కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడకి టీఆర్‌ఎస్ ఎంపీలు, బార్‌కౌన్సిల్ సభ్యుల విజ్ఞప్తి
న్యూఢిల్లీ/ హైదరాబాద్: వీలైనంత త్వరగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు వేర్వేరు హైకోర్టులను ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్ ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు కేంద్ర మంత్రి సదానందగౌడకి విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనాయకుడు జితేందర్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, సీతారాంనాయక్, కొండా విశ్వేశ్వరరెడ్డి, బాల్క సుమన్, బార్ అసోసియేషన్ సభ్యులు సదానందగౌడను మంగళవారం ఢిల్లీలో ఆయన నివాసంలో కలిశారు. హైకోర్టు విభజన ఆలస్యం కావడంతో పెండింగ్ కేసులతోపాటు ఇతర సమస్యలు పెరుగుతున్నాయని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ ‘విభజన బిల్లు పాస్ అయి ఏడు నెలలు అవుతోంది. వీలైనంత త్వరగా హైకోర్టును విభజించాలి, కోర్టులో చాలా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి’ అని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చినట్టు చెప్పారు.
హైకోర్టు విభజన అంశాన్ని ఇప్పటికే పార్లమెంట్‌లోనూ లేవనెత్తినట్టు గుర్తు చేశారు. విభజన చట్టంలో హామీ మేరకు హైకోర్టు విభజన అంశాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేస్తామని, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళతానని మంత్రి సదానందగౌడ హామీ ఇచ్చినట్టు జితేందర్‌రెడ్డి తెలిపారు. మరోవైపు హైకోర్టును విభజించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించాలని కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడ్‌ను రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నర్సింహారెడ్డి కోరారు. ఈ మేరకు నర్సింహారెడ్డి సోమవారం సదానందగౌడ్‌కు ఓ లేఖ రాశారు.
హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోండి
Published Wed, Feb 11 2015 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:06 PM
Advertisement
Advertisement