హస్తినలో ‘సరి-బేసి’ సక్సెస్!
తొలిరోజు బేసి అమలుకు మంచి స్పందన
♦ ‘సరి’ కారుకు రూ.2 వేల జరిమానా
♦ మంత్రి కారులో సచివాలయానికి కేజ్రీవాల్
న్యూఢిల్లీ: దేశరాజధానిలో కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కారు రూపొందించిన ‘సరి-బేసి’ పథకం శుక్రవారం మొదలైంది. తొలిరోజే మెరుగైన ఫలితాలు కనిపించాయి. లక్షల వాహనాలు రోడ్లపైకి రాలేదు. ఉదయం ఎనిమిది గంటలకు పథకం ప్రారంభం కాగానే.. వేల సంఖ్యలో వలంటీర్లు చేతిలో గులాబీలు, పథకం ఉద్దేశం వివరిస్తూ ప్లకార్డులతో ట్రాఫిక్ పోలీసులకు మద్దతుగా రోడ్ల పక్కన నిలబడ్డారు. తొలిరోజు గరిష్టంగా బేసి సంఖ్య వాహనాలే రోడ్లపైకి వచ్చాయి. అయితే.. అక్కడక్కడా సరి సంఖ్య నంబరు వాహనాలు బయటకు వచ్చాయి. ఢిల్లీ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఆ వాహనాలకు రూ.2 వేల జరిమానా విధించారు.
తొలిరోజు 200 ట్రాఫిక్ పోలీస్ బృందాలు, 66 రవాణా విభాగ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, 40 సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్ బృందాలు పథకాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకున్నాయి. దీంతోపాటు ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఢిల్లీ సర్కారు 3 వేల బస్సులను అందుబాటులోకి తెచ్చింది. మెట్రో కూడా 70 ట్రిప్పులను అదనంగా నడిపింది. ట్విటర్ ద్వారా బస్సులు, మెట్రో రైలు రవాణా సమయాలు, రూట్లు, ఆటోల వివరాలను ప్రజలకు సర్కారు అందించింది. అయితే.. శుక్రవారం కొత్త సంవత్సరాది కావటంతో చాలా మంది కార్యాలయాలకు వెళ్లలేదు. దీని వల్లా రోడ్లపై పెద్దగా రద్దీ కనిపించలేదు. సోమవారం నుంచి రద్దీ పెరగనుండటంతో.. అసలు సమస్య అప్పుడుంటుందని పలువురు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా జనవరి 15 వరకు అమల్లో ఉంచనున్నారు.
ఐటీఓ జంక్షన్లో మొదటి ఉల్లంఘన
ఐటీఓ జంక్షన్ వద్ద సరిసంఖ్య నంబరుప్లేటున్న కారును ఆపిన పోలీసులు రూ. 2 వేల జరిమానా విధించారు. కారులో వెళ్లటం తప్ప ప్రత్యామ్నాయం లేదని తొలి జరిమానా చెల్లించిన కారు చోదకుడు చెప్పారు. మొత్తం 203 మందికి జరిమానా వేశారు.
మంత్రి కారులో సీఎం.. అమలు మొదటిరోజు సీఎం కేజ్రీవాల్.. రవాణా మంత్రి గోపా ల్‌రాయ్ కారులో సచివాలయానికి వెళ్లారు. సీఎం, గోపాల్‌రాయ్, పీడబ్ల్యూడీ మంత్రి ఒకే కారులో ప్రయాణించారు. కేజ్రీవాల్ సచివాలయానికి వస్తుండగా.. ‘సరి’ కారులో వెళ్తున్న చోదకుడిని ఆపి.. నియమాన్ని ఉల్లంఘించరాదని వివరించారు. ఉపముఖ్యమంత్రి సిసోడియా బేసి సంఖ్య రిజిస్ట్రేషన్ ఉన్న అధికారిక వాహనంలో, మంత్రులు ఇమ్రాన్ హుస్సేన్ ఈ రిక్షాలో, సందీప్ కుమార్ బస్సులో, కపిల్ మిశ్రా ద్విచక్ర వాహనంపై సెక్రటేరియట్‌కు వచ్చారు. పలువురు ఢిల్లీ ప్రభుత్వ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా కారు పూలింగ్ (ఒకే కార్లో రావటం) చేసుకున్నారు. బీజేపీ ఎంపీ విజయ్ గోయల్ సైకిల్‌పై ప్రయాణించి కాలుష్య నియంత్రణ విధానానికి తన మద్దతు ప్రకటించారు.
ఇదో ఉద్యమం: కేజ్రీవాల్
ఈ విధానం తొలిరోజు విజయవంతం కావటంలో సహకరించిన ప్రజలు, అధికారులు, పోలీసులకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సహకారం వల్లే ముందడుగేస్తున్నామన్నారు. ‘ప్రజల సహకారంతో తొలిరోజు సానుకూల ఫలితాలు కనిపించాయి. ఇది లాఠీతో అమలుచేయించే కార్యక్రమం కాదు. ప్రజల సహకారంతోనే విజయవంతమవుతుంది. ఢిల్లీ వాసులు చూపిన సానుకూల ప్రతిస్పందన అమితానందం కలిగించింది. అందుకే దీన్ని ఓ ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లనున్నాం’ అని చెప్పారు. కొందరు ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు కాలుష్య నియంత్రణకు మద్దతుగా.. సైకిల్‌పై ప్రయాణించారు. క్యాంపస్‌లో కూడా వాహనాల బదులు సైకిల్‌నే ఎక్కువగా వినియోగించాలని నిర్ణయించారు. మరోవైపు ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణం చల్లబడటం, గాలుల వేగం మందగించటం వల్ల మరికొన్ని రోజులపాటు ఈ సమస్య తప్పదని సూచించింది.
పార్టీల మిశ్రమ స్పందన.. సరి-బేసి పథకం పైలట్‌ప్రాజెక్టు అమల్లోకి వచ్చినా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో కేజ్రీవాల్ సర్కారు విఫలమైందని ఢిల్లీ బీజేపీ చీఫ్ సతీశ్ ఉపాధ్యాయ విమర్శించారు. చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లోనే సరికార్లతో రోడ్లపైకి వచ్చి జరిమానా కట్టారన్నారు. అయితే ఈ పథకం ప్రారంభం బాగానే ఉందని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. కాగా, దీనిపై ఇప్పుడే స్పందించటం తొందరపాటవుతుందని.. ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ అన్నారు. కాగా, ప్రజల్లోనూ దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది. ఈ ఫార్ములాను హృదయపూర్వకంగా పాటిస్తున్నట్లు కొందరు చెప్పగా, గత్యంతరం లేకే పాటించాల్సి వస్తోందని మరికొందరన్నారు.
బీజేపీ ఎంపీ ఉల్లంఘన
బీజేపీ ఎంపీ, ముంబై మాజీ పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ ‘సరి-బేసి’ని ఉల్లంఘించారు. ఇండియా గేట్ వద్ద సరిసంఖ్య నంబరు కారులో వెళ్తుండగా ట్రాఫిక్ పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. తనకు భద్రత ఉన్నందున ఈ మినహాయింపు వర్తిస్తుందని సింగ్ చెప్పారు. అయితే ఎంపీలకు అనుమతి లేదని చెప్పిన పోలీసు అధికారులు.. ఎంపీతో జరిమానా కట్టించుకోకుండా.. నిబంధనల కరపత్రాన్ని ఎంపీకి అందజేశారు. కాగా, కేజ్రీవాల్ సోషల్ మీడియాకెక్కిన సత్యపాల్ సింగ్ ఫోటోను రీట్వీట్ చేశారు.