిధులను చిన్నచూపు చూస్తున్నారని, తాము నామమాత్రం అవుతున్నామని ఆరోపించేవారు. అయితే తమ పార్టీకి చెందిన ప్రభుత్వాలే కేంద్రంలో అధికారంలో వుండటం వల్ల చివరకు ఎప్పుడూ వారిదే పైచేయి అయ్యేది. కానీ ప్రస్తుత ముఖ్య మంత్రి కేజ్రీవాల్ పరిస్థితి వేరు. ఆయనకు వర్తమానంలో సరేసరి... యూపీఏ పాలనాకాలంలోనూ కష్టాలు తప్పలేదు. బస్తీల్లో క్లినిక్‌ల ఏర్పాటు మొదలుకొని టీచర్ పోస్టుల భర్తీ, వారి పదోన్నతులు, కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణ వరకూ అనేక అంశాలు ఎల్జీ వద్ద దీర్ఘకాలం పెండింగ్‌లో పడ్డాయి. ఢిల్లీకున్న ప్రత్యేక పరిస్థితుల్లో కొన్ని అధికారాలు కేంద్రం వద్దనే వుండాలనుకోవటంలో తప్పేమీ లేదు. కానీ టీచర్ల నియామకం, బస్తీ క్లినిక్‌ల వంటి ప్రజానుకూల అంశాల్లో సైతం ఎన్నికైన ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోరాదనటం... అందుకు తమ ఆమోదముద్ర అవసరమనటం అప్రజా స్వామికం. తమను గెలిపిస్తే ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని బీజేపీ గతంలో వాగ్దానం చేసింది. అది నెరవేర్చకపోగా వున్న అధికారాలను కూడా హరించటం సరైంది కాదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి తగిన అధికారాలివ్వాలి. ఆ నిర్ణయాల్లో తప్పొప్పులుంటే ఎటూ జనం ప్రశ్ని స్తారు. వాటి రాజ్యాంగబద్ధతను న్యాయస్థానాలు తేలుస్తాయి. అంతేతప్ప ఆ ప్రభుత్వాలను నామ మాత్రావశిష్టం చేయటం ఎంతమాత్రం భావ్యం కాదు. -
హామీల వలలో ఓటరు ఎటు ?
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ప్రచారం వేరు, ఇచ్చిన హామీలు వేరు. పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు తటస్థ ఓటర్లను ఆకర్షించడానికి ప్రచారాంశాలు దోహద పడతాయి. కానీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే ఎప్పుడైనా అత్యంత కీలకం. ప్రచారంలో జాతీయ భావాన్ని రెచ్చగొడుతున్న బీజేపీ మేనిఫెస్టో దగ్గరకి వచ్చేసరికి స్థానిక అంశాలకే పెద్ద పీట వేసింది. ప్రచార పర్వంలో వెనుకబడ్డ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో యువత, మైనార్టీ ఓట్లపైనే దృష్టి కేంద్రీకరించింది. ఆప్ గురువారం మేనిఫెస్టో విడుదల చేసినప్పటికీ చాలా రోజుల కిందటే ఇచ్చిన గ్యారంటీ కార్డులతో పాటుగా దేశభక్తి అంశాన్ని చేర్చింది. బీజేపీ: ప్రచారంలో జాతీయ భావం ఎజెండాగా తీసుకొని మాటల తూటాలు పేలుస్తున్న బీజేపీ మేనిఫెస్టోలో స్థానిక అంశాలకే ప్రాధాన్యం ఇచ్చింది. అభివృద్ధి, సంక్షేమాన్ని సమతూకం పాటిస్తూ తూర్పు ఢిల్లీలో వలస కార్మికులు నివసిస్తున్న కాలనీల అభివృద్ధికి డెవలప్మెంట్ బోర్డు, ట్యాంకర్లపై ఆధారపడకుండా ఇంటింటికీ రక్షిత మంచినీరు, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 10 కోట్లు కేటాయింపు, నిరుపేదలకు రూ.2 కే కిలో గోధుమ పిండి, ఆడపిల్ల పుడితే రూ. 2 లక్షల రూపాయలు, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటర్లు వంటి హామీలు ఇచ్చింది. కాంగ్రెస్: కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రచారంలోనూ, హామీలివ్వడంలో కూడా బీజేపీ, ఆప్ కంటే వెనుకబడింది. మైనార్టీల ఓటర్లనే అత్యధికంగా నమ్ముకున్న ఆ పార్టీ తాము అధికారంలోకి వస్తే సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. యువ స్వాభిమాన్ యోజనకింద నిరుద్యోగులకు రూ.5 వేల నుంచి రూ.7,500 వరకు భృతి ఇస్తామని తన మేనిఫెస్టోలో వెల్లడించింది. అంతేకాకుండా యువత స్టార్టప్‌లు ప్రారంభించడం కోసం రూ.5 వేల కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. నెలకి 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వనుంది. ఇక ఢిల్లీ వార్షిక బడ్జెట్లో కాలుష్య నివారణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది. ఆప్: యువత, మహిళా సాధికారత దిశగా ఆప్ ముందుకు వెళుతోంది. హిందూ ఓట్లు చేజారినా కష్టమేనని భావించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలపై చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు. హిందూత్వపై కాస్త సానుకూలంగానే ఉంటూ బీజేపీ, కాంగ్రెస్‌కు మధ్యే మార్గంగా అడుగులు వేస్తున్నారు. ఇది మేనిఫెస్టోలో ప్రతిఫలించేలా చర్యలు తీసుకున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఢిల్లీ స్కూళ్లలో దేశభక్తికి సంబంధించిన పాఠ్యాంశాలను ప్రవేశపెడతామన్నారు. తనని అధికార అందలం ఎక్కిస్తాయనుకున్న ఉచిత పథకాల్ని కొనసాగిస్తానంటూ ఇప్పటికే 28 పాయింట్ల గ్యారంటీ కార్డులు ఇచ్చారు. నాణ్యమైన విద్య, నెలకి 200 యూనిట్ల ఉచిత కరెంట్, నెలకి 20 కిలోలీటర్ల ఉచిత నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంటి వద్దకే రేషన్, 10 లక్షల మంది సీనియర్ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్ర, పారిశుద్ధ్య కార్మికులు విధి నిర్వహణలో మరణిస్తే కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం వంటి హామీలకే మేనిఫెస్టోలో ప్రధానంగా చోటు కల్పించారు. 24 గంటలు మార్కెట్లను తెరిచి ఉంచడాన్ని ప్రయోగాత్మకంగా చేపడతామని కూడా ఆప్ హామీ ఇచ్చింది. -
బీజేపీకి వత్తాసు పలకలేదు:షీలా దీక్షిత్
ఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమివ్వాలని, ఢిల్లీ ప్రజలకు కూడా అది మంచిదని వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ ఇప్పుడు ఆత్మసంరక్షణలో పడ్డారు. ఢిల్లీలో బీజేపీ సర్కారుకు జైకొట్టిన ఆమె మాటమార్చారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తాను ఎప్పుడూ కోరలేదని స్పష్టం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం సృష్టించడంతో దానిని సరిదిద్దుకునే పనిలో పడ్డారు. 'ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు తాను అనుకూలంగా ఎప్పుడూ మాట్లడలేదు. ఆ రకంగా ఎప్పటికీ వ్యాఖ్యానించను' అని షీలా తెలిపారు. ఆ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి తగిన సంఖ్యా బలం ఉంటే ఇబ్బంది ఏమిటని మాత్రమే తాను చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వాన్నే ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఒకవేళ బీజేపీ ఆ అవకాశం ఉంటే ప్రభుత్వ ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆమె వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
షీలాకు కాంగ్రెస్ కు మధ్య పెరిగిన దూరం!
ఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమివ్వాలని, ఢిల్లీ ప్రజలకు కూడా అది మంచిదని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ వ్యాఖ్యలు కాస్తా ఆమెకు మరింత తలనొప్పిగా మారాయి. బీజేపీ ప్రభుత్వంపై షీలా చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై కాంగ్రెస్ అలకబూనినట్లు తెలుస్తోంది. ఒకప్రక్క ఆప్ తో సహా కాంగ్రెస్ కూడా ఢిల్లీలో తాజాగా ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో షీలా వ్యాఖ్యలు పార్టీకి మింగుడు పడటం లేదు. పార్టీ విధానాన్ని పక్కనుపెట్టి బీజేపీ అధికారం ఇస్తే మంచిదని పేర్కొనడమే ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు ప్రాధమిక సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకు షీలా పరోక్షంగా తన వ్యాఖ్యల ద్వారా జై కొట్టడంతో కాంగ్రెస్ ను డైలామాలో పడేసింది. దాంతో పార్టీ శ్రేణులు ఆమె వైఖరిపై గుర్రుగా ఉన్న తరుణంలో ఆమె తన వ్యాఖ్యలను సరిదిద్దుకునే పనిలో పడింది. ఆదివారం షీలా మీడియాతో మాట్లాడుతూ..ఆ రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితిని, రాజ్యాంగపరమైన నిబంధనలను మాత్రమే చెప్పానంటూ ఆమె తాజాగా తెలిపింది. అయితే ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేయడంపై మాత్రం ఆమె మాట్లాడటానికి నిరాకరించారు. -
బీజేపీకి అవకాశం ఇవ్వాలి
