Labor Day
-
టెక్స్టైల్ పార్క్ మూసివేత
సిరిసిల్ల: కార్మికుల దినోత్సవం రోజునే టెక్స్టైల్ పార్కు మూతపడింది. మరమగ్గాలపై నేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలోనే తొలిసారిగా సిరిసిల్లలో ఏర్పాటైన టెక్స్టైల్ పార్క్ లో పరిశ్రమల యజమానులు వస్త్రోత్పత్తి యూని ట్లను ఆదివారం మూసివేశారు. ఇప్పటికే టెక్స్టైల్ పార్క్‌లో వస్త్రోత్పత్తి గిట్టుబాటు కావడం లేదని ఆధునిక మరమగ్గాలను అమ్మేస్తున్నారు. తాజాగా ఆదివారం మొత్తం పరిశ్రమలను నిరవధికంగా బంద్ పెట్టడంతో అక్కడ పనిచేసే 1,500 మంది కార్మికులు రోడ్డునపడ్డారు. మంత్రి కేటీఆర్ ప్రాతి నిధ్యం వహిస్తున్న సిరిసిల్లలోనే టెక్స్టైల్ పార్క్ మూతపడటం చర్చనీయాంశమైంది. కరెంట్ ‘షాక్’ కారణం.. రాజన్న సిరిసిల్ల జిల్లా బద్దెనపల్లి శివారులో 65 ఎకరాల్లో 2003లో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటైంది. ఇక్కడ 7,000మంది కార్మికులకు ఉపాధి కల్పిం చాల్సి ఉండగా.. 3వేల మందికే పని లభిస్తోంది. పార్క్‌లో 113 యూనిట్లలో (1,695 మగ్గాలు) వస్త్రోత్పత్తి జరుగుతోంది. ఇటీవల సంక్షోభానికి గురైన 25మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్స్ లూమ్స్‌ను అమ్మేసుకున్నారు. వసతుల లేమి.. విద్యుత్ చార్జీల భారం పార్క్‌లోని పరిశ్రమ లకు శాపంగా మారాయి. సిరిసిల్లలోని పాత మర మగ్గాలకు 50% విద్యుత్ రాయితీని ప్రభుత్వం అమ లుచేస్తోంది. అదే టెక్స్టైల్ పార్క్‌లో వస్త్రోత్పత్తిదా రులకు యూనిట్ కరెంట్ ధర రూ.7.50 ఉంది. అదే మహారాష్ట్రలో యూనిట్ విద్యుత్ చార్జీ రూ.3గా ఉంది. తమిళనాడులో 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండగా.. అంతకుమించి వినియోగిస్తే.. ప్రతి యూనిట్‌కు రూ.2.50గా ఉంది. గతంలో టెక్స్టైల్ పార్క్‌లోని యూనిట్లకు.. 2014 డిసెంబర్ నాటికి 50% విద్యుత్ రాయితీని ప్రభుత్వం అందించి నిలిపివేసింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిశ్రమల యజమానులే విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. మరోవైపు నూలు రేట్లు బాగా పెరగడం, రవాణా చార్జీలు ఎక్కువ కావడంతో వస్త్రోత్పత్తి వ్యయం పెరిగింది. ఆ మేరకు మార్కెట్లో బట్టకు రేటు లభించక నష్టాలను చవిచూస్తున్నారు. ఫలితంగా టెక్స్టైల్ పార్క్‌లో పరిశ్రమలను నిరవధికంగా మూసివేశారు. యజమానుల డిమాండ్లు ఇవీ.. ♦2015 జనవరి – 2020 డిసెంబర్ వరకు విద్యుత్ సబ్సిడీ రీయింబర్స్ చేయాలి. ♦పార్క్‌లో మరమగ్గాల ఆధునీకరణకు, కొత్త యూనిట్లకు 25% ప్రోత్సాహకం ఇవ్వాలి. ♦పరిశ్రమలకు కేటాయించిన ప్లాట్లకు ‘ఎన్వోసీ’ సరళతరం చేయాలి. ♦టెక్స్టైల్ పార్క్‌లో కమ్యూనిటీ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ) ఏర్పాటు చేయాలి. ♦ప్రభుత్వం వస్త్రోత్పత్తి ఆర్డర్లను 25% టెక్స్టైల్ పార్క్‌కు ఇవ్వాలి. ♦యువకులకు మగ్గాలపై శిక్షణ ఇవ్వాలి. మంత్రి కేటీఆర్ చొరవచూపాలి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌లో నెలకొన్న సమస్యలపై మంత్రి కేటీఆర్ చొరవచూపి ఆదుకోవాలి. ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న విద్యుత్ రాయితీ రీయింబర్స్మెంట్ అందించాలి. – అన్నల్దాస్ అనిల్‌కుమార్, పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు -
అయ్యా..సెలవెప్పుడిస్తారు?
