
ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయాలి
వ్యాధులు, ఆవేశపూరిత ప్రవర్తన ఉన్న కుక్కలను షెల్టర్‌కు తరలించాలి
బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారం పెట్టడం నేరం
సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీధి కుక్కల సమస్యపై అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీన ఇచ్చిన ఉత్తర్వు పట్ల జంతు ప్రేమికుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు అభ్యంతరం వ్యక్తంచేయడంతో.. ఆ ఉత్తర్వులో మార్పులు చేస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. కుక్కలకు స్టెరిలైజేషన్(పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్స) పూర్తి చేసిన తర్వాత ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలేయాలని తేల్చిచెప్పింది.
రేబిస్ వంటి వ్యాధులు, ఆవేశపూరిత, విపరీత ప్రవర్తన ఉన్న కుక్కలను మాత్రం స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ అనంతరం ప్రత్యేక షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వు అత్యంత కఠినంగా ఉన్న మాట వాస్తవమేనని సుప్రీంకోర్టు అంగీకరించింది. వీధి కుక్కల బెడద దేశమంతటా ఉన్నట్లు గుర్తుచేసింది. ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రాణాలు సైతం కోల్పోతున్నారని, అందుకే దేశవ్యాప్తంగా వీధి కుక్కల నియంత్రణకు ఒక జాతీయ విధానం తీసుకొచ్చే విషయం ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించింది.
ఢిల్లీలో వీధి కుక్కల వ్యవహారంపై ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కుక్కలన్నింటినీ 8 వారాల్లోగా బంధించి, షెల్టర్లకు తరలించాలంటూ జస్టిస్ పార్దివాలా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను జంతు ప్రేమికులు తప్పుబట్టారు. దాంతో ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ త్రిసభ్య ధర్మాసనానికి ఇప్పగించారు. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజారియాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం మళ్లీ విచారణ చేపట్టింది. తగిన మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో తెలుసుకోకుండా అన్ని కుక్కలను బంధించి, షెల్టర్‌కు తరలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంది. ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు ఏమిటంటే..
→ వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టడం నేరం. ఉల్లంఘించినవారికి శిక్ష తప్పదు.
→ వాటికి ఆహారం అందించడానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వీధుల్లో ఇళ్ల ముందు కుక్కలకు అన్నం పెట్టినవారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి.
→ వీధి కుక్కలను జంతు ప్రేమికులు దత్తత తీసుకోవచ్చు. వాటిని వారు సరిగ్గా సంరక్షించాలి. మళ్లీ వీధుల్లోకి వదిలేయకూడదు.
→ ఢిల్లీలో వీధి కుక్కలను కాపాడాలంటే పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తి రూ.25,000, ఎన్జీఓలు రూ. 2 లక్షల చొప్పున కోర్టులో డిపాజిట్ చేయాలి.
→ కుక్కల సమస్యకు సంబంధించిన హైకోర్టుల్లో ఉన్న పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నాం. ఒక జాతీయ పాలసీని రూపొందించే దిశగా విచారణ చేపడతాం.
→ వీధి కుక్కల కేసులో కేవలం ఢిల్లీని మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం భాగస్వామ్య పక్షాలుగా చేరుస్తున్నాం.
→ సుప్రీంకోర్టు తాజా తీర్పు పట్ల జంతు ప్రేమికులు హర్షం వ్యక్తంచేశారు.