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై షీలా దీక్షిత్ న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమివ్వాలని, ఢిల్లీ ప్రజలకు కూడా అది మంచిదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలు ఉండటమే మంచిదని, ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయికి బీజేపీ చేరుకుని ఉంటే బీజేపీ ఆ పనిచేయవచ్చని షీలా దీక్షిత్ గురువారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకోసం బీజేపీ ఎమ్మెల్యేల వేటలో పడిందంటూ ఆమ్ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో షీలా దీక్షిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్నికలు కావాలని కాంగ్రెస్‌గానీ, ఆప్‌గానీ కోరుకోవడంలేదని షీలా దీక్షిత్ అన్నారు. అయితే,..ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? మైనారిటీ ప్రభుత్వం ఎదుర్కొనే సవాళ్లేమిటి?.. ఇవన్నీ బీజేపీకి సంబందించినవేనని ఆమె అన్నారు. షీలా దీక్షిత్ వ్యాఖ్యలపట్ల బీజేపీ హర్షం వ్యక్తంచేసింది. 15 ఏళ్లపాటు ఢిల్లీలో ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ఆమెకు ప్రభుత్వం ఏర్పాటుపై రాజ్యాంగ నిబంధనలన్నీ తెలుసునని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ అన్నారు. కాగా, షీలా దీక్షిత్ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం కావచ్చని, ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుముఖంకాదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు. -
హైకోర్టులో సవాల్
సాక్షి, న్యూఢిల్లీ: నగదు పూచీకత్తు లేకుండానే అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడానికి స్థానిక కోర్టు మరోసారి తిరస్కరించడంతో ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నిర్ణయించింది. అన్ని కేసుల్లో బెయిల్‌కు పూచీకత్తు అవసరం లేదన్న ఆప్ వాదనను కోర్టు తిరస్కరించింది. బెయిల్‌బాండు చెల్లించడానికి నిరాకరించిన ఆయనకు పటియాలా హౌజ్ కోర్టు శుక్రవారం జ్యుడీషియల్ కస్టడీ విధించింది. తమ తప్పు ఏంటని న్యాయస్థానాన్ని ప్రశ్నించిన కేజ్రీవాల్‌ను న్యాయమూర్తి మందలించారు. మాజీ ముఖ్యమంత్రిగా చట్టాన్ని పాటించాలని సూచించారు. జైలుకు వెళ్లకుండా ఉండాలంటే పూచీకత్తు చెల్లించవలసిందేనని కేజ్రీవాల్‌కు స్పష్టం చేశారు. ఫలితంగా ఆప్ అగ్రనాయకుడు వచ్చే నెల రెండో తేదీ వరకు తీహార్ జైలులో ఉండనున్నారు. బీజేపీ నేత నితిన్ గడ్కరీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయనను అరెస్టు చేయడం తెలిసిందే. ఆప్ నాయకుడు, కేజ్రీవాల్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని కేసుల్లో వ్యక్తిగత పూచీకత్తు చెల్లించనవసరం లేదని వాదించారు. నిందితుడు కోర్టు ఎదుట హాజరుకాలే డని అనుమానం వస్తేనే పూచీకత్తు చెల్లించాలని ఆదేశిస్తారని అన్నారు. అయితే కేజ్రీవాల్ ఎక్కడికీ పారిపోడన్న నమ్మకం తమకు ఉన్నప్పటికీ గతంలో జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేయలేం కాబట్టి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నామని న్యాయమూర్తి ప్రకటించారు. పూచీకత్తు ఇవ్వగల స్తోమత నిందితుడికి ఉన్నప్పటికీ ఆయన బెయిల్ బాండు ఇవ్వనంటూ మొండికేశారని కోర్టు ఆక్షేపించింది. న్యాయస్థానం ఇలాంటి చేష్టలను సహించబోదని పటియాలా హౌజ్ కోర్టు న్యాయమూర్తి బుధవారం నాటి ఉత్తర్వులో పేర్కొన్నారు.