Baramati
-
బారామతిలో అజిత్‌పవార్‌కు భారీ మెజారిటీ
పుణె:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ(అజిత్‌పవార్) చీఫ్ అజిత్‌పవార్ భారీ విజయం నమోదు చేసుకున్నారు. శనివారం(నవంబర్23) వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బారామతి నియోజకవర్గం నుంచి అజిత్ ఏకంగా లక్షకుపైగా మెజార్టీతో గెలుపొందారు. మొత్తంగా ఈ ఎన్నికలో ఆయన లక్షా81వేల ఓట్లు సాధించారు. అజిత్ పవార్ తన సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యోగేంద్రపైనే గెలుపొందారు. యోగేంద్ర ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీ నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో పార్టీని విజయతీరాల వైపు నడిపించడంతో పాటు అజిత్‌పవార్ స్వయంగా ఎమ్మెల్యేగా తిరుగులేని విజయం సాధించారు. కాగా, ఐదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బారామతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అజిత్‌పవార్ సతీమణి సునేత్ర పవార్ ఎంపీగా పోటీచేశారు. ఇక్కడ ఈమె శరద్‌పవార్ కుమార్తె సుప్రియా సూలేపై ఓటమి పాలవడం గమనార్హం. -
ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను
పుణే: ఎన్సీపీ దిగ్గజ నేత శరద్ పవార్ త్వరలో రాజ కీయాల నుంచి వైదొల గనున్నారా? అంటే అవు ననే చెప్పుకోవాల్సి ఉంటుంది. మంగళవారం మహా రాష్ట్రలోని బారామ తిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన వెల్లడించిన విషయం దీనిని రూఢీ చేస్తోంది. భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని, యువ తరానికి మార్గదర్శకంగా ఉంటానని శరద్ పవార్ అన్నారు. ‘ప్రస్తుతం అధికారంలో లేను. రాజ్యసభ సభ్యుడిగా మరో ఏడాదిన్నర కొనసాగుతాను. కానీ, ఆ తర్వాత మళ్లీ రాజ్యసభకు పోటీ చేయాలా వద్దా అనే విషయం ఆలోచించాలి. లోక్‌సభకే కాదు, ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయను’అని అన్నారు.‘బారామతి నుంచి 14 సార్లు పోటీ చేశా. ప్రతిసారీ మీరు నన్ను గెలిపించారు. ఒక్కసారి కూడా ఓడించలేదు. కానీ, నేనే దీనికి ముగింపు పలకాలి. కొత్త తరాన్ని ముందుకు తీసుకురావాలి. ఆ తపనతోనే పనిచేస్తున్నా. అధికారం కాదు, ప్రజలకు సేవ చేయాలనేదే నా ఉద్దేశం. ప్రజల కోసం ఇకపైనా పనిచేస్తూనే ఉంటా’అని ఆయన ప్రకటించారు. ఆరు దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న శరద్‌పవార్ వయస్సు 83 ఏళ్లు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు పర్యాయాలు పనిచేశారు. 1967లో మొదటిసారిగా బారామతి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత 57 ఏళ్లలో ఒక్క ఓటమిని కూడా ఎరగని నేత శరద్‌పవార్. -
‘పదవి కోసం కుటుంబం విచ్ఛిన్నం చేస్తావా?’
ముంబై: ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్.. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రాజకీయ పదవుల కోసం తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారని మండిపడ్డారు. బారామతి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న తన మనవడు యుగేంద్ర పవార్ కోసం నియోజకవర్గంలో మంగళవారం ఆయన ప్రచారం చేశారు. అయితే.. తన ప్రసంగం మధ్యలో రుమాలుతో కళ్లు తుడుచుకున్నట్లు నటిస్తూ అజిత్ పవార్‌ను అనుకరించారు. శరద్ పవార్ ప్రసంగిస్తూ.. ‘‘నా తల్లిదండ్రులు, సోదరులు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే పాపాన్ని వాళ్లు నాకు ఎప్పుడూ నేర్పించలేదు. చాలా కాలం క్రితం మహారాష్ట్రను నడిపించే బాధ్యతను ప్రజలు నాకు అప్పగించారు. నేను ఇప్పుడు మార్గదర్శకుడిని, కొత్త తరానికి పార్టీ వ్యవహారాలను అప్పగించా. రాజకీయాల్లోని అనిశ్చితిని ఎత్తిచూపుతూ.. అధికారం కోసం సహచరులను విడిచిపెట్టకూడదు. దురదృష్టవశాత్తు.. మేము అధికారంలో లేనప్పుడు మా సహచరులు కొందరు తెల్లవారుజామున అకస్మాత్తుగా మేల్కొని పదవులకు ప్రమాణం చేశారు. ఆ ప్రభుత్వం నాలుగు రోజులు కూడా కొనసాగలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసినవి విషయాన్ని గుర్తు చేశారు....నాలుగు సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసినా ఆ పదవిని దక్కించుకోవడానికి అజిత్ పవార్ ప్రత్యర్థి పార్టీవైపు వెళ్లారు. అజిత్‌కు ఎక్కువసార్లు ఆ డిప్యూటీ సీఎం పదవి ఇప్పటికే వచ్చింది. అయితే.. ఈ ఒక్కసారి మాత్రమే ఆ పదవిని దక్కించుకోలేకపోతే మీరు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తారా?’’ అని శరద్ పవార్ సూటీగా ప్రశ్నించారు.అయితే.. బారామతి నియోజకవర్గంలో శరద్ పవార్‌కు మనవడు అయిన యుగేంద్ర పవార్ అభ్యర్థిత్వాన్ని ప్రస్తావిస్తూ.. అజిత్ పవార్ సోమవారం విమర్శలు చేశారు. సీనియర్లు కుటుంబంలో చీలికలు రాకుండా చూసుకోవాలని అన్నారు. అయితే దీనిపై ఇవాళ శరద్ పవార్ పైవ్యాఖ్యలతో కౌంటర్ ఇవ్వటం గమనార్హం.చదవండి: మోదీ.. విమానాల ఫ్యాక్టరీని గుజరాత్ తరలించారు: శరద్ పవార్ -
బారామతి బరిలో అజిత్
సాక్షి, న్యూఢిల్లీ/ ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ప్రకటన విడుదలైనప్పటి నుంచి అన్ని పారీ్టలు తమ సన్నాహాలను ముమ్మరం చేశాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. వీరిలో 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ పుణె జిల్లాలో బారామతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం బారామతి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. బారామతి ఎంపీ స్థానం శరద్ పవార్ కుటుంబానికి దశాబ్దాలుగా కంచుకోటగా ఉంటోంది. అందుకే ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో శరద్‌పవార్ కుమార్తె సుప్రియాసూలేపై అజిత్ తన భార్య సునేత్రా పవార్‌ను పోటీకి నిలిపినా సునేత్రా ఓటమిని చవిచూడటం తెల్సిందే. ఛగన్ భుజ్‌బల్ యోలా నుంచి, దిలీప్ వాల్సే పాటిల్ అంబేగావ్ నుంచి పోటీ చేయనున్నారు. 45 మందితో శివసేనజాబితా విడుదల మంగళవారం అర్ధరాత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 45 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. సీఎం ఏక్నాథ్ షిండే మరోసారి కోప్రి పాచ్ పాఖాడి నుంచి పోటీచేయనున్నారు. విలాస్ సందీపన్ భూమ్రే పైఠాన్ నుంచి, మంత్రి ఉదయ్ సమంత్ రత్నగిరి నుంచి బరిలో దిగనున్నారు. రాష్ట్రంలోని అధికార మహాయుతి కూటమి ఇప్పటివరకు 182 పేర్లను ప్రకటించింది. ఇందులో బీజేపీ నుంచి 99 మంది, శివసేన నుంచి 45 మంది, ఎన్సీపీ నుంచి 38 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తన కుమారుడు అమిత్ ఠాక్రేను మాహిం అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దింపారు. శివసేన(యూబీటీ) తొలిజాబితా ఉద్ధవ్‌ఠాక్రే సారథ్యంలోని శివసేన(యూబీటీ) బుధవారం 65 మంది అభ్యర్థుల పేర్లతో తొలిజాబితాను విడుదలచేసింది. పార్టీ నేత, మాజీ రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే సెంట్రల్ ముంబై పరిధిలోని వర్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. యువసేన నేత, ఆదిత్య బంధువు వరుణ్ సర్దేశాయ్ బాంద్రా(ఈస్ట్) నుంచి పోటీచేస్తారు. పార్టీ నుంచి చీలిపోయి పార్టీ పేరు, గుర్తును కైవసం చేసుకున్న ఏక్నాథ్ షిండే పోటీచేస్తున్న కోప్రి పాచ్ పాఖాడి నియోజకవర్గంలో శివసేన(యూబీటీ) తరఫున కేదార్ దిఘే బరిలో దిగుతున్నారు. షిండే రాజకీయగురువు ఆనంద్ దిఘే మేనల్లుడే కేదార్. -
బారామతి నుంచి అజిత్ పవార్ బరిలోకి.. ఎన్సీపీ తొలి జాబితా విడుదల
