పింప్రి, న్యూస్‌లైన్: దేశ రాజకీయాల్లో కీలక లోక్‌సభ నియోజకవర్గమైన బారామతిలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 20 ఏళ్లకు పైగా ఇక్కడ ఎన్సీపీ హవా నడుస్తుండగా, ఇప్పుడు కాషాయ మహాకూటమి, ఆమ్‌ఆద్మీ పార్టీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. పుణే జిల్లా ఎన్సీపీకి పుట్టినిల్లు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు, అతడి వారసులకు కంచుకోట బారామతి. ముందుగా నియోజక వర్గ స్వరూపాన్ని పరిశీలిస్తే బారామతి లోక్‌సభ నయోజక వర్గం 1957లో పురుడు పోసుకోగా, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది.
ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. 1999 తర్వాత శరద్ పవార్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత ఈ నియోజక వర్గం ఎన్సీపీకి పెట్టని కోటగా మారింది. ఇక్కడ నుంచి ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 8 సార్లు, భారతీయ లోక్‌దళ్ అభ్యర్థి ఒకసారి, ఎన్సీపీ అభ్యర్థులు 3 సార్లు గెలుపొందారు. 1984 లో శరద్‌పవార్ రాజకీయ ప్రవేశంతో బారామతి పూర్తిగా శరద్ పవార్ చేతిలోకి వచ్చింది. పవార్ మొదటిసారి పార్లమెంటు ఎన్నికల్లో సమాజ్ వాది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌కు చెందిన శంకర్‌రావు పాటిల్‌ను ఓడించారు.
ఆ తర్వాత పవార్ తిరిగి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడంతో, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాకడే విజయం సాధించారు. ఈ ఎంపీ స్థానం 1991 నుండి 2009 వరకు శరద్ పవార్, అజిత్ పవార్, సుప్రియా సూలే (శరద్ పవార్ వారసులు) మధ్యనే ఉంటూ వచ్చింది. బారామతి పార్లమెంటు నియోజక వర్గం పునర్విభజన జరిగిన తర్వాత బారామతి కింద బారామతి, దౌండ్, ఇందాపూర్, ఖడక్వాస్లా, పురంధర్, బోర్ నియోజక వర్గాలు కలిశాయి. 2009 ఎన్నికలలో ఎన్సీపీ తరఫున పొటీచేసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పై 17 మంది పోటీ చేయగా, ప్రధాన పోరు బీజేపీ, ఎన్సీపీ మధ్యనే నడిచింది. ఆ ఎన్నికల్లో సుప్రియా సూలే సుమారు 3 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందింది. బీజేపీ, బీఎస్పీ నామ మాత్ర పోటీ ఇచ్చాయి.
మారిన రాజకీయాలు....
నియోజక వర్గ పరిధిలో గల బారామతి, దౌండ్, ఇందాపూర్, పురంధర్ తాలుకాలలో అభివృద్ధి, నీటి సమస్యలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఒక్క బారామతి తాలుకాలోని సగానికిపైగా గ్రామాల్లో నీటి సమస్య అతి తీవ్రంగా ఉంది. రైతుల సమస్యలు అలాగే ఉన్నాయని, శరద్‌పవార్ వ్యవసాయ మంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, సుప్రియా సూలే ఎంపీగా నియోజక వర్గానికి చేసింది ఏమి లేదని ప్రధాన ప్రతిపక్షపార్టీలు ప్రజల్లోకి వెళ్లి నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఈసారి ఎన్నికల్లో ఎన్సీపీకి గట్టి పోటి ఇవ్వడానికి మహాకూటమి, ఆమ్ ఆద్మీ పార్టీలు సన్నద్ధమయ్యాయి.
