Home Department
-
హోం శాఖలోకి అస్సాం రైఫిల్స్ వద్దు
న్యూఢిల్లీ: అస్సాం రైఫిల్స్ బలగాలను హోం శాఖ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనను సైన్యం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నిర్ణయం అమలైతే అత్యంత సున్నితమైన చైనా సరిహద్దుల్లో గస్తీపై ప్రభావం పడుతుందని తెలిపింది. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని రక్షణ శాఖను కోరింది. అస్సాం రైఫిల్స్‌ను ఇండో–టిబెటన్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)లో విలీనం చేసి మొత్తం తన నియంత్రణ కిందికి తెచ్చుకోవాలన్న హోం శాఖ ప్రతిపాదనను ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ త్వరలో చర్చించనుంది. అస్సాం రైఫిల్స్‌ను పూర్తిగా హోం శాఖ ఆధీనంలోకి తెస్తే చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి నిఘాపై తీవ్ర ప్రభావం పడుతుందని పేరు వెల్లడించటానికి ఇష్టపడని సైనికాధికారి ఒకరు తెలిపారు. నాగాలతో చర్చలు, అసోంలో ఎన్నార్సీ అమలు సమస్య, భారత్‌తో సరిహద్దుల వెంబడి చైనా పెద్ద ఎత్తున మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్న వంటి వాటి నేపథ్యంలో ఈ చర్య ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఈ విషయాలను ఇప్పటికే ఉన్నతాధికారులకు చేరవేశామని తెలిపారు. 185 ఏళ్ల చరిత్ర కలిగిన అస్సాం రైఫిల్స్‌లోని 46 బెటాలియన్లలోని 55 వేల మంది సైనికులు 1,640 కిలోమీటర్ల మయన్మార్ సరిహద్దుల్లో కాపలాతోపాటు అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత్–చైనా సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో గస్తీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ బలగాలపై హోం శాఖకు పరిపాలన పరమైన నియంత్రణ, సైన్యం కార్యాచరణ నియంత్రణ కలిగి ఉన్నాయి. -
అయ్యా..సెలవెప్పుడిస్తారు?
‘పక్షవాతం వచ్చిన తన తల్లికి మందులేస్తుండగా.. అర్జంటుగా రావాలని స్టేషన్ నుంచి ఫోన్.. తన తల్లిని, భార్య సరిగ్గా చూసుకోదని తెలిసినా అన్యమనస్కంగా విధులకు బయల్దేరాడు ఓ సీఐ. ‘తన కూతురు 11వ పుట్టినరోజు.. సాయంత్రం త్వరగా ఇంటికి వస్తానని బిడ్డకు మాటిచ్చి వెళ్లలేకపోయిన ఓ మహిళా ఉన్నతాధికారి వేదన మాటల్లో వర్ణించలేం. ‘మే 1వ తేదీ తన పెళ్లిరోజు, ప్రపంచ కార్మిక దినోత్సవం కూడా. అయినా.. కార్మికుల వేడుకలకు బందోబస్తు కోసం బయల్దేరాడు ఓ కానిస్టేబుల్’ – సాక్షి, హైదరాబాద్ పోలీసు శాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడికి ఇవన్నీ కేవలం చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇంతకంటే క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కుటుంబాన్ని వదిలి కేవలం వృత్తి ధర్మంకోసం 24 గంటలు డ్యూటీలు చేస్తున్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖలో దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తోన్న వారాంతపు సెలవు ప్రక్రియకు నేటికీ మోక్షం కలగడం లేదు. పలుమార్లు తెరపైకి రావడం, ఉద్యోగుల్లో ఆశలు రేపడం.. అంతలోనే మరుగున పడటం అత్యంత సాధారణ విషయంగా మారింది. 24 గంటలు ప్రజాసేవలోనే.. పోలీసు మాన్యువల్స్‌లో ఎక్కడా పోలీసు డ్యూటీ 24 గంటలు అని రాసి లేదు. కానీ, మన రాష్ట్రంలో, దేశంలో అంతటా.. సెలవుల్లేకుండానే పనిచేస్తున్నారు. వాస్తవానికి ప్రతి పోలీసుకు 15 సీఎల్స్ (క్యాజువల్ లీవ్స్), 5 ఆప్షనల్ లీవ్స్, 15 ఈఎల్స్ (ఎర్నింగ్ లీవ్స్) ఉంటాయి. వీటిలో ఒకటి రెండు కూడా వాడుకోలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారు. 24 గంటల్లో 16 గంటలపాటు తీవ్ర పనిఒత్తిడిలో నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు రాష్ట్ర పోలీసులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన కొత్తలో వారాంతపు సెలవు విషయం తెరపైకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలత చూపింది. దీంతో 2017లో నగరంలో కొంతకాలం వారాంతపు సెలవు అమలు చేయగలిగారు. కానీ, నగరంలో బందోబస్తు, వరుస పండుగలు, శాంతిభద్రతల కారణంగా సిబ్బంది కొరత ఏర్పడి, వీక్లీ ఆఫ్‌ల తతంగానికి అక్కడే మంగళం పాడారు. వారాంతపు సెలవు విషయాన్ని అమలు చేయాల్సిందిగా హోంశాఖ గతేడాది అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఆదేశాలు రాష్ట్రంలో ప్రతి స్టేషన్‌కు చేరాయి. కానీ అమలుకు మాత్రం నోచుకోలేదు. ఎప్పుడూ ఒత్తిడిలోనే.. ఇటీవల ఎన్నికల అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మరోసారి ఈ అంశంపై పరిశీలన జరిపారు. దీంతో పోలీసు ఉద్యోగుల్లో మరోసారి ఆశలు చిగురించాయి. కనీసం కొత్త ప్రభుత్వంలోనైనా తమ చిరకాల కోరిక నెరవేరుతుందని అనుకున్నారు. కానీ, తర్వాత సర్పంచ్, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలతో మరింత పనిఒత్తిడి పెరగడం గమనార్హం. ఇటీవల పోలీసు నియామక బోర్డు నిర్వహించిన ఎస్ఐ పరీక్షలకు 3,000 మందికిపైగా కానిస్టేబుళ్లు, హోంగార్డులు దరఖాస్తు చేసుకున్నారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తిచేశారు. రాతపరీక్షలకు సెలవులివ్వాలని కోరినా డిపార్ట్మెంటు కనికరించలేదు. దీంతో మార్చి తర్వాత సగానికిపైగా కానిస్టేబుళ్లు అనధికారిక సెలవుపై వెళ్లారు. రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉందని, పార్లమెంటు ఎన్నికలయ్యేదాకా ఎవరికీ సెలవులిచ్చేది లేదంటూ డీజీ కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో గత్యంతరం లేక వారంతా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. సెలవు మాట అటుంచితే.. పిల్లలు, తల్లిదండ్రులు జబ్బు పడ్డా సెలవు పెట్టలేని దుస్థితిలో ఉన్నామని, దయ చేసి ఈసారైనా వారాంతపు సెలవు అమలు చేయా లని పోలీసులంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. -
నిఘా నేత్రాలు
సాక్షి, చెన్నై: రాష్ర్టంలోని అన్ని పోలీసుస్టేషన్లలో ఐదేళ్లలోపు నిఘా నేత్రాలు తప్పని సరిగా ఏర్పాటు చేసి తీరుతామని హైకోర్టుకు హోం శాఖ స్పష్టం చేసింది. ఏడాదికి 263 స్టేషన్లలో నిఘా నేత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇక, నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యం న్యాయవాదుల మధ్య వాదనలు జోరుగానే సాగాయి. చివరకు కేసును హైకోర్టు తోసి పుచ్చింది. రాష్ర్టంలో అనేక పోలీసు స్టేషన్లు రచ్చబండలుగా మారి ఉన్న విషయం తెలిసిందే. బాసులు పెట్టిందే చట్టం, చేసేదే న్యాయం. అలాగే, తరచూ అక్కడక్కడ చోటుచేసుకుంటున్న లాకప్ డెత్‌లు అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఈ సమయంలో గత ఏడాది రామనాథపురంలో విచారణ పేరిట మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన యువకుడ్ని తీసుకు వెళ్లి లాకప్ డెత్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది. అలాగే, అన్ని పోలీసు స్టేషన్లలో నిఘా నేత్రాలు తప్పని సరిగా ఏర్పాటు చేయాల్సిందేనన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఇందుకు మద్రాసు హైకోర్టు సైతం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే రీతిలో వ్యవహరించింది. పిటిషన్: న్యాయవాదులు పి ప్రకాష్‌రాజ్, నారాయణన్ కలిసి దాఖలు చేసిన ప్రజా వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ విచారించేందుకు నిర్ణయించింది. పోలీసు స్టేషన్లలో సాగుతున్న బండారాలను వివరిస్తూ దాఖలైన ఆ పిటిషన్‌లోని పలు అంశాలకు కోర్టు అండగా నిలిచిందని చెప్పవచ్చు. అన్ని పోలీసు స్టేషన్లలో నిఘా నేత్రాలు తప్పని సరిగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్ సూచించిన వాదనతో కోర్టు ఏకీభవించింది. నిఘా నేత్రాల ఏర్పాటుకు సంబంధించి పలు మార్లు హోం శాఖకు కోర్టు అక్షింతలు వేసింది. చివరకు గత నెల సాగిన విచారణ సమయంలో ఏదో మొక్కుబడిగా వివరణ ఇచ్చి తప్పించుకునే యత్నం చేసిన హోం శాఖ అధికారులకు చీవాట్లు తప్పలేదు. ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సత్యనారాయణ నేతృత్వంలోని బెంచ్ హోం శాఖ వర్గాల పని తీరుపై తీవ్రంగానే స్పందించింది. అధికారుల్ని కోర్టు మెట్లు ఎక్కించింది. చివరకు చేసిన తప్పును సరిదిద్దుకునే పనిలో హోంశాఖ వర్గాలు పడ్డాయి. ఐదేళ్లలో నిఘా : శుక్రవారం పిటిషన్ విచారణకు రాగా, రాష్ట్ర హోం శాఖ తరపున ఐజీ(అడ్మిన్)డేవిడ్ సన్ దేవా ఆశీర్వాదం కోర్టుకు వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు 217 స్టేషన్లలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. మరో ఐదేళ్లల్లో అన్ని స్టేషన్లలో నిఘా నేత్రాలు తప్పని సరిగా ఏర్పాటు చేసి తీరుతామని, ఆయా స్టేషన్లలో రికార్డు అయ్యే దృశ్యాలను డిస్క్గా రూపొందించి భద్ర పరుస్తామని వివరించారు. ఏడాదికి 263 స్టేషన్లలో నిఘా నేత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్రం నుంచి హోంశాఖకు అందాల్సిన నిధుల్లో పారదర్శకత లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిధుల్ని తగ్గించడంతో మోడరన్ పోలీసు స్టేషన్ ఏర్పాటులో వెనక్కు తగ్గాల్సి వచ్చిందని వివరించారు. కేంద్రం నిధుల కోతపై ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది శ్రీనివాసన్‌ను ఉద్దేశించి నిధులు తగ్గాయని చెబుతున్నారుగా, నిధుల సక్రమంగా మంజూరు అయ్యే విధంగా కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లండి అని సూచించారు. ఇంతలో రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది అరవింద్ జోక్యం చేసుకుని ఈ విషయంగా కేంద్రానికి లేఖల్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించి ఉన్నదని వివరించారు. ఈసందర్భంగా నిధుల కోతపై కాసేపు వాదనలు జోరుగానే సాగాయి. చివరకు రాష్ట్ర హోం శాఖ ఇచ్చిన వివరణ, ఐదేళ్లలోపు నిఘా నేత్రాల ఏర్పాటు హామీతో హైకోర్టు బెంచ్ ఏకీభవించింది. దీంతో ఈ పిటిషన్ విచారణను ముగించినట్టు ప్రకటించారు.