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీకి మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ).. అసెంబ్లీ ఎన్నికలకు తమ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. మొత్తం 38 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితా ప్రకటించగాగా.. పార్టీ అధినేత అజిత్ పవార్ అతడి కుటుంబానికి కంచుకోట ఉన్న బారామతి స్థానం నుంచి పోటీ చేయనున్నారు.ఎన్సీపీకి చెందిన 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా అభ్యర్థులుగా తొలి జాబితాలో పేర్కొన్నారు. యెవ్లా స్థానం నుంచి ఎన్సీపీ సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్‌బల్, నవాపూర్ సీటు నుంచి దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్‌రావు గవిత్ కుమారుడు భరత్ గవిత్ బరిలోకి దిగుతున్నారు. కాగా, ఎన్సీపీకి చెందిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌ను దిండోరి నుంచి, గతంలో బీజేపీలో ఉన్న మాజీ మంత్రి రాజ్‌కుమార్ బడోలేను అర్జుని-మోర్గావ్ నుంచి, అంబేగాన్ నుంచి దిలీప్ వైస్-పాటిల్, పార్లీ నుంచి ధనంజయ్ ముండే, కాగల్ నుంచి హసన్ ముష్రిఫ్ పోటీ చేయనున్నారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్సీపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు సుల్భా ఖోడ్కే (అమరావతి), హిరామన్ ఖోస్కర్ (ఇగత్పురి)లను కూడా ఎన్సీపీ అభ్యర్థులుగా ఆ పార్టీ ప్రకటించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ. శివసేన(ఏక్నాథ్ షిండే)తో కలిసి ఎన్సీపీ(మహాయుతి కూటమి) పోటీ చేస్తుంది. ఇప్పటికే ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేన పార్టీ 45 మంది అభ్యర్థులతో మంగళవారం తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే కోప్రి-పచ్పఖాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు -
బారామతి అసెంబ్లీ బరిలో అజిత్ పవార్ కుమారుడు?
ముంబై: మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో వేగం పెరుగుతోంది. కీలకమైన బారామతి అసెంబ్లీ స్థానంలో తన కుమారుడు పోటీ చేయటంపై ఎన్సీపీ (అజిత్ పవార్) చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్పందించారు. తను కుమారుడు జయ్ పవార్.. బారామతి నుంచి బరిలో దింపే విషయంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రజాస్వామ్యం. నేను ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా లేను. నేను ఇప్పటికే ఏడెనిమిదిసార్లు పోటీ చేశాను. జయ్ పవార్ బారామతి బరిలో దించాలని ప్రజలు, పార్టీ మద్దతుదారులు కోరుకుంటే పార్టీ పార్లమెంటరీ బోర్డు చర్చిస్తుంది. పార్లమెంటరీ బోర్డు అనుమతి ఇస్తే.. జయ్‌ను బారామతి బరిలో దింపటానికి సిద్ధంగా ఉన్నాం’’ అని అన్నారు.అదే విధంగా తనకు,ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు మధ్య విభేదాల గురించి మీడియాలో వచ్చిన కథనాలను తొలగించాలని మీడియాను కోరారు. తాము ఇద్దరం కలిసి విజయవంతంగా పని చేస్తున్నామని తెలిపారు. ఇటీవల బారామతి లోక్‌సభ స్థానంలో సుప్రియా సూలేపై తన భార్య సునేత్రను పోటీకి దింపడం పొరపాటు అని అజిత్ పవార్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పదించాలని విలేకర్లు కోరగా.. ఈ విషయం గురించి తాను ఇప్పటికే మాట్లాడానని అన్నారు. ‘నేను ఒకరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసే వ్యక్తిని కాదు. నా మనసుకు ఏది అనిపిస్తే అది మాట్లాడతాను. ఈ విషయంపై చర్చ చేయాల్సిన అవసరం లేదు’అని అన్నారు.మరోవైపు.. అజిత్ పవార్ పోటీచేయబోనని వస్తున్న వార్తలపై ఆ పార్టీ నేత సునీల్ తట్కరే స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని అజిత్ పవార్ చెప్పలేదని అన్నారు. ‘అజిత్ పవార్ తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పలేదు. ఆయన కొన్ని ప్రణాళికలు కలిగి ఉండవచ్చు. మేము వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని కోరుకుంటున్నాము’’ అని అన్నారు. అజిత్ పవార్ పెద్ద కుమారుడు పార్థ్ పవార్ 2019లో మావల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ, ఆ ఎన్నికల్లో పార్థ్ పవార్ భారీ మెజార్టీతో ఓడిపోయారు. -
సుప్రియపై భార్యను నిలబెట్టి తప్పు చేశా: అజిత్ పవార్
ముంబై: కుటంబాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను ఇంటి వరకు రానివ్వకూడదని ఆయన అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి తన భార్యను, సోదరి సుప్రియా సులేకు వ్యతిరేకంగా నెలబెట్టి తప్పు చేశానని పేర్కొన్నారు,.రాష్ట్రవ్యాప్తంగా 'జన్ సమ్మాన్ యాత్ర' చేపట్టిన ఉన్న అజిత్ పవార్ ఒక మరాఠీ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల్లో సునేత్రాను(అజిత్ భార్య) పోటీ చేయించాలనే నిర్ణయం ఎన్సీపీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయమని అన్నారు."నేను నా సోదరీమణులందరినీ ప్రేమిస్తాను. రాజకీయాలను ఇంట్లో వరకు రానివ్వకూడదు. నా సోదరిపై సునేత్రను పోటీకి దింపి నేను తప్పు చేశాను. ఇది జరిగి ఉండకూడదు. కానీ పార్లమెంటరీ బోర్డు (ఎన్సీపీ) ఈ నిర్ణయం తీసుకుంది. అది తప్పు అని ఇప్పుడు నేను భావిస్తున్నాను’ అని అజిత్ పవార్ అన్నారు.కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ భార్య సునేత్రపై సుప్రియా సూలే 1.5 లక్షల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. బారామతి స్థానం నుంచి వరుసగా నాలుగోసారి ఆమె గెలుపొందారు. సుప్రియా సూలే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె. ఇదిలా ఉండగా ఎంపీ ఎన్నికల్లో ఓటమి తర్వాతత సునేత్ర పవార్ జూన్ 18న రాజ్యసభకు ఎన్నికయ్యారు. -
ఈవీఎంల భద్రతపై సుప్రియా సూలే సంచలన ట్వీట్
ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెసిన్(ఈవీఎం)ల భద్రతపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సంచలన ఆరోపణలు చేశారు. తాను పోటీచేసిన బారామతి నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లో సీసీ కెమెరాలు సోమవారం ఉదయం 45 నిమిషాల పాటు నిలిచిపోయాయని తెలిపారు.దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేశారు. సీసీటీవీ కెమెరాలు ఆగిపోవడం పూర్తి అనుమానాస్పద ఘటన అని సూలే పేర్కొన్నారు.‘బారామతి ఈవీఎంలు భద్రపరిచిన గోడౌన్ సీసీ కెమెరాలు సోమవారం ఉదయం పనిచేయలేదు. ఇది పూర్తి భద్రతా ఉల్లంఘనా చర్య. దీనిపై ఎన్నికల అధికారులను సంప్రదిస్తే వారి నుంచి సంతృప్త సమాధానాలేవీ రాలేదు.దీనికి తోడు సీసీకెమెరాలు రిపేర్ చేసే టెక్నీషియన్ కూడా ఆ ప్రాంతంలో అందుబాటులో లేడు’అని సూలే తెలిపారు. -
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
పుణె: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోవర్గంలో మంగళవారం పోలింగ్ జరిగింది. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్సీపీ నాయకురాలు, మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ ఈవీఎం పూజలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సింహగఢ్ రోడ్, పుణె సిటీ పోలీస్స్టేషన్లలో ఆమెపై కేసు నమోదైంది.ఓటింగ్ సందర్భంగా ఖడక్వాస్లా ప్రాంతంలోని పోలింగ్ కేంద్రానికి రూపాలి చకంకర్ ప్లేటు, దీపంతో వచ్చారు. ఈవీఎం మెషిన్ వద్ద పూజలు చేశారు. స్థానికి ఎన్నికల అధికారులు ఉన్నతాధికారలకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెపై సింహగఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్‌కు మహాయుతి కూటమి బారామతి లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచి ఆమె కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్న రూపాలి చకంకర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. -
