అయ్యా..సెలవెప్పుడిస్తారు? | Police afflicted with a severe work stress | Sakshi
Sakshi News home page

అయ్యా..సెలవెప్పుడిస్తారు?

Published Wed, May 1 2019 3:27 AM | Last Updated on Wed, May 1 2019 3:27 AM

Police afflicted with a severe work stress - Sakshi

 ‘పక్షవాతం వచ్చిన తన తల్లికి మందులేస్తుండగా.. అర్జంటుగా రావాలని స్టేషన్‌ నుంచి ఫోన్‌.. తన తల్లిని, భార్య సరిగ్గా చూసుకోదని తెలిసినా అన్యమనస్కంగా విధులకు బయల్దేరాడు ఓ సీఐ.
 ‘తన కూతురు 11వ పుట్టినరోజు.. సాయంత్రం త్వరగా ఇంటికి వస్తానని బిడ్డకు మాటిచ్చి వెళ్లలేకపోయిన ఓ మహిళా ఉన్నతాధికారి వేదన మాటల్లో వర్ణించలేం. 
 ‘మే 1వ తేదీ తన పెళ్లిరోజు, ప్రపంచ కార్మిక దినోత్సవం కూడా. అయినా.. కార్మికుల వేడుకలకు బందోబస్తు కోసం బయల్దేరాడు ఓ కానిస్టేబుల్‌’ 

– సాక్షి, హైదరాబాద్‌

పోలీసు శాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడికి ఇవన్నీ కేవలం చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇంతకంటే క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కుటుంబాన్ని వదిలి కేవలం వృత్తి ధర్మంకోసం 24 గంటలు డ్యూటీలు చేస్తున్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖలో దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తోన్న వారాంతపు సెలవు ప్రక్రియకు నేటికీ మోక్షం కలగడం లేదు. పలుమార్లు తెరపైకి రావడం, ఉద్యోగుల్లో ఆశలు రేపడం.. అంతలోనే మరుగున పడటం అత్యంత సాధారణ విషయంగా మారింది. 

24 గంటలు ప్రజాసేవలోనే.. 
పోలీసు మాన్యువల్స్‌లో ఎక్కడా పోలీసు డ్యూటీ 24 గంటలు అని రాసి లేదు. కానీ, మన రాష్ట్రంలో, దేశంలో అంతటా.. సెలవుల్లేకుండానే పనిచేస్తున్నారు. వాస్తవానికి ప్రతి పోలీసుకు 15 సీఎల్స్‌ (క్యాజువల్‌ లీవ్స్‌), 5 ఆప్షనల్‌ లీవ్స్, 15 ఈఎల్స్‌ (ఎర్నింగ్‌ లీవ్స్‌) ఉంటాయి. వీటిలో ఒకటి రెండు కూడా వాడుకోలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారు. 24 గంటల్లో 16 గంటలపాటు తీవ్ర పనిఒత్తిడిలో నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు రాష్ట్ర పోలీసులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన కొత్తలో వారాంతపు సెలవు విషయం తెరపైకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలత చూపింది. దీంతో 2017లో నగరంలో కొంతకాలం వారాంతపు సెలవు అమలు చేయగలిగారు. కానీ, నగరంలో బందోబస్తు, వరుస పండుగలు, శాంతిభద్రతల కారణంగా సిబ్బంది కొరత ఏర్పడి, వీక్లీ ఆఫ్‌ల తతంగానికి అక్కడే మంగళం పాడారు. వారాంతపు సెలవు విషయాన్ని అమలు చేయాల్సిందిగా హోంశాఖ గతేడాది అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఆదేశాలు రాష్ట్రంలో ప్రతి స్టేషన్‌కు చేరాయి. కానీ అమలుకు మాత్రం నోచుకోలేదు. 

ఎప్పుడూ ఒత్తిడిలోనే.. 
ఇటీవల ఎన్నికల అనంతరం హోంమంత్రి మహమూద్‌ అలీ మరోసారి ఈ అంశంపై పరిశీలన జరిపారు. దీంతో పోలీసు ఉద్యోగుల్లో మరోసారి ఆశలు చిగురించాయి. కనీసం కొత్త ప్రభుత్వంలోనైనా తమ చిరకాల కోరిక నెరవేరుతుందని అనుకున్నారు. కానీ, తర్వాత సర్పంచ్, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలతో మరింత పనిఒత్తిడి పెరగడం గమనార్హం. ఇటీవల పోలీసు నియామక బోర్డు నిర్వహించిన ఎస్‌ఐ పరీక్షలకు 3,000 మందికిపైగా కానిస్టేబుళ్లు, హోంగార్డులు దరఖాస్తు చేసుకున్నారు.

దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తిచేశారు. రాతపరీక్షలకు సెలవులివ్వాలని కోరినా డిపార్ట్‌మెంటు కనికరించలేదు. దీంతో మార్చి తర్వాత సగానికిపైగా కానిస్టేబుళ్లు అనధికారిక సెలవుపై వెళ్లారు. రాష్ట్రంలో కోడ్‌ అమల్లో ఉందని, పార్లమెంటు ఎన్నికలయ్యేదాకా ఎవరికీ సెలవులిచ్చేది లేదంటూ డీజీ కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో గత్యంతరం లేక వారంతా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. సెలవు మాట అటుంచితే.. పిల్లలు, తల్లిదండ్రులు జబ్బు పడ్డా సెలవు పెట్టలేని దుస్థితిలో ఉన్నామని, దయ చేసి ఈసారైనా వారాంతపు సెలవు అమలు చేయా లని పోలీసులంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement