బారామతి.. ఈసారి ఎవరిదో?!
- ఎన్సీపీ కంచుకోటలో త్రిముఖ పోరు
- అజిత్‌కు గట్టిపోటీనివ్వనున్న బీజేపీ, శివసేన
- కాంగ్రెస్, బీఎస్పీ పోరు నామమాత్రమే
- బీజేపీ గెలుపుపై ప్రభావం చూపనున్న శివసేన
- కాషాయ ఓట్లు చీలే ప్రమాదం
పింప్రి, న్యూస్‌లైన్ : ప్రస్తుత పరిస్థితుల్లో నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ గెలుపు సులువేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్సీపీకి బారామతి పుట్టినిల్లు. ఆ పార్టీ అధినేత శరద్ పవార్ ఇక్కడినుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1991 నుంచి అజిత్ పవార్ ఐదుపర్యాయాలుగా ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది ఆరవసారి. ప్రతిసారి ఆయన గెలుపు నల్లేరు మీద నడకలా సాగేది. కానీ ఈసారి గెలుపు అంత సులువుగా కనిపించడం లేదు. ఈసారి బీజేపీ కూటమి, ఎన్సీపీల మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది. ఇక్కడ గత లోక్‌సభ ఎన్నికల్లో సుప్రియా సూలే మెజార్టీ గతంతో పోల్చితే చాలా వరకు తగ్గిపోయింది.
స్థానిక సమస్యలను పట్టించుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మంచినీటి, తాగునీటి సమస్య, జనాయి-శిరసాయి పథకం, పుంధర్‌లో సూక్ష్మబిందు సేద్యం పనులు, చెరకు మద్దతు ధర, టోల్, ధంగర్ల రిజర్వేషన్లు, పవార్‌ల చేతిలో ఉన్న సోమేశ్వర్ చక్కర కర్మాగార ఆర్థిక పరిస్థితి లాంటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎన్సీపీకి ఈ వర్గాల నుంచి మద్దతు లభించడం సందేహమే. అయితే బారామతి నగర,తాలూకాలోని గ్రామ గ్రామాన కోట్లాది రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎన్సీపీ ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. అజిత్ పవార్ ఈసారి ప్రచారాన్ని తన భార్య సునేత్రా పవార్, కూతుర్లు పార్థ్, జయ్‌లపై విడిచి పెట్టారు. మరోవైపు బీజేపీ తరఫున బరిలోకి దిగిన బాలాసాహెబ్ గావడే ధంగర్ల రిజర్వేషన్ల సమితి కార్యాధ్యక్షుడు.
నియోజక వర్గంలో ధంగర్లు ఏకతాటిపైకి వచ్చి ప్రచారంలో పాల్గొనడం అతడికి శుభ పరిణామంగా భావిస్తున్నారు. ఎన్సీపీకి చెందిన సీనియర్ నాయకుడు చంద్రారావు తావరే బీజేపీలో చేరి ప్రచారంలో ముందుండి నడిపిస్తుండడం ఈసారి గావడేకు కలసి వచ్చే అంశం. పవార్ ఆధీనంలో ఉన్న చక్కర కర్మాగారాలు చేజారిపోవడం, శేత్కారీ కృతి సమితి నేత సతీష్ కాకడే, రంజన్ తావరే, అజిత్ పవార్‌కు కుడి భుజంగా ఉన్న మాజీ పంచాయతీ సమితి అధ్యక్షుడు అవినాష్ గోఫణే ఈసారి బీజేపీ పక్షాన చేరడం అజిత్‌కు ఇబ్బందికరమైన పరిస్థితులేనని చెప్పవచ్చు. అలాగే స్వాభిమాన్ శేత్‌కారీ సంఘటన, రాష్ట్రీయ సమాజ్ పక్ష్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బీజేపీ కూటమిగా ఇక్కడ బరిలోకి దిగాయి.
దీంతో గావడే రెట్టింపు ఉత్సాహంతో పవార్‌కు దీటుగా పోటీ ఇస్తున్నారు. శివసేన నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్ర కాలే బరిలో దిగారు. ఈయన గత ఏడాది కాలంగా గ్రామ గ్రామాన యువసేన విభాగాలను స్థాపించి శివసేనను బలోపేతం చేస్తూ వస్తున్నారు. శివసేన పోటీలో ఉండడం ద్వారా కాషాయ ఓట్లు చీలే అవకాశం ఉంది. అది ఎంత వరకు చీలుతుందో అనే దానిపై బీజేపీ విజయం ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం బారామతిలో ఎన్సీపీ నుంచి అజిత్‌పవార్, బీజేపీ కూటమి తరఫున బాలాసాహెబ్ గావడే, శివ్ సేన నుంచి రాజేంద్ర కాలేల మధ్యనే పోటీ నెలకొని ఉంది. వీరితో పాటు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అడ్వకేట్ ఆకాష్ మోరే, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి అనిల్ పోటరే ఎన్నికల్లో ఉన్నప్పటికీ వారి పోటీ నామమాత్రమే.