రాహుల్‌తో ప్రచారంపై విముఖత
సాక్షి, ముంబై: గత లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఏఐసీసీ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీని ప్రచారం చేయడానికి ఆహ్వానించకపోవడమే మంచిదని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. ఆయన ప్రచారంచేసిన నియోజకవర్గాలలో ఓటమ తథ్యమని అనేక మంది కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. వీరికితోడు కాంగ్రెస్ మిత్రపక్షమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కూడా ఆయనతో దూరంగా ఉండాలని భావిస్తున్నారు.
అంతేకాకుండా రాహుల్‌తో ఎలాంటి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదని పవార్ భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అనేక ఎన్నికల్లో ఫ్లాప్ అయిన రాహుల్ గాంధీ నేతృత్వంపై సీనియర్ నాయకులకు నమ్మకం పోయింది. ఎప్పుడు ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తారో, దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది.
ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల తరువాత రాహుల్ ప్రతిష్ట మరింత దిగజారిపోయింది. ఆయనను లక్ష్యంగా చేసుకుని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో కామెంట్‌ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రాహుల్ వద్దు బాబోయ్ అనే మాటలు కాంగ్రెస్‌లో వినిపిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్సీపీ కూడా రాహుల్ గాంధీకి నాలుగు అడుగులు దూరంగానే ఉండాలని భావిస్తోంది. రాహుల్ సామర్థ్యంపై పవార్‌కు ముందునుంచి అనుమానాలున్నాయి.
గత నాలుగైదు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో జీర్ణించుకుపోయిన పవార్‌కు రాహుల్ పని విధానం ఏమాత్రం రుచించడం లేదు. ఈ విషయాన్ని పవార్ అనేసార్లు బహిరంగంగానే వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌తో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు నిరాకరించారు. కేవలం ముంబైలో సోనియా గాంధీ నిర్వహించే బహిరంగ సభలో మాత్రమే పవార్ పాల్గొంటారని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు.
లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా సోనియా సభలోనే పవార్ పాల్గొన్నారు. రాజకీయాల్లో పవార్‌కు ఉన్న అనుభవం, ప్రతిష్టతో పోలిస్తే రాహుల్ ఎందులోనూ సరితూగరని, దీంతో రాహుల్ సభలో పాల్గొనడం పవార్ ప్రతిష్టకు సరికాదంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రచార వేదికను రాహుల్‌తో షేర్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు ఎన్సీపీ నాయకుడొకరు చెప్పారు. కేవలం సమావేశాల్లో మాత్రమే రాహుల్‌తో కలిసి చర్చిస్తారని స్పష్టం చేశారు.