తమ ఉత్తర్వుపై అభ్యంతరం ఉన్నట్లయితే హైకోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. ఇక ఈ కేసులో జూన్ ఆరున విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం నితిన్ గడ్కరీని కూడా ఆదేశించింది. అత్యంత అవినీతిపరుల జాబితాలో గడ్కరీ పేరును కూడా ఆప్ చేర్చడంతో ఆయన కేజ్రీవాల్‌పై జనవరిలో పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం గతంలో కేజ్రీవాల్‌కు నోటీసు పంపింది. అయితే ఎన్నికల ప్రచారంలో ఉన్నందున కోర్టుకు రాలేనని, కొంత సమయం ఇవ్వాలని కేజ్రీవాల్ న్యాయస్థానానికి తెలిపారు. ఎన్నికలు ముగిసిపోవడంతో బుధవారం ఆయన కోర్టు విచారణకు హాజరయ్యారు. గతంలో గైర్హాజరయినందుకు పదివేల రూపాయల బెయిల్‌బాండు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక మీదట కోర్టుకు హాజరవుతానని హామీ ఇచ్చిన కేజ్రీవాల్ బెయిల్ బాండ్ చెల్లించడానికి నిరాకరించారు. దానితో న్యాయస్థానం ఆయనను మూడు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. కేజ్రీవాల్‌ను తీహార్ జైలు నుంచి శుక్రవారం పటియాలా హౌజ్ కోర్టులో హాజరుపర్చారు. బెయిల్ కోసం పూచీకత్తు చెల్లించడానికి ఆయన మరోసారి నిరాకరించడమే కాక తన తప్పేమిటని న్యాయమూర్తిని ప్రశ్నించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న తనను జైలుకు పంపడం అన్యాయమని వాదించారు. కేజ్రీవాల్ వాదనకు నితిన్ గడ్కరీ తరపు న్యాయవాదులు అభ్యంతరం చెప్పారు. గడ్కరీ అవినీతిపై మాట్లాడినందుకు తనను జైలుకు పంపారని, తన ఆరోపణలపై కనీసం విచారణకు కూడా ఆదేశించలేదన్నారు. ‘నేను చేసిన తప్పేంటో నాకు అర్థం కావడం లేదు’ అని కోర్టు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం నాటి విచారణకు ఆప్ నాయకులు మనీష్ సిసోడియా, యోగేంద్ర యాదవ్, కుమార్ విశ్వాస్‌తోపాటు కార్యకర్తలు హాజరయ్యారు. న్యాయస్థానం లోపలా వెలుపలా కూడా ఆప్ కార్యకర్తలు గుమిగూడారు. కోర్టు, జైలు వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. -
ఆప్ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా లుబ్నాసర్వత్
సాక్షి,సిటీబ్యూరో: ఆమ్ఆద్మీ పార్టీ హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా డాక్టర్ లుబ్నాసర్వత్(్ర49) బుధవారం నామినేషన్ దాఖలు ఏశారు. మెహిదీపట్నం గుడిమల్కాపూర్‌కు చెందిన లుబ్నా ఎకనామిక్స్‌లో పీహెచ్డీ చేశారు. ఇండోనేషియాలోని జకర్తాలో ఓ వర్సిటీలో ఎకనామిక్స్ విజిటింగ్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నారు. వారసత్వ రాజకీయాలకు, అవినీతికి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఆమ్ఆద్మీ పార్టీలో సభ్యురాలిగా చేరి, ఆ పార్టీ తరపున హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. -
‘పవార్’ కోటలో పాగా వేసేదెవరో..
పింప్రి, న్యూస్‌లైన్: దేశ రాజకీయాల్లో కీలక లోక్‌సభ నియోజకవర్గమైన బారామతిలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 20 ఏళ్లకు పైగా ఇక్కడ ఎన్సీపీ హవా నడుస్తుండగా, ఇప్పుడు కాషాయ మహాకూటమి, ఆమ్ఆద్మీ పార్టీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. పుణే జిల్లా ఎన్సీపీకి పుట్టినిల్లు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు, అతడి వారసులకు కంచుకోట బారామతి. ముందుగా నియోజక వర్గ స్వరూపాన్ని పరిశీలిస్తే బారామతి లోక్‌సభ నయోజక వర్గం 1957లో పురుడు పోసుకోగా, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. 1999 తర్వాత శరద్ పవార్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత ఈ నియోజక వర్గం ఎన్సీపీకి పెట్టని కోటగా మారింది. ఇక్కడ నుంచి ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 8 సార్లు, భారతీయ లోక్‌దళ్ అభ్యర్థి ఒకసారి, ఎన్సీపీ అభ్యర్థులు 3 సార్లు గెలుపొందారు. 1984 లో శరద్‌పవార్ రాజకీయ ప్రవేశంతో బారామతి పూర్తిగా శరద్ పవార్ చేతిలోకి వచ్చింది. పవార్ మొదటిసారి పార్లమెంటు ఎన్నికల్లో సమాజ్ వాది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌కు చెందిన శంకర్రావు పాటిల్‌ను ఓడించారు. ఆ తర్వాత పవార్ తిరిగి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడంతో, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాకడే విజయం సాధించారు. ఈ ఎంపీ స్థానం 1991 నుండి 2009 వరకు శరద్ పవార్, అజిత్ పవార్, సుప్రియా సూలే (శరద్ పవార్ వారసులు) మధ్యనే ఉంటూ వచ్చింది. బారామతి పార్లమెంటు నియోజక వర్గం పునర్విభజన జరిగిన తర్వాత బారామతి కింద బారామతి, దౌండ్, ఇందాపూర్, ఖడక్వాస్లా, పురంధర్, బోర్ నియోజక వర్గాలు కలిశాయి. 