బారామతి అసెంబ్లీ బరిలో అజిత్‌ పవార్‌ కుమారుడు? | Will Ajit Pawar Son Contest From Baramati Assembly Seat? what Ajit pawar says | Sakshi
Sakshi News home page

బారామతి అసెంబ్లీ బరిలో అజిత్‌ పవార్‌ కుమారుడు?

Published Thu, Aug 15 2024 6:38 PM | Last Updated on Thu, Aug 15 2024 8:06 PM

Will Ajit Pawar Son Contest From Baramati Assembly Seat? what Ajit pawar says

ముంబై: మహారాష్ట్రలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లో వేగం పెరుగుతోంది. కీలకమైన బారామతి అసెంబ్లీ స్థానంలో తన కుమారుడు పోటీ చేయటంపై  ఎన్సీపీ (అజిత్‌ పవార్) చీఫ్‌, డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ స్పందించారు.  తను కుమారుడు జయ్ పవార్.. బారామతి నుంచి బరిలో దింపే విషయంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. 

ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రజాస్వామ్యం. నేను ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా లేను. నేను ఇప్పటికే ఏడెనిమిదిసార్లు పోటీ చేశాను. జయ్‌ పవార్‌ బారామతి బరిలో దించాలని ప్రజలు, పార్టీ మద్దతుదారులు కోరుకుంటే పార్టీ పార్లమెంటరీ బోర్డు చర్చిస్తుంది. పార్లమెంటరీ బోర్డు అనుమతి ఇస్తే..  జయ్‌ను బారామతి బరిలో దింపటానికి సిద్ధంగా  ఉన్నాం’’ అని అన్నారు.

అదే విధంగా తనకు,ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు మధ్య విభేదాల గురించి మీడియాలో వచ్చిన కథనాలను తొలగించాలని మీడియాను కోరారు. తాము ఇద్దరం కలిసి విజయవంతంగా పని చేస్తున్నామని తెలిపారు. ఇటీవల బారామతి లోక్‌సభ స్థానంలో సుప్రియా సూలేపై తన భార్య సునేత్రను పోటీకి దింపడం పొరపాటు అని అజిత్‌ పవార్‌ వ్యాఖ్యలు చేసిన  విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పదించాలని విలేకర్లు కోరగా..  ఈ విషయం గురించి తాను ఇప్పటికే మాట్లాడానని అన్నారు. ‘నేను ఒకరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసే వ్యక్తిని కాదు. నా మనసుకు ఏది అనిపిస్తే అది మాట్లాడతాను. ఈ విషయంపై చర్చ  చేయాల్సిన అవసరం లేదు’అని అన్నారు.

మరోవైపు.. అజిత్‌ పవార్‌  పోటీచేయబోనని వస్తున్న వార్తలపై  ఆ పార్టీ నేత సునీల్ తట్కరే  స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేయనని అజిత్ పవార్ చెప్పలేదని అన్నారు. ‘అజిత్ పవార్ తాను ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పలేదు. ఆయన కొన్ని ప్రణాళికలు కలిగి ఉండవచ్చు. మేము వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని కోరుకుంటున్నాము’’ అని అన్నారు. అజిత్‌ పవార్‌ పెద్ద కుమారుడు పార్థ్ పవార్ 2019లో మావల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ  చేశారు. కానీ,  ఆ  ఎన్నికల్లో  పార్థ్ పవార్ భారీ మెజార్టీతో ఓడిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement