రాష్ట్రంలోని 12 లోక్‌సభ స్థానాల నుంచి పోటీ
సాక్షి, బెంగళూరు: జన సామాన్యుడి గొంతుక అనే నినాదంతో రాజకీయ తెరపైకి వచ్చి.. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపారేసిన ‘ఆమ్ ఆద్మీ పార్టీ’(ఆప్) రాష్ట్రంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 12 లోక్‌సభ స్థానాల నుంచి తమ అభ్యర్థులను బరిలోకి దించేందుకు సన్నద్ధమైనట్లు ఆప్ ప్రకటించింది. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆప్ ప్రతినిధి పృథ్వీరెడ్డి మాట్లాడారు. బెంగళూరులోని నాలుగు పార్లమెంటు స్థానాలతో పాటు దక్షిణ కన్నడ, గుల్బర్గా, బిజాపుర, హుబ్లీ-ధార్వాడ, తుమకూరు, బెళ్గాం, చిత్రదుర్గ పార్లమెంటు స్థానాల్లో తమ పార్టీ పటిష్టంగా ఉందని చెప్పారు. అందుకే ఈ 12 స్థానాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెట్టనున్నట్లు తెలిపారు.
ఇక ఎన్నికల సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 31లోపు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేయాల్సి ఉంటుందని చెప్పారు. దరఖాస్తు దారులు తమ పూర్తి వివరాలతో పాటు తమ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజక వర్గం నుంచి 100 మంది ఓటర్లు తనకు మద్దతునిస్తున్నట్లుగా తెలియజెప్పే సంతకాల పత్రంతో పాటు ఆయా ఓటర్ల ఓటరు గుర్తింపు కార్డు, వారి ఫోన్ నంబర్లను జతచేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
ఈ విధంగా అందిన దరఖాస్తులను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచి.. ప్రజాభిప్రాయాన్ని కోరతామని తెలిపారు. ఇక తమ పార్టీ పొలిటికల్ స్ట్రాటిజిక్ కమిటీ కూడా ఆయా అభ్యర్థులపై క్రిమినల్ కేసులేవైనా ఉన్నాయా అనే విషయాలను తెలసుకుంటుందని పేర్కొన్నారు. ఒకవేళ అభ్యర్థులెవరైనా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్నట్లైతే వారిని మొదటి దశలోనే తిరస్కరిస్తామని తెలిపారు. అనంతరం వారి ఆస్తుల వివరాలు కూడా తెలుసుకొని ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవడంతో పాటు ప్రజలకు సేవ చేయాలనే బలమైన ఆకాంక్ష ఉన్న వారినే ఎంపిక చేస్తామని చెప్పారు.
సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా సభ్యత్వ నమోదు...
‘నానూ జనసామాన్య’(మై భీ ఆమ్ ఆద్మీ) పేరిట ఆప్ ప్రారంభించిన సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆప్ రాష్ట్ర శనివారం నగరంలో ప్రారంభించింది.
ఇప్పటికే రాష్ట్రంలో లక్ష మంది ప్రజలు ఆప్ సభ్యులుగా ఉన్నారని పృథ్వీరెడ్డి వెల్లడించారు. ఇక ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియ ద్వారా బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను నియమించనున్నట్లు చెప్పారు. ఆప్‌లో సభ్యులుగా చేరేందుకు 07798220033 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపడం లేదా మిస్డ్‌కాల్ ఇవ్వవచ్చని తెలిపారు. అంతేకాక పార్టీ అధికారిక వెబ్‌సైట్‌లు www.aapkarnataka.org, aapkaragent@gma il.com ద్వారా సభ్యత్వాన్ని పొందడంతో పాటు పార్టీకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు.
ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్
Published Sun, Jan 12 2014 2:03 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM
Advertisement