‘పక్షవాతం వచ్చిన తన తల్లికి మందులేస్తుండగా.. అర్జంటుగా రావాలని స్టేషన్ నుంచి ఫోన్.. తన తల్లిని, భార్య సరిగ్గా చూసుకోదని తెలిసినా అన్యమనస్కంగా విధులకు బయల్దేరాడు ఓ సీఐ. ‘తన కూతురు 11వ పుట్టినరోజు.. సాయంత్రం త్వరగా ఇంటికి వస్తానని బిడ్డకు మాటిచ్చి వెళ్లలేకపోయిన ఓ మహిళా ఉన్నతాధికారి వేదన మాటల్లో వర్ణించలేం. ‘మే 1వ తేదీ తన పెళ్లిరోజు, ప్రపంచ కార్మిక దినోత్సవం కూడా. అయినా.. కార్మికుల వేడుకలకు బందోబస్తు కోసం బయల్దేరాడు ఓ కానిస్టేబుల్’ – సాక్షి, హైదరాబాద్ పోలీసు శాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడికి ఇవన్నీ కేవలం చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇంతకంటే క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కుటుంబాన్ని వదిలి కేవలం వృత్తి ధర్మంకోసం 24 గంటలు డ్యూటీలు చేస్తున్నారు. రాష్ట్రంలో పోలీసు శాఖలో దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తోన్న వారాంతపు సెలవు ప్రక్రియకు నేటికీ మోక్షం కలగడం లేదు. పలుమార్లు తెరపైకి రావడం, ఉద్యోగుల్లో ఆశలు రేపడం.. అంతలోనే మరుగున పడటం అత్యంత సాధారణ విషయంగా మారింది. 24 గంటలు ప్రజాసేవలోనే.. పోలీసు మాన్యువల్స్‌లో ఎక్కడా పోలీసు డ్యూటీ 24 గంటలు అని రాసి లేదు. కానీ, మన రాష్ట్రంలో, దేశంలో అంతటా.. సెలవుల్లేకుండానే పనిచేస్తున్నారు. వాస్తవానికి ప్రతి పోలీసుకు 15 సీఎల్స్ (క్యాజువల్ లీవ్స్), 5 ఆప్షనల్ లీవ్స్, 15 ఈఎల్స్ (ఎర్నింగ్ లీవ్స్) ఉంటాయి. వీటిలో ఒకటి రెండు కూడా వాడుకోలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారు. 24 గంటల్లో 16 గంటలపాటు తీవ్ర పనిఒత్తిడిలో నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు రాష్ట్ర పోలీసులు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన కొత్తలో వారాంతపు సెలవు విషయం తెరపైకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలత చూపింది. దీంతో 2017లో నగరంలో కొంతకాలం వారాంతపు సెలవు అమలు చేయగలిగారు. కానీ, నగరంలో బందోబస్తు, వరుస పండుగలు, శాంతిభద్రతల కారణంగా సిబ్బంది కొరత ఏర్పడి, వీక్లీ ఆఫ్‌ల తతంగానికి అక్కడే మంగళం పాడారు. వారాంతపు సెలవు విషయాన్ని అమలు చేయాల్సిందిగా హోంశాఖ గతేడాది అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఆదేశాలు రాష్ట్రంలో ప్రతి స్టేషన్‌కు చేరాయి. కానీ అమలుకు మాత్రం నోచుకోలేదు. ఎప్పుడూ ఒత్తిడిలోనే.. ఇటీవల ఎన్నికల అనంతరం హోంమంత్రి మహమూద్ అలీ మరోసారి ఈ అంశంపై పరిశీలన జరిపారు. దీంతో పోలీసు ఉద్యోగుల్లో మరోసారి ఆశలు చిగురించాయి. కనీసం కొత్త ప్రభుత్వంలోనైనా తమ చిరకాల కోరిక నెరవేరుతుందని అనుకున్నారు. కానీ, తర్వాత సర్పంచ్, పార్లమెంటు, స్థానిక