బారామతిలో అలాంటి పనులు పనిచేయవు: అజిత్ పవార్
మహారాష్ట్రలో కీలకమై బారామతి పార్లమెంట్ స్థానంలో పవార్ వర్సెస్ పవార్ పోటీ నెలకొంది. మూడో దశలో మే 7(మంగళవారం) బారామతిలో పోలింగ్ జరగనుంది. ఆదివారంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో పూణె జిల్లాలోని బారామతిలో నిర్వహించిన ఓ ర్యాలీలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘వికాస్ పురుష్’అంటూ ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఇటీవల తన మేనల్లుడు రోహిత్ పవార్‌పై విమర్శలు చేశారు. సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్) అభ్యర్థి సుప్రియా సూలే తరఫున ప్రచారం చేస్తూ రోహిత్ పవార్ భావోద్వేగానికి గురైన విషయాన్ని ప్రస్తావించారు.‘నీ భావోద్వేగాలతో కొంతమంది ఆడుకుంటారని చెప్పాను. కానీ, అలాంటి పనులు బారామతిలో పని చేయవు. విమర్శలు చేయడానికి ప్రయత్నం చేయను. అభివృద్ధి కోసం నిరంతరం పని చేయటానికే నా తొలి ప్రాధన్యం. ఇప్పటివరకు చాలా ప్రచార ర్యాలీలో పాల్గొన్నా. కానీ, ఇంత పెద్దసంఖ్యలో అభిమానులు, జనాలను చూడలేదు. ఇదంతా చూస్తే.. మన గెలుపు ఖాయమని అర్థమవుతోంది. రాజకీయాలు నేర్పింది నేనే అని చెప్పే రోహిత్.. ఇప్పడు నాపై విమర్శలు చేస్తున్నాడు. అయినా నేను వాటిని పట్టించుకోను. అభివృద్ధి కోసం పనిచేయటమే నా తొలి ప్రాధాన్యం’ అని అజిత్ పవార్ అన్నారు. అదేవిధంగా ‘ప్రధాని మోదీ భారత దేశానికి వికాస్ పురుష్. ఈ లోక్‌సభ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. బారామతి గత 15ఏళ్లగా ఎటువంటి నిధులు పొందలేదు. కానీ, ప్రస్తుతం 2499 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు నిధలు అనుమతులు పొందాయి’ అని అజిత్ పవార్ వెల్లడించారు. ఇక.. ఇటీవల సుప్రియా సూలేకు మద్దతుగా ఓ ర్యాలీలో పాల్గొన్న రోహిత్ ప్రవార్ ప్రసంగిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘పార్టీ రెండుగా చీలినప్పుడు నేను పార్టీ కార్యకర్తలతో కలిసి శరద్ పవార్‌ను కలిశాను. మేము, కుటుంబం అండగా ఉంటామని తెలిపాను’’ అని ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు. -
వదినకు రూ.35 లక్షలు బాకీ.. ప్రత్యర్థుల రుణానుబంధం!
పుణె: బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఆసక్తికర విషయం వెల్లడైంది. ఇక్కడి నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరత్ పవార్) అభ్యర్థి సుప్రియా సూలే తన వదిన, ప్రస్తుత ఎన్నికలలో తన ప్రత్యర్థి సునేత్రా పవార్‌కు రూ. 35 లక్షలు బాకీ ఉన్నారు. అలాగే మేనల్లుడు పార్థ్ పవార్‌కు రూ. 20 లక్షలు అప్పున్నారు. తాజాగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో వివిధ సంస్థలు, వ్యక్తులకు చెల్లించాల్సిన అప్పుల వివరాలను సుప్రియా సూలే పేర్కొన్నారు. అదే రోజున ఆమె ప్రత్యర్థి, ఎన్సీపీ అజిత్ వర్గం అభ్యర్థి సునేత్ర పవార్ సమర్పించిన అఫిడవిట్లో కూడా ఈ వివరాలు ప్రతిబింబించాయి. సుప్రియా సూలేకి రూ.35 లక్షలు, ఆమె తల్లి, శరద్ పవార్ సతీమణి అయిన ప్రతిభా పవార్‌కి రూ.50 లక్షలు రుణం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఎలక్షన్ అఫిడవిట్ల ప్రకారం... సుప్రియా సూలే ఆస్తుల విలువ రూ.43.51 కోట్లు కాగా, ఆమె భర్త మొత్తం ఆస్తులు రూ.131 కోట్లుగా ఉన్నాయి. ఇక సునేత్ర పవార్ రూ. 70.95 కోట్ల విలువైన మొత్తం సంపదను వెల్లడించగా, ఆమె భర్త, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ రూ.50.40 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. సుప్రియా సూలే వ్యాపారవేత్త సదానంద్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
Lok sabha elections 2024: బారామతిలో ప‘వార్’
ముంబై: మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ స్థానంలో ఈసారి ఎన్నికలు రంజుగా మారుతున్నాయి. ఇక్కడ వదిన మరదళ్ల పోరు తప్పదని తేలిపోయింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నుంచి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ అభ్యరి్థత్వాన్ని శనివారం ఖరారు చేశారు. ఇక్కడ ఎన్సీపీ(శరద్ పవార్) నుంచి శరద్ పవార్ కుమార్తె, అజిత్ పవార్‌కు సోదరి వరుసయ్యే సుప్రియా సూలే మరోసారి బరిలోకి దిగబోతున్నారు. బారామతిలో పవార్ కుటుంబానికి గట్టి పట్టుంది. దాదాపు సమానమైన అంగబలం, అర్థబలం కలిగిన వదిన మరదళ్లలో విజయం ఎవరిని వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బారామతి నుంచి పోటీ చేయడానికి అవకాశం దక్కడం పట్ల సునేత్ర పవార్ ఆనందం వ్యక్తం చేశారు. ఇది తనకు లక్కీ డే అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు శివసేన, బీజేపీ, ఎన్సీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తన సామర్థ్యంపై విశ్వాసం ఉంచి ఎన్నికల్లో పోటీకి అవకాశం కలి్పంచారని పేర్కొన్నారు. -
ఇప్పటివరకూ సలహాలే.. ఇకపై.. లోక్‌సభ బరిలో డిప్యూటీ సీఎం సతీమణి
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) సతీమణి సునేత్ర పవార్‌ను బారామతి లోక్‌సభ స్థానం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) బరిలో నిలిపింది. పార్టీ ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత నిర్వహించిన కార్యక్రమంలో సునేత్ర పవార్ మాట్లాడుతూ ప్రజల మద్దతు కోరారు. "మీరు ( బారామతి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు ) మాకు మద్దతు ఇస్తే, మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం" అని సునేత్ర అన్నారు. తన భర్త అజిత్ పవార్ చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావించారు. వాటి పట్ల గర్వపడుతున్నట్లు చెప్పారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తానూ తన వంతు ప్రయత్నం చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు "దాదా" ( అజిత్ పవార్‌ను మద్దతుదారులు ఇలా పిలుస్తారు) ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఆయనకు ప్రజల సమస్యలు తెలియజేయడం వరకే తన పాత్ర ఉండేదని ఆమె చెప్పారు. "నా పేరు బారామతికి అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో మీరు మాకు అవకాశం ఇస్తే, మేమిద్దరం ( అజిత్ పవార్, సునేత్ర పవార్ ) మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం" అన్నారు. ఆడపడుచు స్థానంలోకి అన్న భార్య.. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమవుతుండటంతో సునేత్రా పవార్ అభ్యర్థిత్వంపై గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, లోక్‌సభ ఎన్నికలకు అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి అభ్యర్థి సునేత్రా పవార్ . బారామతి సీటు ప్రస్తుతం అజిత్ పవార్ సోదరి, శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా సూలే (Supriya Sule) చేతిలో ఉంది. సూలే 2009 నుండి బారామతి ఎంపీగా ఉన్నారు. శరద్ పవార్ 1996 నుండి 2009 వరకు ఆ స్థానాన్ని పవార్ కుటుంబానికి బలమైన కోటగా పరిగణించారు. -
Maharashtra Politics: బారామతిలో ప‘వార్’!