2009 ఎన్నికలలో ఎన్సీపీ తరఫున పొటీచేసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పై 17 మంది పోటీ చేయగా, ప్రధాన పోరు బీజేపీ, ఎన్సీపీ మధ్యనే నడిచింది. ఆ ఎన్నికల్లో సుప్రియా సూలే సుమారు 3 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందింది. బీజేపీ, బీఎస్పీ నామ మాత్ర పోటీ ఇచ్చాయి. మారిన రాజకీయాలు.... నియోజక వర్గ పరిధిలో గల బారామతి, దౌండ్, ఇందాపూర్, పురంధర్ తాలుకాలలో అభివృద్ధి, నీటి సమస్యలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఒక్క బారామతి తాలుకాలోని సగానికిపైగా గ్రామాల్లో నీటి సమస్య అతి తీవ్రంగా ఉంది. రైతుల సమస్యలు అలాగే ఉన్నాయని, శరద్‌పవార్ వ్యవసాయ మంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, సుప్రియా సూలే ఎంపీగా నియోజక వర్గానికి చేసింది ఏమి లేదని ప్రధాన ప్రతిపక్షపార్టీలు ప్రజల్లోకి వెళ్లి నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఈసారి ఎన్నికల్లో ఎన్సీపీకి గట్టి పోటి ఇవ్వడానికి మహాకూటమి, ఆమ్ ఆద్మీ పార్టీలు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే బారామతి నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లే. ఎన్సీపీ తరఫున సుప్రియా సూలే తిరిగి పోటీకి సిద్ధమవ్వగా, బీజేపీ, శివసేన, స్వాభిమాని షేత్కారీ సంఘటన, ఆర్పీఐ మహాకూటమి తరఫున రాష్ట్రీయ సమాజ్ పక్ష్(నేషనల్ సోషల్ పార్టీ) అభ్యర్థిగా మహదేవ్ జాన్కర్, ఆమ్ఆద్మీ పార్టీ తరఫున మాజీ పోలీస్ అధికారి సురేష్ ఖోపడే అభ్యర్థిగా ఖరారైనారు. ప్రస్తుతం బారామతి పార్లమెంటు నియోజకవర్గం కింద ఉన్న 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండింటిలో ఎన్సీపీకి చెందిన ఇద్దరు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఒకరు ఉన్నారు. ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య పొత్తులుండగా, మహా కూటమికి చెందిన బీజేపీ ఖాతాలో రెండు, శివసేన ఖాతాలో ఒక అసెంబ్లీ స్థానం ఉన్నాయి. అయితే మారిన రాజకీయాలకనుగుణంగా ఈసారి బారామతి నియోజక వర్గంలో బీజేపీ, శివసేన కాకుండా నియోజక వర్గాన్ని రాష్ట్రీయ సమాజ్ పక్ష్కు ఇవ్వడంతో ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఎంత వరకు సహకారం అందిస్తారో వేచి చూడాల్సిందే. ఇటీవల కాంగ్రెస్-ఎన్సీపీలు వేటికవే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ అధినాయకత్వాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చినప్పటికీ, ఇరు పార్టీల అగ్రనాయకులు పొత్తులకే ప్రాధాన్యత ఇవ్వడంతో సీట్లు సర్దుబాటు జరిగింది. దీనితో కాంగ్రెస్‌లోని కార్యకర్తలు బారామతిలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాలన్న కోరిక నెరవేరక పోయినందుకు నిరాశతో ఇన్నారు. మరి వీరిని ఒకే తాటిపైకి తీసుకురావడానికి నాయకులు కృషి చేయాల్సి ఉంటుంది. పవార్ కంచుకోటను బద్దలు కొడతాం..... మహదేవ్ జాన్కర్ మహా కూటమి తరపున రంగంలోకి దిగుతున్న రాష్ట్రీయ సమాజ్ పక్ష్ అభ్యర్థి మహదేవ్ జాన్కర్ ధృఢ విశ్వాసంతో ఈసారి గెలుపు దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. పవార్ కోటను బద్దలు కొడితే దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగుతుందని ‘టార్గెట్ బారామతి’ అని కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. 