సంస్థల ఎన్నికలతో మరింత పనిఒత్తిడి పెరగడం గమనార్హం. ఇటీవల పోలీసు నియామక బోర్డు నిర్వహించిన ఎస్ఐ పరీక్షలకు 3,000 మందికిపైగా కానిస్టేబుళ్లు, హోంగార్డులు దరఖాస్తు చేసుకున్నారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తిచేశారు. రాతపరీక్షలకు సెలవులివ్వాలని కోరినా డిపార్ట్మెంటు కనికరించలేదు. దీంతో మార్చి తర్వాత సగానికిపైగా కానిస్టేబుళ్లు అనధికారిక సెలవుపై వెళ్లారు. రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉందని, పార్లమెంటు ఎన్నికలయ్యేదాకా ఎవరికీ సెలవులిచ్చేది లేదంటూ డీజీ కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో గత్యంతరం లేక వారంతా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. సెలవు మాట అటుంచితే.. పిల్లలు, తల్లిదండ్రులు జబ్బు పడ్డా సెలవు పెట్టలేని దుస్థితిలో ఉన్నామని, దయ చేసి ఈసారైనా వారాంతపు సెలవు అమలు చేయా లని పోలీసులంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. -
డిష్యుం... డిష్యుం...
గెస్ట్ కాలమ్ గనిలో పనిలో కార్ఖానాలో/యంత్రభూతముల కోరలు తోమే/కార్మిక ధీరుల విషాదాశ్రులకు/ఖరీదు కట్టే షరాబు లేడోయ్! ఎనభైఏళ్ల కిందట మహాకవి రాసిన వాక్యాలు ఇప్పటికీ ప్రసంగాలలో వినిపిస్తుంటాయి. నేడే మేడే అంటూ ఒకప్పుడు మాదాల రంగారావు ‘ఎర్రమల్లెలు’ చిత్రంలో పాడితే పరవశించిన పరిస్థితి ఇప్పుడు వుందా? వాలెంటైన్స్ డేల కాలంలో కార్మికుల దినోత్సవాలకు ప్రాముఖ్యం కనిపిస్తుందా? విత్ ఎ క్లిక్ ఆఫ్ సెకండ్లో కావలసినవి వచ్చేస్తుంటే, వర్చ్యువాలిటీ విశ్వరూపం దాలుస్తుంటే, ఈ కాలం చెల్లిన మాటలు వినేవారెవ్వరు..? మేడే మొదలైందే పనిగంటల తగ్గింపు కోసం. ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, మరో ఎనిమిది గంటలు మా ఇష్టం అన్నది వారి నినాదం. కాని ఇప్పుడు మనం చెప్పుకునే కంప్యూటర్ నిపుణులకు పనిగంటల నియమం ఖచ్చితంగా అమలవుతోందా? ఇంటికి కూడా లాప్‌ట్యాప్ తీసుకొచ్చి పడక గదిలోనూ పని చేయడం, వర్కింగ్ హాలీడేలు చూడ్డం లేదా? నేరుగా ఉద్యోగాలిస్తే నిబంధనలు, పనిగంటలు పాటించాలని కాంట్రాక్టు ఔట్ సోర్సింగు అంటూ డొంక తిరుగుడుగా దోచుకోవడం రోజూ చూస్తున్నాం. ఇదెంత దూరం పోయిందంటే సాంకేతిక నైపుణ్యానికి మారుపేరుగా చెప్పుకునే జపాన్‌లోనే కరోషి అనే పనివొత్తిడి జబ్బుతో 2015లో దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక అంచనా. ప్రపంచీకరణ ఫలితంగా పెట్టుబడులు ప్రవహించి ఉద్యోగావకాశాలు పెరిగిపోతాయన్న అంచనాలు ఇప్పుడు లేవు. అమెరికా నుంచి మనదేశం వరకూ నిరుద్యోగుల లెక్కలు వినిపిస్తున్నాయి. లక్నోలో కొద్ది మాసాల కిందట అతి సాధారణమైన అటెండర్ ఉద్యోగాల కోసం 23 లక్షల మంది దరఖాస్తు చేశారు. వారిలో 25 మంది డాక్టరే ట్లు కూడా వున్నారు! ఛత్తీస్‌ఘడ్‌లో ఇలాగే లెక్కకు మిక్కుటంగా 75 వేల దరఖాస్తులు వచ్చేసరికి ఆ ఇంటర్వ్యూలనే రద్దు చేసి పారేశారు. భారత్ వెలిగిపోతుంది, మేకిన్ ఇండియా... ఈ నినాదాల వెలుతురు వెనుక చీకటి గాఢంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మునిగిపోయే టైటానిక్‌లా వుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చెట్లు లేని చోట ఆముదపు చెట్టులా తప్ప మన ఆర్థిక వ్యవస్థ గొప్పగా సాధించిందనుకోవద్దని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామరాజన్ హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణం సంపద ఏ కొద్దిమంది దగ్గరో పోగుపడటం. మన దేశ సంపదలోని సగం కేవలం ఒక శాతం మంది సంపన్నుల దగ్గరే ఉంది. అమెరికాలో కూడా కేవలం 158 కుటుంబాలే దేశ సంపద మీద పెత్తనం చేస్తున్నాయి. ఈ సంపద అంతా ఎక్కడిది? కోటానుకోట్ల మంది కార్మికులతో విచక్షణారహితంగా చాకిరీ చేయించుకోవడం, వారికి అందాల్సిన వేతనాలని ఇవ్వకపోవడం, ఆదాయం పంచకపోవడం వల్లనే. ఇది చాలదన్నట్టు సాంకేతికాభివృద్ధిని పెంచడం వల్ల, రోబోల రంగప్రవేశం వల్ల నోరున్న మనుషుల ప్రాధాన్యం ఇంకా తగ్గిపోతుంది. మెషీన్లలో వారూ మెషీన్లుగా మారిపోక తప్పదు. తమ చైతన్యాన్ని, హక్కులను, డిమాండ్లను మర్చిపోయి మరమనుషులుగా మారక తప్పదు. కాని ఇది ఎంతోకాలం సాగకపోవచ్చు. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండు పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’ అన్న మార్క్స్ మాటకు మర మనుషులు కూడా గొంతు కలిపే రోజు వస్తుంది. అయితే అప్పుడెప్పుడో ఆయన చెప్పినట్టే కార్మికులు జీవిస్తున్నారా? యంత్రాలు అన్ని పనులూ సులభం చేయలేదా? కంప్యూటర్ల వినియోగంతో శ్రమ తగ్గి నైపుణ్యం, నాణ్యత మెరుగుపడలేదా? మరి కఠోరశ్రమ అవసరముందా? మనిషికి మరమనిషి ప్రత్యామ్నాయం కావడం ఎప్పటికీ జరగదు. ఎందుకంటే సాంకేతిక నైపుణ్యం మనకు యంత్రాలనిస్తుంది కాని నడిపేది మనిషే. అవి తమకు ఇవ్వబడిన ఆదేశాల ప్రకారం చెప్పింది చెప్పినట్టు చేసుకుపోతాయి తప్ప తేడాపాడాలు వాటికి తెలియవు. కనుక మ్యాన్ అండ్ మెషీన్ ఒక కాంబినేషన్. ఒకటి వుంటేనే మరొకటి. మేధా శారీరక శ్రమతో సాంకేతిక పరికరాలను సృష్టించాల్సింది మనుషులే. సృజనాత్మకంగా ఉత్పాదకత పెంచడం ఎలాగో కూడా మనుషులే ఆలోచించాలి తప్ప వాటికవే లక్ష్యాలు నిర్దేశించుకోలేవు. వాటికి కావలసిన సరఫరాలు సమన్వయం మనుషులతోనే జరుగుతుంది. మరలు కూడా ఒక దశ వరకే పనిచేస్తాయి. తర్వాత వేడిక్కిపోతాయి. చెడిపోతాయి. ఆగిపోతాయి. ఏదో ఒక ఇంధనం లేకుంటే నడవలేవు. కనుకనే మానవ రహిత మరప్రపంచాన్ని వూహించడానికి లేదు. - తెలకపల్లి రవి,సీనియర్ పాత్రికేయులు -
కార్మిక దినోత్సవాలు ఎన్ని వచ్చినా మారని బతుకు..
ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న నినాదం విన సొంపుగా ఉన్నా... ఆచరణలో సాధ్యం కావడం లేదు. కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమంటూ దశాబ్దాలుగా చెబుతున్న పాలకుల్లో చిత్తశుద్ధి లోపించింది. దీంతో కార్మిక చట్టాలు కాస్తా అభాసుపాలవుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా... ఏ రోజుకారోజు కష్టపడందే పూట గడవని బతుకులు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని వాడవాడలా ఘనంగా జరుపుకుంటున్నా... బతుకుబండిని లాగాలంటే శ్రమదోపిడీ తప్పడం లేదు. బెంగళూరులోని కేఆర్ మార్కెట్ వద్ద కాయగూరలను శుక్రవారం బండిలో తరలిస్తున్న కార్మికుడు. - బెంగళూరు -
రెపరెపలాడిన అరుణపతాకం
సాక్షి, ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలతోపాటు కార్మిక దినోత్సవాలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అనేక తెలుగు సంఘాలు కూడా మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని, కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాయి. ముంబై ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనిట్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ర్యాలీలు, జెండా ఆవిష్కరణలు, సభలను రిలయన్స్ కంపెనీకి చెందిన నాలుగు జోన్లల్లో నిర్వహించారు. తిలక్ నగర్ జోన్లో సైదులు సంగపంప, ఎడ్ల సత్తన్న, దిండోషి జోన్లో గుండె శంకర్, మల్లేశ్ ధీరమల్లు, ఎంఎంఆర్డీఏ జోన్లో కత్తుల లింగస్వామి, శ్రీను జింకల, ఎంఐడీసీ జోన్లో పొట్ట వెంకటేశ్ నేతృత్వంలో కంపెనీ గేటు ఎదుట ‘మేడే’ ఎర్ర జెండాలను ఎగురవేశారు. అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలకు యూనియన్ నాయకులు దిండోషిలో వాసు, మిలింద్ రానడే, అఖిల భారత తెలంగాణ రచయిత వేదిక కార్యదర్శి మచ్చ ప్రభాకర్ తదితరులు హాజరై అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్మికుల హక్కులనుద్దేశించి మచ్చ ప్రభాకర్ మాట్లాడుతూ... ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగోలో 1848, మే 1న కార్మికులు రక్తాన్ని చిందించిన రోజును ప్రపంచమంతటా కార్మికదినంగా జరుపుకుంటున్నారన్నారు. ఆ వారసత్వాన్ని ముంబైలోని రిలయన్స్ తెలుగు కార్మికులు కొనసాగిస్తుండడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ సంవత్సరం సుమారు పది ప్రాంతాల్లో శ్రమజీవి సంఘం, తెలంగాణ సంఘీభావ వేదికతోపాటు మరికొన్ని తెలంగాణ ప్రజా సంఘాలు కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. రిలయన్స్ నాయకులు మిలింద్ రానడే, ఎస్. సైదులు తిలక్ నగర్ జోన్లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ.. కార్మికుల ఐక్యత వల్లనే రిలయన్స్‌లో యూనియన్ బలపడి ఎన్నో హక్కులను సాధించుకొని ముందుకు పోతున్నామన్నారు. భవిష్యత్తులో మరింత విస్తరించి కార్మికుల సంక్షేమం కోసం పోరాడదామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కళా బృందం ఆలపించిన ఓ అరుణ పతాకమా.. కార్మికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలకు బొమ్మ లజ్మీన్, చెక్క మహేశ్ తదితరులు సహకరించారు. ఎంఐడీసీలో