ఉద్యోగులపై ఈసీ నిఘా | Sakshi
Sakshi News home page

ఉద్యోగులపై ఈసీ నిఘా

Published Mon, Apr 15 2024 3:12 AM

Issuance of special regulations in the context of elections - Sakshi

వారి కదలికలు, సోషల్‌ మీడియా ఖాతాలపై దృష్టి

రంగంలోకి ప్రత్యేక యంత్రాంగం

ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక నిబంధనావళి జారీ

పార్టీలకు కొమ్ముగాస్తే కఠిన చర్యలు

టీచర్లు, ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలంటున్న సంఘాలు

సాక్షి, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా పెట్టింది. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. ఏ పార్టీకైనా కొమ్ముగాస్తున్నట్టు ఏ విధంగా తేలినా షోకాజ్‌ నోటీసులు, ఆ తర్వాత కఠిన చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతోంది. వ్యక్తిగత కదలికలే కాకుండా, వారి సామాజిక మాధ్యమ ఖాతాలపై కూడా కన్నేసి ఉంచింది.

అన్ని సాంకేతిక వనరులను వినియోగించుకుంటూ గతంలో ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు, రాజకీయ పార్టీలతో అంటకాగుతున్న నేతలను కనిపెట్టాలని నిర్ణయించింది. దీంతో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు అప్రమత్తమయ్యాయి. జాగ్రత్తగా ఉండాలని తమ ఉద్యోగులకు సూచిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ ముగిసే వరకూ ఏ పార్టీ నేతలను కలవద్దని స్పష్టం చేశాయి. రాజకీయ పార్టీలు, నేతలు నిర్వహించే విందులు, వినోద కార్యక్రమాలకు వెళ్ళొద్దని హెచ్చరించాయి. 

సోషల్‌ మీడియా ఖాతాలపై నిఘా
ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల వ్యక్తిగత సామాజిక మాధ్యమ ఖాతాలపై ఎన్నికల కమిషన్‌ నిఘా పెట్టింది. వారు ఉండే వాట్సాప్‌ గ్రూపులు, వారి ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రాం ఖాతాలను ప్రత్యేక బృందాలు పరిశీలిస్తున్నాయి.

గతంలో ఆరోపణలున్న వారిపై మరింత నిఘా పెట్టినట్టు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఓ నేతకు అనుకూలంగా సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినా, లేదా ఎవరైనా పోస్టు చేసినదాన్ని ఫార్వర్డ్‌ చేసినా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్టుగానే పరిగణిస్తారు. ఆరోపణలు వచ్చిన ఉద్యోగి ఫోన్‌ కాల్‌ డేటాను కూడా పరిశీలించే అవకాశం ఉందని సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.

టీచర్లు, ఉద్యోగులే కీలకం
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులదే కీలక పాత్ర. రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. 1.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీళ్లల్లో దాదాపు 90 శాతం ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఉద్యోగుల్లో క్లాస్‌–4 తప్ప, అందరికీ ఎన్నికల విధులు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వీళ్ళు పని చేస్తుంటారు.

ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వీరికి ప్రత్యేక నిబంధనావళిని ఎన్నికల కమిషన్‌ జారీ చేసింది. రాజకీయ నేతలతో ఎలాంటి సంబంధాలు నెరపడానికి వీల్లేదని, ఏ సభలు సమావేశాల్లో పాల్గొనవద్దని, విందులు, వినోదాలకు వెళ్ళొద్దని, అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్యం కావద్దని, ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వొద్దని పేర్కొంది. ప్రతి నేత సమావేశం, ప్రచారం వీడియో చిత్రీకరణ ఉంటుందని, ఇందులో ఉద్యోగి ఉన్నట్టు తేలితే, నేతలతో సంబంధాలున్నట్టు ఆధారాలతో ఫిర్యాదులొచ్చిన తక్షణమే సస్పెన్షన్‌ తప్పదని కూడా స్పష్టం చేసింది. 

అయినా సరే..!
ఎన్నికల కోడ్‌లో ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు ఉన్నప్పటికీ కొందరు వాటిని బేఖాతరు చేస్తున్నారు. సిద్దిపేటలో ఇటీవల 110 మంది డీఆర్‌డీఏ ప్రాజెక్టు మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు ఓ రాజకీయ పార్టీ ఎంపీ అభ్యర్థి నిర్వహించిన బహిరంగ సమావేశానికి హాజరయ్యారు.

దీనికి సంబంధించిన వీడియోతో ప్రత్యర్థి పార్టీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారిని కమిషన్‌ సస్పెండ్‌ చేసింది. వీడియోను మార్ఫింగ్‌ చేశారని ఆ ఉద్యోగులు వాదిస్తున్నారు. సదాశివ పేటలో ఓ జూనియర్‌ లెక్చరర్‌ ఓ జాతీయ పార్టీ అభ్యర్థికి మద్దతుగా జరిగిన మీటింగ్‌లో పాల్గొనడం ప్రత్యర్థులు పసిగట్టారు. ఈ వీడియోను ఈసీకి అందజేయడంతో ఆయన్ను సస్పెండ్‌ చేశారు.

ఖమ్మం జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు ఓ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న వీడియో బయటకు రావడంతో ఈసీ షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేతలు ఓ పార్టీ నేత ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆయా సంఘాల నేతలు సూచిస్తున్నారు.    

Advertisement
Advertisement