5 వేల మంది కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సోలాపూర్ నుంచి ప్రచారానికి పంపించనున్నాడు. ఇందుకు ఇటీవల ఎలాగైనా రాష్ట్ర రాష్ట్రీయ సమాజ్ పక్ష్ అధ్యక్షులైన మహదేవ్ జాన్కర్ విజయానికై ఉత్తర సోలాపూర్‌లో పార్టీ పదాధికారులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సుప్రియ సూలేను ఓడించడానికి ప్రచారంలో నితిన్ గడ్కరీ, గోపీనాథ్ ముండే, ఉద్ధవ్ ఠాక్రేతో పాటు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కూడా ప్రచారానికి పిలవనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమ్ ఆద్మీ ఒంటరి పోరు.... ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ పోలీస్ అధికారి సురేష్ ఖోప్డేను అభ్యర్థిగా ప్రకటించింది. సురేష్ మహారాష్ట్ర పోలీసు ఫోర్సులో 1978లో చేరారు. ఆ తర్వాత అతడు ప్రతిభావంతుడిగా ఎన్నో అవార్డులను అందుకున్నారు. రాజకీయాల్లో నిస్వార్థంగా సేవలను అందించేందుకు ఆప్‌లో చేరానని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. బారామతి అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తానని చెబుతున్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు మరి ఎవరికి పట్టం కట్టబోతున్నారో వేచి చూడాల్సిందే. -
ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్
రాష్ట్రంలోని 12 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ సాక్షి, బెంగళూరు: జన సామాన్యుడి గొంతుక అనే నినాదంతో రాజకీయ తెరపైకి వచ్చి.. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపారేసిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’(ఆప్) రాష్ట్రంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 12 లోక్‌సభ స్థానాల నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దించేందుకు సన్నద్ధమైనట్లు ఆప్ ప్రకటించింది. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆప్ ప్రతినిధి పృథ్వీరెడ్డి మాట్లాడారు. బెంగళూరులోని నాలుగు పార్లమెంటు స్థానాలతో పాటు దక్షిణ కన్నడ, గుల్బర్గా, బిజాపుర, హుబ్లీ-ధార్వాడ, తుమకూరు, బెళ్గాం, చిత్రదుర్గ పార్లమెంటు స్థానాల్లో తమ పార్టీ పటిష్టంగా ఉందని చెప్పారు. అందుకే ఈ 12 స్థానాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెట్టనున్నట్లు తెలిపారు. ఇక ఎన్నికల సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 31లోపు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. దరఖాస్తు దారులు తమ పూర్తి వివరాలతో పాటు తమ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజక వర్గం నుంచి 100 మంది ఓటర్లు తనకు మద్దతునిస్తున్నట్లుగా తెలియజెప్పే సంతకాల పత్రంతో పాటు ఆయా ఓటర్ల ఓటరు గుర్తింపు కార్డు, వారి ఫోన్ నంబర్లను జతచేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ విధంగా అందిన దరఖాస్తులను తమ అధికారిక వెబ్సైట్లో ఉంచి.. ప్రజాభిప్రాయాన్ని కోరతామని తెలిపారు. ఇక తమ పార్టీ పొలిటికల్ స్ట్రాటిజిక్ కమిటీ కూడా ఆయా అభ్యర్థులపై క్రిమినల్ కేసులేవైనా ఉన్నాయా అనే విషయాలను తెలసుకుంటుందని పేర్కొన్నారు. ఒకవేళ అభ్యర్థులెవరైనా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లైతే వారిని మొదటి దశలోనే తిరస్కరిస్తామని తెలిపారు. అనంతరం వారి ఆస్తుల వివరాలు కూడా తెలుసుకొని ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవడంతో పాటు ప్రజలకు సేవ చేయాలనే బలమైన ఆకాంక్ష ఉన్న వారినే ఎంపిక చేస్తామని చెప్పారు. సోషల్ నెట్వర్కింగ్ ద్వారా సభ్యత్వ నమోదు... ‘నానూ జనసామాన్య’(మై భీ ఆమ్ ఆద్మీ) పేరిట ఆప్ ప్రారంభించిన సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆప్ రాష్ట్ర శనివారం నగరంలో ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్రంలో లక్ష మంది ప్రజలు ఆప్ సభ్యులుగా ఉన్నారని పృథ్వీరెడ్డి వెల్లడించారు. ఇక ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ ద్వారా బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను నియమించనున్నట్లు చెప్పారు. ఆప్‌లో సభ్యులుగా చేరేందుకు 07798220033 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపడం లేదా మిస్డ్‌కాల్ ఇవ్వవచ్చని తెలిపారు. అంతేకాక పార్టీ అధికారిక వెబ్సైట్లు www.aapkarnataka.org, aapkaragent@gma il.com ద్వారా సభ్యత్వాన్ని పొందడంతో పాటు పార్టీకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. -
