సాక్షి, చెన్నై: రాష్ర్టంలోని అన్ని పోలీసుస్టేషన్లలో ఐదేళ్లలోపు నిఘా నేత్రాలు తప్పని సరిగా ఏర్పాటు చేసి తీరుతామని హైకోర్టుకు హోం శాఖ స్పష్టం చేసింది. ఏడాదికి 263 స్టేషన్లలో నిఘా నేత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక, నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యం న్యాయవాదుల మధ్య వాదనలు జోరుగానే సాగాయి. చివరకు కేసును హైకోర్టు తోసి పుచ్చింది. రాష్ర్టంలో అనేక పోలీసు స్టేషన్లు రచ్చబండలుగా మారి ఉన్న విషయం తెలిసిందే. బాసులు పెట్టిందే చట్టం, చేసేదే న్యాయం.
అలాగే, తరచూ అక్కడక్కడ చోటుచేసుకుంటున్న లాకప్ డెత్‌లు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఈ సమయంలో గత ఏడాది రామనాథపురంలో విచారణ పేరిట మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన యువకుడ్ని తీసుకు వెళ్లి లాకప్ డెత్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది. అలాగే, అన్ని పోలీసు స్టేషన్లలో నిఘా నేత్రాలు తప్పని సరిగా ఏర్పాటు చేయాల్సిందేనన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఇందుకు మద్రాసు హైకోర్టు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే రీతిలో వ్యవహరించింది.
పిటిషన్: న్యాయవాదులు పి ప్రకాష్‌రాజ్, నారాయణన్ కలిసి దాఖలు చేసిన ప్రజా వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ విచారించేందుకు నిర్ణయించింది. పోలీసు స్టేషన్లలో సాగుతున్న బండారాలను వివరిస్తూ దాఖలైన ఆ పిటిషన్‌లోని పలు అంశాలకు కోర్టు అండగా నిలిచిందని చెప్పవచ్చు. అన్ని పోలీసు స్టేషన్లలో నిఘా నేత్రాలు తప్పని సరిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్ సూచించిన వాదనతో కోర్టు ఏకీభవించింది.
నిఘా నేత్రాల ఏర్పాటుకు సంబంధించి పలు మార్లు హోం శాఖకు కోర్టు అక్షింతలు వేసింది. చివరకు గత నెల సాగిన విచారణ సమయంలో ఏదో మొక్కుబడిగా వివరణ ఇచ్చి తప్పించుకునే యత్నం చేసిన హోం శాఖ అధికారులకు చీవాట్లు తప్పలేదు. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ హోం శాఖ వర్గాల పని తీరుపై తీవ్రంగానే స్పందించింది. అధికారుల్ని కోర్టు మెట్లు ఎక్కించింది. చివరకు చేసిన తప్పును సరిదిద్దుకునే పనిలో హోంశాఖ వర్గాలు పడ్డాయి.
ఐదేళ్లలో నిఘా : శుక్రవారం పిటిషన్ విచారణకు రాగా, రాష్ట్ర హోం శాఖ తరపున ఐజీ(అడ్మిన్)డేవిడ్ సన్ దేవా ఆశీర్వాదం కోర్టుకు వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు 217 స్టేషన్లలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. మరో ఐదేళ్లల్లో అన్ని స్టేషన్లలో నిఘా నేత్రాలు తప్పని సరిగా ఏర్పాటు చేసి తీరుతామని, ఆయా స్టేషన్లలో రికార్డు అయ్యే దృశ్యాలను డిస్క్‌గా రూపొందించి భద్ర పరుస్తామని వివరించారు. ఏడాదికి 263 స్టేషన్లలో నిఘా నేత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
కేంద్రం నుంచి హోంశాఖకు అందాల్సిన నిధుల్లో పారదర్శకత లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిధుల్ని తగ్గించడంతో మోడరన్ పోలీసు స్టేషన్ ఏర్పాటులో వెనక్కు తగ్గాల్సి వచ్చిందని వివరించారు. కేంద్రం నిధుల కోతపై ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది శ్రీనివాసన్‌ను ఉద్దేశించి నిధులు తగ్గాయని చెబుతున్నారుగా, నిధుల సక్రమంగా మంజూరు అయ్యే విధంగా కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లండి అని సూచించారు.
ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది అరవింద్ జోక్యం చేసుకుని ఈ విషయంగా కేంద్రానికి లేఖల్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించి ఉన్నదని వివరించారు. ఈసందర్భంగా నిధుల కోతపై కాసేపు వాదనలు జోరుగానే సాగాయి. చివరకు రాష్ట్ర హోం శాఖ ఇచ్చిన వివరణ, ఐదేళ్లలోపు నిఘా నేత్రాల ఏర్పాటు హామీతో హైకోర్టు బెంచ్ ఏకీభవించింది. దీంతో ఈ పిటిషన్ విచారణను ముగించినట్టు ప్రకటించారు.
నిఘా నేత్రాలు
Published Sat, Apr 25 2015 3:07 AM | Last Updated on Sun, Sep 3 2017 12:49 AM
Advertisement
Advertisement