ఎన్సీపీ కంచుకోట బారామతి
బారామతి పేరు చెబితే ఎవరికైనా ముందుగుర్తుకొచ్చేది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్. ఈ స్థానం నాలుగు దశాబ్దాలుగా ఎన్సీపీ అధీనంలోనే ఉంది. 2009 దాకా శరద్‌పవార్ దీనికి ప్రాతినిధ్యం వహించారు. 2009 ఎన్నికల్లో ఆయన కుమార్తె సుప్రియాసూలే ఇక్కడినుంచే పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ తిరిగి ఆమె ఇక్కడి నుంచే బరిలోకి దిగారు.
పుణే సిటీ, న్యూస్‌లైన్: బారామతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని దౌండ్, ఇందాపూర్, బారామతి, పురందరి, బోర్, ఖడక్‌వాస్లా శాసనసభ స్థానాలు ఎన్సీపీకి కంచుకోటగా ఉన్నాయి. శరద్‌పవార్ స్వస్థలం కావడంతో ఈ నియోజకవర్గం గత 40 సంవత్సరాల నుంచి ఆ పార్టీ అధీనంలోనే ఉంది. 2009 ఎన్నికల్లో పవార్ కూతురు సుప్రియా సూలే 4.22 లక్షల ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి పృథ్వీరాజ్‌పై విజయఢంకా మోగించారు.
ఈ ఎన్నికల్లో ఆమెకు పోటీగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సురేష్ కోపడే, కాషాయకూటమి ఉమ్మడి అభ్యర్థి మహాదేవ్ జాన్కర్ బరిలో ఉన్నారు. అధికార కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిపై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో మాత్రం ఎన్సీపీ పాగా వేయడం ఖాయమని పలువురు భావిస్తున్నారు. ఇతర తాలూకాలతో పోలిస్తే బారామతి ఎంతో అభివృద్ధి చెందింది. టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్ తదితర రంగాలతోపాటు సహకార సంస్థలు, చక్కెర కర్మాగారాలు ఇక్కడ ప్రగతి పథంలో దూసుకుపోతున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఉత్తంనగర్, ఎన్.డి.నగర్, గిరి నగర్ తదితర ప్రాంతాల్లోని తెలుగు ప్రజల అభిప్రాయాలను ‘న్యూస్‌లైన్’ సేకరించింది.
వసతులు కల్పిస్తేనే ఓటు
ఈ ప్రాంతంలో రహదార్లను అభివృద్ధి చేయాలి. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి. పేదలకు కనీస వసతులు కల్పించాలి. అందుకు కృషి చేసిన నాయకులకే ఓటేస్తాం. - మల్లికార్జున్‌రెడ్డి
నిజాయితీపరులు కావాలి
రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలి. నామినేషన్ల సమయంలో అభ్యర్థులు ప్రకటించిన ఆస్తులపై సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలి. తప్పుడు వివరాలు వెల్లడించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలా అయితేనే వారిలో మార్పురాదు. అప్పుడే మన నాయకులు నిజాయితీగా పరిపాలిస్తారు. నిజాయితీతో కూడిన పాలన అందించిన నాయకులకే పట్టం కడతాం. - వెంకటస్వామి
నిజాయితీపరుడికే ఓటు
రోజురోజుకూ రాజకీయాలు మలినమవుతున్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే రాజకీయాల్లో మార్పు వస్తుంది. నిజాయితీపరుడికే నా ఓటు. తెలిసినవారందరికీ ఇదే విషయం చెబుతా. - నరసింహారెడ్డి