‘మహా’ పార్టీలకు ‘ఆప్’ పోటీ
ముంబై: మహారాష్ట్రలో దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్న కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎమ్మెన్నెస్, ఎన్సీపీలు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కొత్త ప్రత్యర్థిని ఎదుర్కోనున్నాయి. ఇటీవలి ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) మహారాష్ట్రలోనూ కాలు మోపిం ది. మరికొన్ని నెలల్లో జరిగే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 35 జిల్లాల్లోనూ శాఖలను నెలకొల్పిన ఈ నూతన పార్టీ గ్రామస్థాయిలో ప్రజలకు దగ్గరవ్వడానికి కృషి చేస్తోంది. ఆప్ ఆగ్రనాయకుల్లో కేజ్రీవాల్ సహా పలువురు అన్నా హజారే మద్దతుదారులనే విషయం తెలిసిందే. అన్నాకు మహారాష్ట్రలో ఉన్న జనాదరణ ఈ పార్టీకి మేలు చేసే అవకాశముంది. పోలింగ్‌బూత్ స్థాయిలోనూ కమిటీలను నియమించనున్నామని కేజ్రీవాల్ బృంద నాయకుల్లో ఒకరైన ఆప్ ప్రతినిధి మయాంక్ గాంధీ అన్నారు. సామాన్యులు, యువత మద్దతుతో దూసుకుపోతున్న ఈ పార్టీ ఎన్నికల నిర్వహణ కోసం ఇది వరకే 14 రాష్ట్రస్థాయి కమిటీలను నియమించింది. రాష్ట్రంలో 48 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఎంతమందికి టికెట్లు ఇవ్వాలనే విషయమై ఆప్ ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. రాష్ట్ర నాయకత్వంపై గాంధీ స్పందిస్తూ అంజలి దమానియా రాష్ట్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తారని, సుదీర్ఘకాలంగా ప్రజాజీవితంలో ఉన్న వారినే జిల్లాస్థాయి నాయకులుగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. రాయల్‌బ్యాంక్ సీఈఓ మీరా సన్యాల్, స్టార్ టీవీ మాజీ అధికారి సమీర్నాయర్ వంటి వృత్తినిపుణులతోపాటు డబ్బావాలాలు, హాకర్లు, ఆటోయూనియన్లనూ ఈ పార్టీ ఆకర్షిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూట మి 25, బీజేపీ-ఎన్సీపీ కూటమి 20 సీట్లను కైవసం చేసుకున్నాయి. ఆప్‌కు స్థానికంగా పటిష్ట నాయకత్వం లేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఎలా పనిచేస్తుందనేది ఇప్పుడే చెప్పడం కష్టమని కాంగ్రెస్,ఎన్సీపీ నాయకులు అంటున్నారు. ‘ప్రత్యర్థి ఎవరైనా ఎన్నికల్లో గెలుపు కష్టసాధ్యమే. ఆప్ తరహా ప్రయోగాలు చాలా రాష్ట్రాల్లో జరిగాయి. ప్రజలు కిందిస్థాయిలో పనిచేసే నాయకులనే ఆదరిస్తారు. మహారాష్ట్రలో రైతులు, సహకార ఉద్యమం, విద్యాసంస్థలు వంటివి కీలకాంశాలు’ అని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు. మోడీ ఆకర్షణ, ఆదర్శ్ కుంభకోణం, నీటిపారుదల కుంభకోణం వంటివి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి తమ కు ఓట్లు రాల్చుతాయని బీజేపీ-సేన కూటమి ఆశి స్తోంది. అంతేగాక చిన్నపార్టీలను కలుపుకొని ఈసారి అధికారంలోకి రావడానికి వ్యూహరచన చేస్తోంది. మహాకూటమిలోకి ఎమ్మెన్నెస్‌ను తీసుకురావడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలే సంఖ్యే అధికం కాగా, ఇతర పార్టీలు ప్రభుత్వాల సంఖ్య చాలా తక్కువ. కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ విద్యాసంస్థలు, సహకార బ్యాంకులు, సహకార చక్కెర సంస్థల స్థాపన తిరిగి తమకు ఓట్లు తెచ్చిపెడుతాయని కాంగ్రెస్ భావిస్తోంది. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా చూపెట్టడం వల్ల కాస్త ఆకర్షణ పెరగవచ్చని, అయితే ఏదో అద్భుతానికి మాత్రం అవకాశాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. -
కమలోత్సాహం..!
బీజేపీకి బూస్టింగ్ ఇచ్చిన ఉత్తరాది ఎన్నికల ఫలితాలు = యడ్డిని పార్టీలోకి చేర్చుకుంటే పూర్వవైభవం = రాష్ర్టంలో ‘అమ్ఆద్మీ పార్టీ’కి అందివచ్చిన అవకాశం = డీలా పడిన హస్తం సాక్షి, బెంగళూరు : ఢిల్లీ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ, అమ్ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్ర శ్రేణుల్లో ఉత్సాహం నింపగా, ఆరునెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం నైరాశ్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురులేకుండా పోగా, దేశ రాజకీయాల కేంద్రమైన ఢిల్లీలో కొత్తగా పుట్టిన అమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ-ఆప్) కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చింది. చత్తీస్‌ఘడ్‌లో చివరికంటూ పోరాడినా కూడా కాంగ్రెస్ రెండోస్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు త్వరలో రాన ున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైన ల్స్‌గా భావిస్తున్న తరుణంలో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శన ఇక్కడి నాయకుల్లో కలవ రం పుట్టిస్తోంది. ఓట్లు, సీట్ల కోసం ఆంధ్రప్రదేశ్‌ను అడ్డంగా విభజి స్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ముందు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కూడాతుడిచిపెట్టుకుని పోయే పరిస్థితి ఏర్పడింది. ఎన్టీవీ-నీల్సన్ సర్వేతో పాటు వివిధ సర్వేలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దక్షిణాదిలో మరో పెద్ద రాష్ట్రమైన కర్ణాటక పైనే ఆశలు పెంచుకున్నారు. అయితే ఆదివారం వెలువడిన ఫలితాలతో పాటు ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలను బేరీజు వేస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభావం కనిపించదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి-మంత్రుల మధ్య, మంత్రులు-శాసనసభ్యుల మధ్య సఖ్యత లేదన్నది బహిరంగ రహస్యం. ఇక లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీలో అంతర్గత కలహాలు తారస్థాయికి చేరతాయని, ఎన్నికల సందర్భంగా జరిగే టికెట్ల పంపకం తర్వాత ఈ అసంతృప్తి మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రుల పనితీరుపై గవర్నర్ హన్స్‌రాజ్ భరద్వాజ్ కూడా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. ఇక అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి సంతోష్‌లాడ్ పదవిని కోల్పోవడం కూడా ఆ పార్టీ నాయకులకు మింగుడు పడని విషయం. ఇలా పార్టీ నాయకుల్లో సఖ్యత లేకపోవడం, పాలనా పరంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతుండటం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి తీరని నష్టం చేకూరుస్తుందని ఆ పార్టీనాయకులే పేర్కొంటున్నారు. కమలనాథులకు బూస్టింగ్ ..! నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయం ఆ పార్టీ రాష్ట్ర శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి కలిసి వచ్చిన విషయం. ఇదే పంథాను ఇక్కడ కూడా అనుసరించాలని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్ర చెరుకు రైతులకు జరిగిన అన్యాయం, నేర చరిత్ర కలిగిన నాయకులకు మంత్రిమండలిలో స్థానం కల్పించడం వంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది రాష్ట్ర నాయకుల ఆలోచన. అదే విధంగా కర్ణాటక జనతా పార్టీ అధ్యక్షుడు యడ్యూరప్పను తిరిగి పార్టీలో చేర్చుకుంటే పార్టీకి రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకురావ చ్చని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన ప్రక్రియ దాదాపుగా పూర్తయిన విషయం తెలిసిందే. ఇలా రాజకీయ బద్దశత్రువైన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు పార్టీకి దూరమైన నాయకులను తిరిగి దగ్గరకు చేర్చుకుని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 స్థానాలకుగాను కనిష్టంగా 22 స్థానాలు కైవసం చేసుకోవచ్చునని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మ్యానిఫెస్టో.... ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో అమ్ఆద్మీ పార్టీ(ఆప్) రాష్ట్ర శాఖ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ విజయం అందించిన ఉత్సాహంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కూడా తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను నిలపాలని భావిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గానికి ఒక మ్యానిఫెస్టో విడుదల చేసి మంచి ఫలితాలు సాధించిన ‘ఆప్’ రాష్ట్రంలో కూడా ఇదే పంథాను అనుసరించాలని భావిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు పరిధిలోని సమస్యలను ప్రతిబింబిస్తూ వాటి పరిష్కార మార్గాలను సూచించే విధంగా 28 మ్యానిఫెస్టోలను విడుదల చేయాలని భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని బెంగళూరు వంటి నగరాల్లోని యువ ఓటర్లను ఆకర్షించడంపై ఆ పార్టీ ప్రధానంగా దృష్టి సారించనుంది. మెజారిటీ సీట్లు గెలవకపోయినా యూపీఏ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లలో చీలిక తీసుకువచ్చి లాభపడాలనేది ఆ పార్టీ రాష్ట్ర నాయకుల ఆలోచనగా కనిపిస్తోంది.