ఎన్సీపీ పార్టీని చీల్చి బీజేపీ ప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టిన అజిత్ పవార్.. తన భార్యను రాజకీయ అరంగేట్రం చేయిస్తున్నారా? అందులోనూ దిగ్గజ నేత శరద్‌పవార్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్న‘బారామతి’ నుంచే బరిలో దింపుతున్నారా? అంటే ఎన్సీపీ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ వార్తలను బలం చేకూరుస్తూ ఇప్పటికే కొన్ని చోట్ల ‘బారామతి ఎంపీ సునేత్రా పవార్’ అంటూ భారీ హోర్డింగ్‌లనూ పెట్టేశారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనే పుకార్లు బారామతి నియోజకవర్గంలో షికార్లుచేస్తున్నాయి. అసలు సునేత్రా పేరు తెరమీదకు ఎందుకొచి్చంది? అనే ప్రశ్నకు ఆమె భర్త అజిత్ వ్యాఖ్యల్లో సమాధానం దొరుకుతుంది. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో డెప్యూటీ సీఎం అజిత్ పవార్ భావోద్వేగంతో చేసిన ప్రసంగం ఈ వార్తలకు బలం చేకూర్చింది. బారామతి లోక్‌సభ స్థానం నుంచి ఎవరిని నిలపబోతున్నారో ఆయన స్పష్టంగా చెప్పకపోయినా.. ‘ ఈసారి బారామతిలో కొత్త అభ్యరి్థని నిలుపుతాం. తొలిసారి పోటీచేస్తున్న అభ్యరి్థ.. మన భవిష్యత్ తరాల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా పనిచేయగలరు. కొందరు ‘పాత’ భావోద్వేగాలతో ఓటేయాలని మిమ్మల్ని అడుగుతారు. పట్టించుకోకండి. జరగబోయే నిరంతర అభివృద్ధిని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి. మొదటిసారి పోటీచేస్తున్నా ఆశీర్వదించండి. అభివృద్ధిని గెలిపించండి’ అని పిలుపునిచ్చారు. వెంటనే భార్య సునేత్రనే ఆయన రంగంలోకి దింపబోతున్నారని భావించిన ఎన్సీపీ పార్టీ వర్గాలు ఆ నియోజకవర్గం ప్రధాన కూడళ్లలో భారీ హోర్డింగ్‌లు పెట్టేశాయి. కాబోయే ఎంపీ సునేత్రా పవార్ అని రాసి ఉన్న ప్లెక్సీలతో బారామతిలో అప్పుడే ఎన్నికల కోలాహలం మొదలైంది. శరద్‌పవార్ కుటుంబానికి కంచుకోట ఈ నియోజకవర్గం. ఇక్కడ ఎన్సీపీ దిగ్గజ నేత శరదపవార్ కూతురు సుప్రియా సూలే సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. 2009 ఏడాది నుంచి అప్రతిహతంగా ఆమె జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆమెను ఢీకొట్టాలంటే తమ కుటుంబానికే చెందిన మహిళా అభ్యర్థి అయితేనే ఎన్నికల రణరంగంలో నెగ్గుకు రాగలరని అజిత్ పవార్ భావిస్తున్నారు. అందుకే భార్యను బరిలో నిలుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్సీపీ పార్టీని అజిత్ పవార్ చీలి్చన నేపథ్యంలో పార్టీ ఓటర్లు సైతం రెండు వర్గాలుగా చీలే అవకాశముంది. అప్పుడు సుప్రియా, సునేత్రలలో ఎవరు గెలుపు తలుపు తట్టగలరో వేచి చూడాల్సిందే. ఎవరీ సునేత్రా? అజిత్ భార్యగా తప్పితే రాజకీయ వర్గాల్లో ఎవరికీ తెలియని పేరు సునేత్ర. ఆమె చాలా సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. శరద్‌పవార్‌కు ఒకప్పటి సన్నిహిత నేత, మాజీ మంత్రి పద్మసిన్హా పాటిల్ చెల్లెలే ఈమె. ప్రత్యక్ష రాజకీయాలు ఈమెకు కొత్త. ఎని్వరాన్‌మెంట్ ఫోరమ్ ఆఫ్ ఇండియా పేరిట ఒక ఎన్జీవోను సునేత్ర నడుపుతున్నారు. సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని ఈమె అమితంగా ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణహిత గ్రామాల స్థాపనకు కృషిచేస్తున్నారు. ప్రముఖ విద్యాసంస్థ ‘విద్యా ప్రతిష్ఠాన్’కు ట్రస్టీగా ఉన్నారు. ఫ్రాన్స్‌లోని మేథో సంస్థ వరల్డ్ ఎంటర్ప్రెన్యూర్íÙప్ ఫోరమ్‌లో 2011 నుంచి భాగస్వామిగా కొనసాగుతున్నారు. అయితే ఈమె మెల్లిగా ప్రచారకార్యక్రమాలు మొదలెట్టినట్లు తెలుస్తోంది. 2019లో సుప్రియాపై పోటీచేసి ఓడిపోయిన బీజేపీ మహిళా అభ్యర్థి కంచన్ రాహుల్ కౌల్‌ను ఈవారమే కలిసి చర్చించారని వార్తలొచ్చాయి. అజిత్, సునేత్రలకు ఇద్దరు కుమారులు. జై పవార్, పార్థపవార్. 2019లో మావాల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి పార్థపవార్ ఓటమిని చవిచూశారు. కంచుకోట బారామతి పవార్ల కుటుంబానికి పుణె జిల్లాలోని బారామతి పెట్టనికోట. గత 55 సంవత్సరాలుగా ఇక్కడ వీరిదే హవా. తొలిసారిగా మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో 1967లో బారామతి ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి పోటీచేసి శరద్‌పవార్ గెలిచారు. తర్వాత 1972, 1978, 1980, 1985, 1990 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్థానంలో ఘన విజయం సాధించారు. ఇదే బారామతి లోక్‌సభ స్థానం నుంచీ శరద్‌పవార్ 1984, 1996, 1999, 2004 ఎన్నికల్లో విజయఢంకా మోగించారు. అజిత్ పవార్ సైతం 1991లో ఇదే లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడి నుంచి అజిత్ ఏకంగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం బారామతి ఎమ్మెల్యే అజితే. 2009 నుంచి సుప్రియా సూలే ఇక్కడ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఇక్కడ ఈసారి సునేత్రను దింపితే స్పష్టంగా ‘పవర్’ప్లే మొదలైనట్లే. పెదనాన్న కొడుకైన అజిత్.. సుప్రియాకు అన్నయ్య అవుతారు. ఆ లెక్కన వదినా, మరదళ్ల పోరులో గెలుపెవరిదో చూడాలి మరి! – సాక్షి, నేషనల్ డెస్క్ -
దేశ నలుమూలల నుంచి నాట్య తోరణంలో పాల్గొన్న నృత్యకారులు
-
షాకింగ్ ఘటన: ఒక్కసారిగా పాడెపై నుంచి లేచిన బామ్మ
ముంబై: కరోనాతో మృతి చెందిందని వృద్ధురాలికి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె అంత్యక్రియలకు బంధువులను పిలిపించారు. కొద్దిసేపట్లో అంత్యక్రియలు మొదలు పెట్టనుండగా ఒక్కసారిగా ఆ పెద్ద మనిషి పాడెపై నుంచి ఏడుస్తూ కళ్లు తెరిచింది. దీంతో బంధువులంతా షాకయ్యారు. ఎలాగోలా తమ బామ్మ బతికిందని కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బామ్మ ఆస్పత్రిలో ఉంది. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముధాలేలోని బారామతి గ్రామానికి చెందిన శకుంతల గైక్వాడ్ (76)కు మే 10వ తేదీన కరోనా సోకిందని తేలింది. దీంతో కుటుంబసభ్యులు కారులో ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆస్పత్రిలో ఆమెకు బెడ్ లభించలేదు. దీంతో కారులోనే చాలాసేపు వేచి ఉన్నారు. ఈ సమయంలో బామ్మ శకుంతల అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆమెలో చలనం లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె మృతి చెందిందని భావించారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. శకుంతల మృతదేహాన్ని పాడెపై ఉంచి బంధవులంతా ఏడుస్తుండగా అకస్మాత్తుగా శకుంతల ఏడుస్తూ కళ్లు తెరిచింది. ఒక్కసారిగా కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. బామ్మ చనిపోలేదు.. బతికే ఉందని భావించి ఒక్క క్షణం తర్వాత తేరుకుని ఆనందపడ్డారు. వెంటనే ఆమెను బారామతిలోని సిల్వర్ జూబ్లీ ఆస్పత్రిలో చేర్పించారు. చదవండి: మానవత్వం చాటిన ఎమ్మెల్యే కంచర్ల -
షుగర్ బెల్ట్‌లో ఎవరిది పవర్?