ఇప్పటికే బారామతి నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లే. ఎన్సీపీ తరఫున సుప్రియా సూలే తిరిగి పోటీకి సిద్ధమవ్వగా, బీజేపీ, శివసేన, స్వాభిమాని షేత్కారీ సంఘటన, ఆర్పీఐ మహాకూటమి తరఫున రాష్ట్రీయ సమాజ్ పక్ష్(నేషనల్ సోషల్ పార్టీ) అభ్యర్థిగా మహదేవ్ జాన్కర్, ఆమ్‌ఆద్మీ పార్టీ తరఫున మాజీ పోలీస్ అధికారి సురేష్ ఖోపడే అభ్యర్థిగా ఖరారైనారు. ప్రస్తుతం బారామతి పార్లమెంటు నియోజకవర్గం కింద ఉన్న 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండింటిలో ఎన్సీపీకి చెందిన ఇద్దరు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఒకరు ఉన్నారు. ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య పొత్తులుండగా, మహా కూటమికి చెందిన బీజేపీ ఖాతాలో రెండు, శివసేన ఖాతాలో ఒక అసెంబ్లీ స్థానం ఉన్నాయి.
అయితే మారిన రాజకీయాలకనుగుణంగా ఈసారి బారామతి నియోజక వర్గంలో బీజేపీ, శివసేన కాకుండా నియోజక వర్గాన్ని రాష్ట్రీయ సమాజ్ పక్ష్‌కు ఇవ్వడంతో ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఎంత వరకు సహకారం అందిస్తారో వేచి చూడాల్సిందే. ఇటీవల కాంగ్రెస్-ఎన్సీపీలు వేటికవే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ అధినాయకత్వాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చినప్పటికీ, ఇరు పార్టీల అగ్రనాయకులు పొత్తులకే ప్రాధాన్యత ఇవ్వడంతో సీట్లు సర్దుబాటు జరిగింది. దీనితో కాంగ్రెస్‌లోని కార్యకర్తలు బారామతిలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాలన్న కోరిక నెరవేరక పోయినందుకు నిరాశతో ఇన్నారు. మరి వీరిని ఒకే తాటిపైకి తీసుకురావడానికి నాయకులు కృషి చేయాల్సి ఉంటుంది.
పవార్ కంచుకోటను బద్దలు కొడతాం.....
మహదేవ్ జాన్కర్ మహా కూటమి తరపున రంగంలోకి దిగుతున్న రాష్ట్రీయ సమాజ్ పక్ష్ అభ్యర్థి మహదేవ్ జాన్కర్ ధృఢ విశ్వాసంతో ఈసారి గెలుపు దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. పవార్ కోటను బద్దలు కొడితే దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగుతుందని ‘టార్గెట్ బారామతి’ అని కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. 5 వేల మంది కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సోలాపూర్ నుంచి ప్రచారానికి పంపించనున్నాడు. ఇందుకు ఇటీవల ఎలాగైనా రాష్ట్ర రాష్ట్రీయ సమాజ్ పక్ష్ అధ్యక్షులైన మహదేవ్ జాన్‌కర్ విజయానికై ఉత్తర సోలాపూర్‌లో పార్టీ పదాధికారులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సుప్రియ సూలేను ఓడించడానికి ప్రచారంలో నితిన్ గడ్కరీ, గోపీనాథ్ ముండే, ఉద్ధవ్ ఠాక్రేతో పాటు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కూడా ప్రచారానికి పిలవనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఆమ్ ఆద్మీ ఒంటరి పోరు....
ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ పోలీస్ అధికారి సురేష్ ఖోప్‌డేను అభ్యర్థిగా ప్రకటించింది. సురేష్ మహారాష్ట్ర పోలీసు ఫోర్సులో 1978లో చేరారు. ఆ తర్వాత అతడు ప్రతిభావంతుడిగా ఎన్నో అవార్డులను అందుకున్నారు. రాజకీయాల్లో నిస్వార్థంగా సేవలను అందించేందుకు ఆప్‌లో చేరానని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. బారామతి అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తానని చెబుతున్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు మరి ఎవరికి పట్టం కట్టబోతున్నారో వేచి చూడాల్సిందే.
‘పవార్’ కోటలో పాగా వేసేదెవరో..
Published Mon, Mar 17 2014 10:45 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement