సాక్షి, హైదరాబాద్: జంట నగరాల్లో భిక్షాటన చేస్తున్న వారి వెనుక ఎటువంటి మాఫియా గానీ, అసాంఘిక శక్తులు గానీ లేవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మంగళవారం హైకోర్టుకు నివేదించారు. దాదాపు 200 మందికి పైగా బిచ్చగాళ్లను అనేక రకాలుగా విచారించిన తరువాతే తాము ఈ నిర్ణయానికి వచ్చామని ఆయన తెలిపారు.
బతికేందుకు డబ్బు లేని వారు బిడ్డలను గెంటేయడంతో రోడ్డున పడ్డ వృద్ధులు, తల్లితండ్రులు లేక అనాథలుగా మారిన చిన్నారులు, పేదరికం వల్ల తల్లిదండ్రుల బాధ్యతలు చూడాల్సిన యువత, శారీరక, మానసిక వైకల్యం ఉన్న వారు విధి లేని పరిస్థితుల్లో యాచన చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చిన్నపిల్లలను కిడ్నాప్ చేసి వారిని బిచ్చగాళ్లను చేసి, వారి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే మాఫియా రోజు రోజుకూ తమ పరిధిని విస్తరించుకుంటూ వెళుతోందని, తెలంగాణ రాష్ట్రంలో బిచ్చగాళ్ల వ్యవస్థను నిషేధించి, వారికి తగిన పునరావాసం కల్పించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ స్వచ్ఛంద సంస్థ గరీబ్ గైడ్ అధ్యక్షురాలు జి.భార్గవి దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. పిటిషనర్ ఆరోపించిన విధంగా బిచ్చగాళ్ల వెనుక మాఫియా ఉందో, లేదో విచారించి చెప్పాలన్న ధర్మాసనం ఆదేశాల మేరకు కమిషనర్ ఓ నివేదికను కోర్టుకు సమర్పించారు.
కోర్టు ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ (డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్) పూర్తిస్థాయి విచారణ జరిపారని హైదరాబాద్ సిటీ పరిధిలో బస్‌స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కులు, షాపింగ్ మాల్స్, మసీదులు, హోటళ్ల వద్ద బిచ్చగాళ్లు ఎక్కువగా యాచిస్తున్నారని తెలిపారు. ప్రత్యేక రోజులు, వారాంతాలు, పండుగలు తదితర సమయాల్లో రోజంతా కూడా భిక్షాటన చేస్తూ, రాత్రుళ్లు పబ్లిక్ గార్డెన్స్, ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్‌లలో ఉంటున్నారని పేర్కొన్నారు.
వీరిలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, తమిళనాడుకు చెందిన వారే ఉన్నారని తెలిపారు. 2013 మే నుంచి సెప్టెంబర్ వరకు భిక్షాటన చేస్తున్న వాైరిపై 140 కేసులు నమోదు చేశామని, 34 మందిని అరెస్ట్ చేశామన్నారు. ఈ నివేదికను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఈ వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
బిచ్చగాళ్ల వెనుక మాఫియా లేదు..
Published Wed, Aug 6 2014 4:12 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
Advertisement