పొట్ట వెంకటేశ్, వాసు కార్మిక హక్కుల గురించి, మేడే ప్రత్యేకతను వివరించి సంఘటిత పోరాటమే లక్ష్యంగా కార్మికులు ముందుకు నడిచి తమ జీవితాలను మెరుగుపర్చుకోవాలన్నారు. పద్మశాలి సుధారక మండలి ఆధ్వర్యంలో.. పద్మశాలి సమాజ సుధారక మండలి ఆధ్వర్యంలో మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలు, కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా జరిగింది. వర్లీ బీడీడీ చాల్స్‌లోని మండలి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండలి సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేష్, అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్ తదితరులు మే డే, అవతరణ దినోత్సవాల గురించి ప్రసంగించారు. ముఖ్యంగా సంయుక్త మహారాష్ట్ర కోసం అమరులైన వీరుల్లో తెలుగు వారు కూడా ఉన్నారని గుర్తుచేసుకున్నారు. హరిత పాటిల్, డి.అన్నపూర్ణాదేవి ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి జిందం భాస్కర్, పీఆర్వో సురుకుట్ల సురేష్, కోశాధికారి వక్కల్దేవి గణేష్, వేముల రామచందర్, చాప పరమేశ్వర్, నుమల్ల గంగాధర్ తదితరుల పాల్గొన్నారు. తూర్పు డోంబివలిలో.. సాక్షి, ముంబై: తెలంగాణ శ్రమజీవి సంఘం, తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో తూర్పు డోంబివలిలో గురువారం ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకున్నారు. లేబర్ నాకా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు ప్రసంగించారు. తర్వాత కళాకారులు ఆలపించిన గేయాలు సభికులను ఉత్తేజపరిచాయి. కార్యక్రమంలో శ్రమజీవి సంఘం నాయకుడు గోండ్యాల రమేష్, అక్కనపెల్లి దుర్గేష్, సీపీఐఎంఎల్ మహారాష్ర్ట అధ్యక్షుడు అరుణ్, అక్షయ్, బాలరాజ్, బద్లాపూర్ నర్సింహ్మ, వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. తూర్పు అంధేరీలో.. తూర్పు అంధేరిలోని ‘తెలుగు కార్మికుల అసోసియేషన్ ముంబై’ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముఖ్యఅతిథిగా హాజరైన బస రాజయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ఏర్పడిన అనేక చట్టాలు, శాసనాలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. కార్యక్రమంలో పదాధికారుల ప్రధాన కార్యదర్శి బత్తుల లింగం, ఉపాధ్యక్షుడు కృపానందం, కార్యదర్శి మగ్గిడి రవి, కోశాధికారులు సంఘం ప్రభాకర్, తలారి భూమన్నలతోపాటు వినోద్, బస మహేష్, మణుకల పోశెట్టి, కోతి గంగారం, బోండోల్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ ములుండ్‌లో.. భారత్ సేవా సంఘం (బిఎల్ఎస్ఎస్), సంత్ రవిదాస్ మాదిగ సంఘం (ఎస్ఆర్ఎంఎస్) సంయుక్తంగా గురువారం ఉదయం పశ్చిమ ములుండ్‌లో తెలుగు నాకా వద్ద ప్రపంచ కార్మిక దినం, సంయుక్త మహారాష్ట్ర దినం, నారాయణ మేగాజీ లోఖండే జయంతి సభ నిర్వహించారు. ఈ సభలో బిఎల్ఎస్ఎస్ అధ్యక్షుడు డి. సాయిలు ముదిరాజ్, ఉపాధ్యక్షుడు గడ్సె స్వామి, కార్యదర్శి బోనగిరి కుమార్, ఎస్‌ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు బి. ద్రవిడ్ మాదిగ, జుట్టు లక్ష్మణ్, శనిగారం రవి, డి. శంకర్, బి. రాజేష్, కిషోర్, కొత్తూరి నందు, గుండ్ల అజయ్ తదితరులు పాల్గొన్నారు.