‘మహా’ పార్టీలకు ‘ఆప్’ పోటీ
Published Sun, Jan 5 2014 11:00 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
ముంబై: మహారాష్ట్రలో దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తున్న కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎమ్మెన్నెస్, ఎన్సీపీలు ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కొత్త ప్రత్యర్థిని ఎదుర్కోనున్నాయి. ఇటీవలి ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) మహారాష్ట్రలోనూ కాలు మోపిం ది. మరికొన్ని నెలల్లో జరిగే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని 35 జిల్లాల్లోనూ శాఖలను నెలకొల్పిన ఈ నూతన పార్టీ గ్రామస్థాయిలో ప్రజలకు దగ్గరవ్వడానికి కృషి చేస్తోంది. ఆప్ ఆగ్రనాయకుల్లో కేజ్రీవాల్ సహా పలువురు అన్నా హజారే మద్దతుదారులనే విషయం తెలిసిందే. అన్నాకు మహారాష్ట్రలో ఉన్న జనాదరణ ఈ పార్టీకి మేలు చేసే అవకాశముంది. పోలింగ్‌బూత్ స్థాయిలోనూ కమిటీలను నియమించనున్నామని కేజ్రీవాల్ బృంద నాయకుల్లో ఒకరైన ఆప్ ప్రతినిధి మయాంక్ గాంధీ అన్నారు. సామాన్యులు, యువత మద్దతుతో దూసుకుపోతున్న ఈ పార్టీ ఎన్నికల నిర్వహణ కోసం ఇది వరకే 14 రాష్ట్రస్థాయి కమిటీలను నియమించింది. రాష్ట్రంలో 48 లోక్‌సభ స్థానాలు ఉండగా, ఎంతమందికి టికెట్లు ఇవ్వాలనే విషయమై ఆప్ ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు.
రాష్ట్ర నాయకత్వంపై గాంధీ స్పందిస్తూ అంజలి దమానియా రాష్ట్ర సమన్వయకర్తగా వ్యవహరిస్తారని, సుదీర్ఘకాలంగా ప్రజాజీవితంలో ఉన్న వారినే జిల్లాస్థాయి నాయకులుగా ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. రాయల్‌బ్యాంక్ సీఈఓ మీరా సన్యాల్, స్టార్ టీవీ మాజీ అధికారి సమీర్‌నాయర్ వంటి వృత్తినిపుణులతోపాటు డబ్బావాలాలు, హాకర్లు, ఆటోయూనియన్లనూ ఈ పార్టీ ఆకర్షిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూట మి 25, బీజేపీ-ఎన్సీపీ కూటమి 20 సీట్లను కైవసం చేసుకున్నాయి. ఆప్‌కు స్థానికంగా పటిష్ట నాయకత్వం లేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఎలా పనిచేస్తుందనేది ఇప్పుడే చెప్పడం కష్టమని కాంగ్రెస్,ఎన్సీపీ నాయకులు అంటున్నారు. ‘ప్రత్యర్థి ఎవరైనా ఎన్నికల్లో గెలుపు కష్టసాధ్యమే. ఆప్ తరహా ప్రయోగాలు చాలా రాష్ట్రాల్లో జరిగాయి. ప్రజలు కిందిస్థాయిలో పనిచేసే నాయకులనే ఆదరిస్తారు. మహారాష్ట్రలో రైతులు, సహకార ఉద్యమం, విద్యాసంస్థలు వంటివి కీలకాంశాలు’ అని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ అన్నారు.
మోడీ ఆకర్షణ, ఆదర్శ్ కుంభకోణం, నీటిపారుదల కుంభకోణం వంటివి ప్రభుత్వ వ్యతిరేకతను పెంచి తమ కు ఓట్లు రాల్చుతాయని బీజేపీ-సేన కూటమి ఆశి స్తోంది. అంతేగాక చిన్నపార్టీలను కలుపుకొని ఈసారి అధికారంలోకి రావడానికి వ్యూహరచన చేస్తోంది. మహాకూటమిలోకి ఎమ్మెన్నెస్‌ను తీసుకురావడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాలే సంఖ్యే అధికం కాగా, ఇతర పార్టీలు ప్రభుత్వాల సంఖ్య చాలా తక్కువ. కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ విద్యాసంస్థలు, సహకార బ్యాంకులు, సహకార చక్కెర సంస్థల స్థాపన తిరిగి తమకు ఓట్లు తెచ్చిపెడుతాయని కాంగ్రెస్ భావిస్తోంది. మోడీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా చూపెట్టడం వల్ల కాస్త ఆకర్షణ పెరగవచ్చని, అయితే ఏదో అద్భుతానికి మాత్రం అవకాశాలు లేవని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు.
Advertisement