సాక్షి, ముంబై: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 35 సీట్లను మహాకూటమి కైవసం చేసుకుంటుందని బీజేపీ సీనియర్‌నాయకుడు గోపీనాథ్ ముండే పేర్కొన్నారు. దాదర్‌లోని బీజేపీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... లోక్‌సభ ఎన్నికల అనంతరం నాయకులు, పదాధికారులతో సమావేశం నిర్వహించామని, ఈ సమావేశంలో తమ పార్టీ పదాధికారులు, కార్యకర్తలు అత్యధికంగా లోకసభ స్థానాలను మహాకూటమి గెలుచుకుంటుందని చెప్పారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమిలోని అన్ని మిత్రపక్షాలు సమన్వయంతో వ్యవహరించాయన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం 13 సభలు మహాకూటమి తరఫున నిర్వహించామని, వీటిలో రాష్ట్రంలోని ఆరు విభాగాల్లో రెండేసి చొప్పున సభలు నిర్వహించామని, ఫలితంగానే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుచుకోబోతున్నామని ముండే జోస్యం చెప్పారు. వాజపేయి హాయంలో కాషాయ కూటమికి 32 సీట్లు రాగా ఈసారి ఆ రికార్డు బ్రేక్ చేస్తూ 35 సీట్లు కేవసం చేసుకుంటామన్న ధీమాను తమ కార్యకర్తలు వ్యక్తం చేశారని చెప్పారు.
ఎన్సీపీ మద్దతు తీసుకోం...
అధికారాన్ని దక్కించుకునే స్పష్టమైన మెజార్జీ ఎన్డీయేకు వస్తుందని, మరే ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సిన అవసరం రాదన్నారు. ఎన్డీయే అధికారం కోసం ఎన్సీపీ మద్దతు తీసుకుంటుందన్న వార్తల నేపథ్యంలో ముండే ఈ వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధం...
అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని, పార్టీ గెలుపుకోసం నేటినుంచే అహర్నిషలు కష్టపడాలని పదాధికారులకు, కార్యకర్తలకు ఆదేశాలిచ్చామన్నారు. జిల్లాస్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈసమావేశాలకు రాష్ట్రస్థాయి పదాధికారులు, నాయకులు హాజరవుతారని చెప్పారు.
మహాకూటమిగా అసెంబ్లీకి...
లోకసభ ఎన్నికల అనంతరం అసెంబ్లీకి ఎన్నికల్లో కూడా మహాకూటమిగానే పోటీ చేయనున్నట్టు గోపీనాథ్ ముండే స్పష్టం చేశారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేనను మహాకూటమిలో చేర్చుకుంటారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. శివసేన, బీజేపీలతో ఉండే తమ కూటమిలో ఆ తర్వాత ఆర్పీఐ, స్వాభిమాన్ సంఘటనలు చేరిన సంగతి తెలిసిందే. దీంతో భవిష్యత్తులో కూడా తాము మహాకూటమిగానే పోటీ చేస్తామని, ఈ కూటమిలో మరో పార్టీ చేరే ప్రసక్తేలేదన్నారు.
సీట్ల పంపకాలపై తొందర్లోనే చర్చలు...
రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమైన తాము సీట్ల పంపకాల విషయమై త్వరలో చర్చలు జరపనున్నట్టు ముండే తెలిపారు. గత ఎన్నికలలో పోటీ చేసిన స్థానాల్లోనే ఆయా పార్టీలు పోటీ చేస్తాయని, పెద్దగా మార్పులు ఉండవని చెప్పారు. అయితే తమతో జతకట్టిన పార్టీల్లో ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. దీనిపై శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రేతోపాటు ఇతర మిత్రపక్షాల నాయకులతోపాటు త్వరలోనే ఓ సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్టు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
దళితులపై అత్యాచారాల కేసులు సీబీఐకి అప్పగించాలి...
రాష్ట్రంలో దళితులపై అత్యాచారాల కేసులు బాగా పెరిగాయని ముండే ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే జాల్నా, బీడ్, ఔరంగాబాద్‌లలో కేవలం 15 రోజుల వ్యవధిలో దళితులపై జరిగిన మూడు సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఆందోళనకు గురిచేశాయన్నారు. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన దబోల్కర్ హత్య కేసు విషయంలో పోలీసులు ఇంత వరకు ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారని మండిపడ్డారు. ఈ కేసులను సీబీఐకి అప్పగించాలని కోర్టు ఆదేశించడమంటే రాష్ట్ర హోంశాఖ పూర్తిగా విఫలమైనట్లేనని విమర్శించారు.
దళితులపై పెరిగిన అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తామని హోంమంత్రి చెప్పడాన్ని ముండే తప్పుబట్టారు. భవిష్యత్తులో ఏం చేస్తారో చెబుతున్నారేతప్ప ఇప్పుడేం చేస్తారో చెప్పడంలేదన్నారు. దళితులపై కేసులన్నింటిని సీబీఐకి అప్పగించాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. అవసరమైతే ఈ విషయమై తాము కోర్టును ఆశ్రయిస్తామన్నారు. గడ్చిరోలి ఘటనలో మరణించిన పోలీ సులకు శ్రద్ధాంజలి ఘటించే తీరిక కూడా హోంమంత్రికి లేకపోవడం శోచనీయమన్నారు.
టోల్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తాం....
రాష్ట్రంలో టోల్ ధరలను మళ్లీ పెంచాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోందని, దీనిని బీజేపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని ముండే పేర్కొన్నారు. మళ్లీ టెండర్లను పిలిచి, టోల్ వివాదానికి తెరలేపినా తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని రద్దు చేస్తామన్నారు.
డబ్బుల కోసమే...
అనేక రోజులుగా పెండింగ్‌లో ఉన్న అనేక మంది బిల్డర్లకు చెందిన 182 ఫైళ్లు ఒక్కసారిగా లోక్‌సభ ఎన్నికల ముందు క్లియర్ చేయడంపై కూడా ముండే అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్డర్ల నుంచి డబ్బులు అందడం వల్లే సదరు ఫైళ్లు ముందుకు కదిలాయన్నారు. ఆ డబ్బులన్నీ ఢిల్లీకి చేరాయని ముండే ఆరోపించారు.
పేర్ల గల్లంతుకు కారణం అధికార పక్షాలే...
ప్రభుత్వమే తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఓటర్ల జాబితాలో అనేక మంది పేర్లను తొలగించిందని ముండే ఆరోపించారు. ఏకంగా 11 జిల్లాల్లో ఓటర్ల జాబితాలో అనేక మంది పేర్లను తొలగించారని ముండే ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేసి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు సృష్టిస్తాం
Published Wed, May 14 2014 10:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement