బీజేపీకి అవకాశం ఇవ్వాలి
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై షీలా దీక్షిత్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమివ్వాలని, ఢిల్లీ ప్రజలకు కూడా అది మంచిదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలు ఉండటమే మంచిదని, ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయికి బీజేపీ చేరుకుని ఉంటే బీజేపీ ఆ పనిచేయవచ్చని షీలా దీక్షిత్ గురువారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకోసం బీజేపీ ఎమ్మెల్యేల వేటలో పడిందంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో షీలా దీక్షిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్నికలు కావాలని కాంగ్రెస్‌గానీ, ఆప్‌గానీ కోరుకోవడంలేదని షీలా దీక్షిత్ అన్నారు. అయితే,..ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? మైనారిటీ ప్రభుత్వం ఎదుర్కొనే సవాళ్లేమిటి?.. ఇవన్నీ బీజేపీకి సంబందించినవేనని ఆమె అన్నారు.
షీలా దీక్షిత్ వ్యాఖ్యలపట్ల బీజేపీ హర్షం వ్యక్తంచేసింది. 15 ఏళ్లపాటు ఢిల్లీలో ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ఆమెకు ప్రభుత్వం ఏర్పాటుపై రాజ్యాంగ నిబంధనలన్నీ తెలుసునని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ అన్నారు. కాగా, షీలా దీక్షిత్ వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం కావచ్చని, ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీకి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుముఖంకాదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ వ్యాఖ్యానించారు.