శరద్‌పవార్‌కు పెట్టని కోట అయిన షుగర్ బెల్ట్‌లోని సొంత నియోజకవర్గం బారామతిలో ఈసారి పోటీ రసవత్తరంగా మారింది. మహారాష్ట్రలోని బారామతి పార్లమెంటు నియోజకవర్గంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడూ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడూ శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేని ఓడించేందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా యత్నిస్తోంది. బారామతిలో రెండు పర్యాయాలు విజయఢంకా మోగించి, ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగిన సుప్రియకి గట్టిపోటీ ఇవ్వగల బలమైన స్థానిక అభ్యర్థిని నిలబెట్టాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా సూచన మేరకు రాష్ట్రీయ సమాజ్ పక్ష (ఆర్ఎస్పీ) నాయకుడూ, ఎమ్మెల్యే రాహుల్ కుల్ భార్య కంచన్ కుల్‌ను బరిలోకి దింపారు. అయితే శరద్ వారసురాలిగా సుప్రియకు గతంలోనే దక్కిన గుర్తింపు ఈసారి సైతం దక్కనుందా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఓ పక్క శరద్‌పవార్ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడంతో ఆయన కుమార్తెకే పవర్ దక్కుతుందనే ఆశాభావంతో నేషనల్ కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉంది. మరాఠా ప్రజల్లో తనదైన స్థానాన్ని దక్కించుకున్న పవార్ కుటుంబానికి అదే సామాజిక వర్గానికి చెందిన అజిత్ పవార్ భార్యకి దగ్గరి బంధువు కంచన్ కుల్ కూడా గట్టిపోటీ ఇస్తారనే భావన కూడా జనంలో వ్యక్తమవుతోంది. ఎవరీ కంచన్ కుల్? శరద్ పవార్ సొంత నియోజకవర్గంలో ఆయన సొంత కూతురు సుప్రియపై కంచన్ రాహుల్ కుల్ పోటీ చేస్తున్నారు. ప్రముఖ నింబోల్కర్ కుటుంబానికి చెందిన కంచన్ కుల్ బారామతిలోనే జన్మించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ భార్య, సునేత్రకి కంచన్ కుల్ దగ్గరి బంధువు కూడా కావడం విశేషం. కంచన్ కుల్ భర్త రాహుల్ కుల్ ఆర్ఎస్పీ శాసనసభ్యుడు. 2014 ఎన్నికల్లో ఆర్ఎస్పీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రాహుల్ కుల్ తొలుత నేషనల్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. బారామతిలో బీజేపీ అభ్యర్థి పెద్ద మెజారిటీతో గెలుస్తారని అమిత్‌షా ఢంకా బజాయించి చెబుతున్నారు. పవార్ కుటుంబం గతమెన్నడూ లేని విధంగా హోరాహోరీ జరిగిన పోరుకు 2014 ఎన్నికలు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాయి. 2014లో సుప్రియకి ఆర్ఎస్పీ వ్యవస్థాపకుడు మహదేవ్ జంకర్ గట్టిపోటీ ఇవ్వడంతో ఈసారి కూడా అదే పార్టీ నుంచి కంచన్ కుల్ బరిలోకి దిగడంతో గెలుపు ఎవరిని వరిస్తుందన్న ఆసక్తి నెలకొంది. ఎన్సీపీ పట్టు.. పవార్ సొంత నియోజకవర్గంలో బీజేపీ–శివసేన పట్టు సాధించేందుకు చేసిన ప్రయత్నమల్లా తమంతట తాముగా తమ బలాన్ని పెంచుకోవడం కాకుండా ఎన్సీపీ–కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలోకి తెచ్చుకోవడంపై ఆధారపడటం గమనించాల్సిన విషయం. 2014లో బీజేపీ శివసేన ఈ ప్రాంతంలోని మొత్తం 10 సీట్లలో ఐదింటిని గెలుచుకోగలిగింది. ఎన్సీపీ నాలుగు సీట్లూ, బీజేపీ–శివసేన పొత్తులోని స్వాభిమాన్ షేట్కారీ సంఘటన (ఎస్ఎస్ఎస్) ఒక్క సీటుని గెలుచుకోగలిగాయి. అయితే ఈసారి గెలుపు కోసం ఇరు వర్గాలూ హోరాహోరీ పోరాడుతున్నాయి. రైతుల అసంతృప్తి.. ఒకపక్క బీజేపీ–శివసేన నాయకులు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించిన ఈ పార్లమెంటు స్థానంలో తమ పునాదులను కాపాడుకోవడం కోసం షెట్కారీ సంఘటన సహా కాంగ్రెస్ –ఎన్సీపీ నాయకులు సైతం ఈ స్థానంలో తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తన సొంత నియోజకవర్గంలో సర్వశక్తులనూ ఒగ్గయినా కుమార్తెను గెలిపించుకునేందుకు పాటు పడుతున్నారు. పవార్.. తనకు పట్టున్న షుగర్ బెల్ట్‌లో తన బలాన్ని నిరూపించుకోవడం ద్వారానే జాతీయ రాజకీయాల్లో తన స్థానాన్ని నిలబెట్టుకోగలరన్న అభిప్రాయంతో ఎన్సీపీ ఉంది. మరోవైపు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ తన పునాదులను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. గ్రామీణ ప్రాంత ఓట్లే కీలకం.. 2011 జనాభా లెక్కల ప్రకారం పూనేలోని బారామతి పార్లమెంటు నియోజకవర్గంలో 22,89,007 జనాభా ఉంటే అందులో అత్యధికంగా 82.82 శాతం మంది గ్రామీణ ప్రాంతాల వారే. కేవలం 17.18 శాతం మంది పట్టణ ప్రజలున్నారు. షెడ్యూల్డ్ కులాలు, జాతులు 12.51, 2.06 శాతంగా ఉన్నాయి. 2016 గణాంకాల ప్రకారం ఈ నియోజకవర్గంలో మొత్తం 19,22,205 మంది ఓటర్లున్నారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో 58.83 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. అలాగే 2009లో ఇక్కడ పోలింగ్ కేవలం 46.07 శాతమే నమోదైంది. సుప్రియా సూలేకి కలిసొచ్చే అంశాలు యూపీఏ ప్రభుత్వంలో శరద్ పవార్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండగా రైతులకు రుణమాఫీ చేయడం రైతాంగంలో మంచి పేరు తెచ్చింది. అలాగే మహిళా సాధికారత కోసం సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను ఏర్పాటు చేయడం, ‘విద్యా ప్రతిష్ఠాన్’ కింద అత్యధిక సంఖ్యలో విద్యాసంస్థల ఏర్పాటు వంటి సేవా కార్యక్రమాలు పవార్ ఫ్యామిలీ పవర్‌ని బలోపేతం చేశాయి. ఈ అంశాలే ఇప్పుడు సుప్రియా సూలే ప్రచార సరళిని ఊపందుకునేలా చేశాయి. తండ్రి శరద్ పవార్ నుంచి ఏం నేర్చుకున్నారన్న ప్రశ్నకి బదులుగా ‘లోతైన అధ్యయనం, కష్టపడే తత్వం’ అని సమాధానమిచ్చారు తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న సుప్రియా సూలే. అయితే తను ఇచ్చే హామీలపైనా, తన ఆచరణపైనా స్థానిక ప్రజలకు అపారమైన నమ్మకముందనీ, అదే తనకు ఓట్లు కుమ్మరిస్తుందనీ సుప్రియా సూలే ఆశాభావంతో ఉన్నారు. 2014 ఎన్నికల చిత్రం గెలుపొందిన అభ్యర్థి సుప్రియా సూలే (ఎన్సీపీ) వచ్చిన ఓట్లు 5,21,562 ఓడిపోయిన అభ్యర్థి మహదేవ్ జగన్నాథ్ జంకర్ (ఆర్ఎస్పీ) వచ్చిన ఓట్లు 4,51,843 మొత్తం ఓటర్లు 18,13,543 పోలైన ఓట్లు 10,66,556 -
కీలక నియోజకవర్గాలు: ఈ విశేషాలు తెలుసా!?
కాషాయ కోట గుజరాత్‌లోని లోక్‌సభ నియోజకవర్గమిది. ఇంతకు పూర్వం దీనిని బరోడాగా పిలిచేవారు. 2009 నుంచి వడోదర అని పిలుస్తున్నారు. బరోడా మహారాజు ఫతేసింగ్‌రావ్ గైక్వాడ్ ఈ నియోజకవర్గం మొట్టమొదటి ఎంపీ. 2009లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. బరోడా రాజ వంశానికి చెందిన ముగ్గురు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1991 ఎన్నికల్లో టీవీ రామాయణంలో సీతగా నటించిన దీపికా చిఖాలియా బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్ మిస్త్రీపై 5,70,128 ఓట్ల రికార్డు మెజారిటీతో గెలిచారు. అయితే, ఆ ఎన్నికల్లో మోదీ వారణాసి నుంచి కూడా పోటీ చేసి గెలిచారు. దాంతో వడోదరను వదిలేసుకున్నారు. ప్రస్తుతం బీజేపీ నేత రంజన్‌బెన్ ధనంజయ్ భట్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1998 నుంచి ఇంత వరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఇక్కడ బీజేపీయే గెలిచింది. ఈ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు(సావ్లి, వఘోదియా, వడోదర షహెర్, సయజిగంజ్, అకోట, రావుపుర, మంజల్పూర్) ఉన్నాయి. మేనకా గాంధీ అడ్డా ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీ సతీమణి మేనకా గాంధీ సొంత నియోజకవర్గంగా పేరు పొందింది ఫిలిబిత్. అంతే కాకుండా దేశంలో ఒక మహిళను ఐదు కంటే ఎక్కువ సార్లు పార్లమెంటుకు పంపిన ఘనత కూడా ఈ నియోజకవర్గానిదే. ప్రారంభంలో వరసగా మూడు సార్లు ఇక్కడ ప్రజా సోషలిస్టు పార్టీ (పీఎస్పీ) గెలిచింది. తర్వాత నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1989 నుంచి మేనకాగాంధీ ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఆమె వివిధ పార్టీల అభ్యర్థి, ఇండిపెండెంటుగా పోటీ చేసినా గెలవడం విశేషం.1991లో అయోధ్య ప్రభావంతో జనతాదళ్ తరఫున పోటీ చేసిన మేనకా గాంధీ బీజేపీ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆమె బీజేపీలో చేరారు. 2004, 2014లలో మేనకాగాంధీ బీజేపీ టికెట్టుపై ఇక్కడ పోటీ చేసి గెలిచారు. 2009లో మేనకాగాంధీ కుమారుడు వరుణ్ గాంధీ ఈ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆమె అవోన్లా నుంచి గెలిచారు. గత ఎన్నికలో ఆమె సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి బద్సేన్ వర్మపై 3,07,052 ఓట్ల ఆధిక్యతతో ఈ స్థానం నుంచి గెలిచారు. శరద్ పవార్‌దే పవర్ మహారాష్ట్రలోని మరో కీలక నియోజకవర్గం బారామతి. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతో(దవుంద్, ఇండపూర్, బారామతి, పురందర్, భోర్, కథక్వశాల) కూడిన ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా సూలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన శరద్ పవార్ ఈ పార్టీని స్థాపించారు. 1957 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో 9 సార్లు కాంగ్రెస్‌పార్టీ విజయం సాధించింది. శరద్‌పవార్ 1984లో ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) తరఫున పోటీ చేసి నెగ్గారు. 1991 ఉప ఎన్నికల నుంచి 1998 వరకు ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999 నుంచి 2004 వరకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. 2009 నుంచి ఆయన కుమార్తె సుప్రియ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె ఆర్‌ఎస్‌పీఎస్ అభ్యర్థి మహదేవ్ జగన్నాథ్ జంకార్పై 69,719 ఓట్ల ఆధికత్య సాధించారు. పట్నా సాహిబ్.. సిన్హా బిహార్ రాజధాని పట్నా జిల్లాలో ఉందీ నియోజకవర్గం. 2008 వరకు రాజధాని పట్నా ఒకే నియోజకవర్గంగా ఉండేది. ఆ సంవత్సరం నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో దీనిని రెండు నియోజకవర్గాలు చేశారు. ఒకటి పట్నా సాహిబ్ కాగా రెండోది పాటలీపుత్ర (బిహార్‌ను పూర్వ పాటలీపుత్రం అని పిలిచేవారు). దీని పరిధిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు (భక్తియార్పూర్, దిఘ, బంకిపూర్, కుమ్రార్, పట్న సాహిబ్, ఫతుహ) ఉన్నాయి. బీజేపీ తరఫున శత్రుఘ్న సిన్హా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009 ఎన్నికల్లో కూడా ఈయనే గెలిచారు. గత ఎన్నికల్లో శత్రుఘ్న సిన్హా కాంగ్రెస్ అభ్యర్థి కునాల్ సింగ్‌పై 2,65,805 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. -
బారామతి.. ఈసారి ఎవరిదో?!
- ఎన్సీపీ కంచుకోటలో త్రిముఖ పోరు - అజిత్‌కు గట్టిపోటీనివ్వనున్న బీజేపీ, శివసేన - కాంగ్రెస్, బీఎస్పీ పోరు నామమాత్రమే - బీజేపీ గెలుపుపై ప్రభావం చూపనున్న శివసేన - కాషాయ ఓట్లు చీలే ప్రమాదం పింప్రి, న్యూస్‌లైన్ : ప్రస్తుత పరిస్థితుల్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ గెలుపు సులువేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్సీపీకి బారామతి పుట్టినిల్లు. ఆ పార్టీ అధినేత శరద్ పవార్ ఇక్కడినుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1991 నుంచి అజిత్ పవార్ ఐదుపర్యాయాలుగా ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ఆరవసారి. ప్రతిసారి ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాగేది. కానీ ఈసారి గెలుపు అంత సులువుగా కనిపించడం లేదు. ఈసారి బీజేపీ కూటమి, ఎన్సీపీల మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. ఇక్కడ గత లోక్‌సభ ఎన్నికల్లో సుప్రియా సూలే మెజార్టీ గతంతో పోల్చితే చాలా వరకు తగ్గిపోయింది. స్థానిక సమస్యలను పట్టించుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మంచినీటి, తాగునీటి సమస్య, జనాయి-శిరసాయి పథకం, పుంధర్లో సూక్ష్మబిందు సేద్యం పనులు, చెరకు మద్దతు ధర, టోల్, ధంగర్ల రిజర్వేషన్లు, పవార్ల చేతిలో ఉన్న సోమేశ్వర్ చక్కర కర్మాగార ఆర్థిక పరిస్థితి లాంటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎన్సీపీకి ఈ వర్గాల నుంచి మద్దతు లభించడం సందేహమే. అయితే బారామతి నగర,తాలూకాలోని గ్రామ గ్రామాన కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎన్సీపీ ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. అజిత్ పవార్ ఈసారి ప్రచారాన్ని తన భార్య సునేత్రా పవార్, కూతుర్లు పార్థ్, జయ్లపై విడిచి పెట్టారు. మరోవైపు బీజేపీ తరఫున బరిలోకి దిగిన బాలాసాహెబ్ గావడే ధంగర్ల రిజర్వేషన్ల సమితి కార్యాధ్యక్షుడు. నియోజక వర్గంలో ధంగర్లు ఏకతాటిపైకి వచ్చి ప్రచారంలో పాల్గొనడం అతడికి శుభ పరిణామంగా భావిస్తున్నారు. ఎన్సీపీకి చెందిన సీనియర్ నాయకుడు చంద్రారావు తావరే బీజేపీలో చేరి ప్రచారంలో ముందుండి నడిపిస్తుండడం ఈసారి గావడేకు కలసి వచ్చే అంశం. పవార్ ఆధీనంలో ఉన్న చక్కర కర్మాగారాలు చేజారిపోవడం, శేత్కారీ కృతి సమితి నేత సతీష్ కాకడే, రంజన్ తావరే, అజిత్ పవార్‌కు కుడి భుజంగా ఉన్న మాజీ పంచాయతీ సమితి అధ్యక్షుడు అవినాష్ గోఫణే ఈసారి బీజేపీ పక్షాన చేరడం అజిత్‌కు ఇబ్బందికరమైన పరిస్థితులేనని చెప్పవచ్చు. అలాగే స్వాభిమాన్ శేత్కారీ సంఘటన, రాష్ట్రీయ సమాజ్ పక్ష్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బీజేపీ కూటమిగా ఇక్కడ బరిలోకి దిగాయి. దీంతో గావడే రెట్టింపు ఉత్సాహంతో పవార్‌కు దీటుగా పోటీ ఇస్తున్నారు. శివసేన నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర కాలే బరిలో దిగారు. ఈయన గత ఏడాది కాలంగా గ్రామ గ్రామాన యువసేన విభాగాలను స్థాపించి శివసేనను బలోపేతం చేస్తూ వస్తున్నారు. శివసేన పోటీలో ఉండడం ద్వారా కాషాయ ఓట్లు చీలే అవకాశం ఉంది. అది ఎంత వరకు చీలుతుందో అనే దానిపై బీజేపీ విజయం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం బారామతిలో ఎన్సీపీ నుంచి అజిత్‌పవార్, బీజేపీ కూటమి తరఫున బాలాసాహెబ్ గావడే, శివ్ సేన నుంచి రాజేంద్ర కాలేల మధ్యనే పోటీ నెలకొని ఉంది. వీరితో పాటు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అడ్వకేట్ ఆకాష్ మోరే, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అనిల్ పోటరే ఎన్నికల్లో ఉన్నప్పటికీ వారి పోటీ నామమాత్రమే. -
ఎన్సీపీ కంచుకోట బారామతి
బారామతి పేరు చెబితే ఎవరికైనా ముందుగుర్తుకొచ్చేది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్. ఈ స్థానం నాలుగు దశాబ్దాలుగా ఎన్సీపీ అధీనంలోనే ఉంది. 2009 దాకా శరద్‌పవార్ దీనికి ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల్లో ఆయన కుమార్తె సుప్రియాసూలే ఇక్కడినుంచే పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ తిరిగి ఆమె ఇక్కడి నుంచే బరిలోకి దిగారు. పుణే సిటీ, న్యూస్‌లైన్: బారామతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని దౌండ్, ఇందాపూర్, బారామతి, పురందరి, బోర్, ఖడక్వాస్లా శాసనసభ స్థానాలు ఎన్సీపీకి కంచుకోటగా ఉన్నాయి. శరద్‌పవార్ స్వస్థలం కావడంతో ఈ నియోజకవర్గం గత 40 సంవత్సరాల నుంచి ఆ పార్టీ అధీనంలోనే ఉంది. 2009 ఎన్నికల్లో పవార్ కూతురు సుప్రియా సూలే 4.22 లక్షల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి పృథ్వీరాజ్‌పై విజయఢంకా మోగించారు. ఈ ఎన్నికల్లో ఆమెకు పోటీగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సురేష్ కోపడే, కాషాయకూటమి ఉమ్మడి అభ్యర్థి మహాదేవ్ జాన్కర్ బరిలో ఉన్నారు. అధికార కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఎన్సీపీ పాగా వేయడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. ఇతర తాలూకాలతో పోలిస్తే బారామతి ఎంతో అభివృద్ధి చెందింది. టెక్స్టైల్స్, ఆటోమొబైల్ తదితర రంగాలతోపాటు సహకార సంస్థలు, చక్కెర కర్మాగారాలు ఇక్కడ ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తంనగర్, ఎన్.డి.నగర్, గిరి నగర్ తదితర ప్రాంతాల్లోని తెలుగు ప్రజల అభిప్రాయాలను ‘న్యూస్‌లైన్’ సేకరించింది. వసతులు కల్పిస్తేనే ఓటు ఈ ప్రాంతంలో రహదార్లను అభివృద్ధి చేయాలి. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి. పేదలకు కనీస వసతులు కల్పించాలి. అందుకు కృషి చేసిన నాయకులకే ఓటేస్తాం. - మల్లికార్జున్‌రెడ్డి నిజాయితీపరులు కావాలి రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలి. నామినేషన్ల సమయంలో అభ్యర్థులు ప్రకటించిన ఆస్తులపై సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలి. తప్పుడు వివరాలు వెల్లడించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలా అయితేనే వారిలో మార్పురాదు. అప్పుడే మన నాయకులు నిజాయితీగా పరిపాలిస్తారు. నిజాయితీతో కూడిన పాలన అందించిన నాయకులకే పట్టం కడతాం. - వెంకటస్వామి నిజాయితీపరుడికే ఓటు రోజురోజుకూ రాజకీయాలు మలినమవుతున్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుంది. నిజాయితీపరుడికే నా ఓటు. తెలిసినవారందరికీ ఇదే విషయం చెబుతా. - నరసింహారెడ్డి -
సుప్రియ ప్రచార వ్యయం రూ. 26 లక్షలు
పింప్రి, న్యూస్‌లైన్: బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ తరఫున బరిలోకి దిగిన సుప్రియాసూలే 15 రోజుల వ్యయం అక్షరాలా రూ. 26 లక్షలు. వాస్తవానికి ఎన్నికల ప్రచారానికి ఎన్నికల సంఘం విధించిన పరిమితి రూ. 70 లక్షలు. అంతకుమించి ఖర్చుచేస్తే అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. అభ్యర్థులుు తమ ప్రచార వ్యయాన్ని కచ్చితంగా ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. జిల్లాలో పలు లోక్‌సభ నియోజకవర్గాల బరిలోకి దిగిన ఆయా అభ్యర్థులు గత 15 రోజుల ఖర్చులను ఎన్నికల సంఘానికి అందజేశారు. ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులు అందజేసిన వివరాలిలా ఉన్నాయి. బారామతి నుంచి బరిలోకి దిగిన సుప్రియా సూలే (ఎన్సీపీ) రూ. 26,01,959, మహాదేవ్ జాణకర్ (మహాకూటమి) 11,78,700, సురేష్ కోవడే (ఆమ్ ఆద్మీ) రూ. 16,82,599లు ఖర్చు చేశారు. మావల్ నుండి....రాహుల్ నార్వేకర్ (ఎన్సీపీ)రూ. 17,82,977, శ్రీరంగ భరణ్ (శివసేన) రూ. 13,69,169, లక్ష్మణ్ జగతాప్ (శేత్కారీ కామ్‌గార్ పార్టీ)-రూ. 9,32,128, మారుతి (ఆమ్ ఆద్మీ)-రూ. 2,12,332లు వెచ్చించారు. ఇక పుణే స్థానం నుంచి బరిలోకి దిగిన విశ్వజిత్ కదమ్ (కాంగ్రెస్) రూ. 14,13,847, అనిల్ శిరోలే (బీజేపీ)రూ. 4,40,231, దీపక్ పాయ్గుడే (ఎమ్మెన్నెస్) రూ. 2,07,640, అరుణ్ భాటియా (స్వతంత్ర) రూ. 1217,367, సుభాష్ నారే (ఆమ్ ఆద్మీ పార్టీ) రూ. 4,85,530లు వెచ్చించారు. ఇక శిరూర్ స్థానం నుంచి బరిలోకి దిగిన. శివాజీరావ్ ఆడల్‌రావ్ పాటిల్ (శివసేన) రూ. 16,15,337, దేవ్దత్త నికమ్ (ఎన్సీపీ) రూ. 3,47,251, అశోక్ ఖండేభరాడ్ (ఎమ్మెన్నెస్) రూ.1,98,375 చొప్పున ఖర్చు చేశారు. -
‘పవార్’ కోటలో పాగా వేసేదెవరో..
పింప్రి, న్యూస్‌లైన్: దేశ రాజకీయాల్లో కీలక లోక్‌సభ నియోజకవర్గమైన బారామతిలో ఈసారి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 20 ఏళ్లకు పైగా ఇక్కడ ఎన్సీపీ హవా నడుస్తుండగా, ఇప్పుడు కాషాయ మహాకూటమి, ఆమ్ఆద్మీ పార్టీల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. పుణే జిల్లా ఎన్సీపీకి పుట్టినిల్లు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు, అతడి వారసులకు కంచుకోట బారామతి. ముందుగా నియోజక వర్గ స్వరూపాన్ని పరిశీలిస్తే బారామతి లోక్‌సభ నయోజక వర్గం 1957లో పురుడు పోసుకోగా, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. 1999 తర్వాత శరద్ పవార్ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత ఈ నియోజక వర్గం ఎన్సీపీకి పెట్టని కోటగా మారింది. ఇక్కడ నుంచి ఇప్పటివరకు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 8 సార్లు, భారతీయ లోక్‌దళ్ అభ్యర్థి ఒకసారి, ఎన్సీపీ అభ్యర్థులు 3 సార్లు గెలుపొందారు. 1984 లో శరద్‌పవార్ రాజకీయ ప్రవేశంతో బారామతి పూర్తిగా శరద్ పవార్ చేతిలోకి వచ్చింది. పవార్ మొదటిసారి పార్లమెంటు ఎన్నికల్లో సమాజ్ వాది కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి కాంగ్రెస్‌కు చెందిన శంకర్రావు పాటిల్‌ను ఓడించారు. ఆ తర్వాత పవార్ తిరిగి రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టడంతో, ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాకడే విజయం సాధించారు. ఈ ఎంపీ స్థానం 1991 నుండి 2009 వరకు శరద్ పవార్, అజిత్ పవార్, సుప్రియా సూలే (శరద్ పవార్ వారసులు) మధ్యనే ఉంటూ వచ్చింది. బారామతి పార్లమెంటు నియోజక వర్గం పునర్విభజన జరిగిన తర్వాత బారామతి కింద బారామతి, దౌండ్, ఇందాపూర్, ఖడక్వాస్లా, పురంధర్, బోర్ నియోజక వర్గాలు కలిశాయి. 2009 ఎన్నికలలో ఎన్సీపీ తరఫున పొటీచేసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే పై 17 మంది పోటీ చేయగా, ప్రధాన పోరు బీజేపీ, ఎన్సీపీ మధ్యనే నడిచింది. ఆ ఎన్నికల్లో సుప్రియా సూలే సుమారు 3 లక్షలకు పైగా మెజార్టీతో గెలుపొందింది. బీజేపీ, బీఎస్పీ నామ మాత్ర పోటీ ఇచ్చాయి. మారిన రాజకీయాలు.... నియోజక వర్గ పరిధిలో గల బారామతి, దౌండ్, ఇందాపూర్, పురంధర్ తాలుకాలలో అభివృద్ధి, నీటి సమస్యలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఒక్క బారామతి తాలుకాలోని సగానికిపైగా గ్రామాల్లో నీటి సమస్య అతి తీవ్రంగా ఉంది. రైతుల సమస్యలు అలాగే ఉన్నాయని, శరద్‌పవార్ వ్యవసాయ మంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, సుప్రియా సూలే ఎంపీగా నియోజక వర్గానికి చేసింది ఏమి లేదని ప్రధాన ప్రతిపక్షపార్టీలు ప్రజల్లోకి వెళ్లి నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఈసారి ఎన్నికల్లో ఎన్సీపీకి గట్టి పోటి ఇవ్వడానికి మహాకూటమి, ఆమ్ ఆద్మీ పార్టీలు సన్నద్ధమయ్యాయి. ఇప్పటికే బారామతి నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లే. ఎన్సీపీ తరఫున సుప్రియా సూలే తిరిగి పోటీకి సిద్ధమవ్వగా, బీజేపీ, శివసేన, స్వాభిమాని షేత్కారీ సంఘటన, ఆర్పీఐ మహాకూటమి తరఫున రాష్ట్రీయ సమాజ్ పక్ష్(నేషనల్ సోషల్ పార్టీ) అభ్యర్థిగా మహదేవ్ జాన్కర్, ఆమ్ఆద్మీ పార్టీ తరఫున మాజీ పోలీస్ అధికారి సురేష్ ఖోపడే అభ్యర్థిగా ఖరారైనారు. ప్రస్తుతం బారామతి పార్లమెంటు నియోజకవర్గం కింద ఉన్న 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండింటిలో ఎన్సీపీకి చెందిన ఇద్దరు, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఒకరు ఉన్నారు. ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య పొత్తులుండగా, మహా కూటమికి చెందిన బీజేపీ ఖాతాలో రెండు, శివసేన ఖాతాలో ఒక అసెంబ్లీ స్థానం ఉన్నాయి. అయితే మారిన రాజకీయాలకనుగుణంగా ఈసారి బారామతి నియోజక వర్గంలో బీజేపీ, శివసేన కాకుండా నియోజక వర్గాన్ని రాష్ట్రీయ సమాజ్ పక్ష్కు ఇవ్వడంతో ఈ రెండు పార్టీల కార్యకర్తలు ఎంత వరకు సహకారం అందిస్తారో వేచి చూడాల్సిందే. ఇటీవల కాంగ్రెస్-ఎన్సీపీలు వేటికవే రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ అధినాయకత్వాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చినప్పటికీ, ఇరు పార్టీల అగ్రనాయకులు పొత్తులకే ప్రాధాన్యత ఇవ్వడంతో సీట్లు సర్దుబాటు జరిగింది. దీనితో కాంగ్రెస్‌లోని కార్యకర్తలు బారామతిలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టాలన్న కోరిక నెరవేరక పోయినందుకు నిరాశతో ఇన్నారు. మరి వీరిని ఒకే తాటిపైకి తీసుకురావడానికి నాయకులు కృషి చేయాల్సి ఉంటుంది. పవార్ కంచుకోటను బద్దలు కొడతాం..... మహదేవ్ జాన్కర్ మహా కూటమి తరపున రంగంలోకి దిగుతున్న రాష్ట్రీయ సమాజ్ పక్ష్ అభ్యర్థి మహదేవ్ జాన్కర్ ధృఢ విశ్వాసంతో ఈసారి గెలుపు దిశగా తన ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. పవార్ కోటను బద్దలు కొడితే దేశవ్యాప్తంగా తన పేరు మారుమోగుతుందని ‘టార్గెట్ బారామతి’ అని కార్యకర్తలను ఉత్తేజపరిచేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. 5 వేల మంది కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సోలాపూర్ నుంచి ప్రచారానికి పంపించనున్నాడు. ఇందుకు ఇటీవల ఎలాగైనా రాష్ట్ర రాష్ట్రీయ సమాజ్ పక్ష్ అధ్యక్షులైన మహదేవ్ జాన్కర్ విజయానికై ఉత్తర సోలాపూర్‌లో పార్టీ పదాధికారులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సుప్రియ సూలేను ఓడించడానికి ప్రచారంలో నితిన్ గడ్కరీ, గోపీనాథ్ ముండే, ఉద్ధవ్ ఠాక్రేతో పాటు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని కూడా ప్రచారానికి పిలవనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమ్ ఆద్మీ ఒంటరి పోరు.... ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మాజీ పోలీస్ అధికారి సురేష్ ఖోప్డేను అభ్యర్థిగా ప్రకటించింది. సురేష్ మహారాష్ట్ర పోలీసు ఫోర్సులో 1978లో చేరారు. ఆ తర్వాత అతడు ప్రతిభావంతుడిగా ఎన్నో అవార్డులను అందుకున్నారు. రాజకీయాల్లో నిస్వార్థంగా సేవలను అందించేందుకు ఆప్‌లో చేరానని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. బారామతి అభివృద్ధికి అహర్నిశలు కృషిచేస్తానని చెబుతున్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజలు మరి ఎవరికి పట్టం కట్టబోతున్నారో వేచి చూడాల్సిందే.