డిష్యుం... డిష్యుం...
గెస్ట్ కాలమ్
గనిలో పనిలో కార్ఖానాలో/యంత్రభూతముల కోరలు తోమే/కార్మిక ధీరుల విషాదాశ్రులకు/ఖరీదు కట్టే షరాబు లేడోయ్!
ఎనభైఏళ్ల కిందట మహాకవి రాసిన వాక్యాలు ఇప్పటికీ ప్రసంగాలలో వినిపిస్తుంటాయి. నేడే మేడే అంటూ ఒకప్పుడు మాదాల రంగారావు ‘ఎర్రమల్లెలు’ చిత్రంలో పాడితే పరవశించిన పరిస్థితి ఇప్పుడు వుందా? వాలెంటైన్స్ డేల కాలంలో కార్మికుల దినోత్సవాలకు ప్రాముఖ్యం కనిపిస్తుందా? విత్ ఎ క్లిక్ ఆఫ్ సెకండ్‌లో కావలసినవి వచ్చేస్తుంటే, వర్చ్యువాలిటీ విశ్వరూపం దాలుస్తుంటే, ఈ కాలం చెల్లిన మాటలు వినేవారెవ్వరు..?
మేడే మొదలైందే పనిగంటల తగ్గింపు కోసం. ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, మరో ఎనిమిది గంటలు మా ఇష్టం అన్నది వారి నినాదం. కాని ఇప్పుడు మనం చెప్పుకునే కంప్యూటర్ నిపుణులకు పనిగంటల నియమం ఖచ్చితంగా అమలవుతోందా? ఇంటికి కూడా లాప్‌ట్యాప్ తీసుకొచ్చి పడక గదిలోనూ పని చేయడం, వర్కింగ్ హాలీడేలు చూడ్డం లేదా? నేరుగా ఉద్యోగాలిస్తే నిబంధనలు, పనిగంటలు పాటించాలని కాంట్రాక్టు ఔట్ సోర్సింగు అంటూ డొంక తిరుగుడుగా దోచుకోవడం రోజూ చూస్తున్నాం. ఇదెంత దూరం పోయిందంటే సాంకేతిక నైపుణ్యానికి మారుపేరుగా చెప్పుకునే జపాన్‌లోనే కరోషి అనే పనివొత్తిడి జబ్బుతో 2015లో దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక అంచనా.
ప్రపంచీకరణ ఫలితంగా పెట్టుబడులు ప్రవహించి ఉద్యోగావకాశాలు పెరిగిపోతాయన్న అంచనాలు ఇప్పుడు లేవు. అమెరికా నుంచి మనదేశం వరకూ నిరుద్యోగుల లెక్కలు వినిపిస్తున్నాయి. లక్నోలో కొద్ది మాసాల కిందట అతి సాధారణమైన అటెండర్ ఉద్యోగాల కోసం 23 లక్షల మంది దరఖాస్తు చేశారు. వారిలో 25 మంది డాక్టరే ట్లు కూడా వున్నారు! ఛత్తీస్‌ఘడ్‌లో ఇలాగే లెక్కకు మిక్కుటంగా 75 వేల దరఖాస్తులు వచ్చేసరికి ఆ ఇంటర్వ్యూలనే రద్దు చేసి పారేశారు.
భారత్ వెలిగిపోతుంది, మేకిన్ ఇండియా... ఈ నినాదాల వెలుతురు వెనుక చీకటి గాఢంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మునిగిపోయే టైటానిక్‌లా వుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చెట్లు లేని చోట ఆముదపు చెట్టులా తప్ప మన ఆర్థిక వ్యవస్థ గొప్పగా సాధించిందనుకోవద్దని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామరాజన్ హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణం సంపద ఏ కొద్దిమంది దగ్గరో పోగుపడటం. మన దేశ సంపదలోని సగం కేవలం ఒక శాతం మంది సంపన్నుల దగ్గరే ఉంది. అమెరికాలో కూడా కేవలం 158 కుటుంబాలే దేశ సంపద మీద పెత్తనం చేస్తున్నాయి.
ఈ సంపద అంతా ఎక్కడిది? కోటానుకోట్ల మంది కార్మికులతో విచక్షణారహితంగా చాకిరీ చేయించుకోవడం, వారికి అందాల్సిన వేతనాలని ఇవ్వకపోవడం, ఆదాయం పంచకపోవడం వల్లనే. ఇది చాలదన్నట్టు సాంకేతికాభివృద్ధిని పెంచడం వల్ల, రోబోల రంగప్రవేశం వల్ల నోరున్న మనుషుల ప్రాధాన్యం ఇంకా తగ్గిపోతుంది.
మెషీన్లలో వారూ మెషీన్లుగా మారిపోక తప్పదు. తమ చైతన్యాన్ని, హక్కులను, డిమాండ్లను మర్చిపోయి మరమనుషులుగా మారక తప్పదు. కాని ఇది ఎంతోకాలం సాగకపోవచ్చు. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండు పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’ అన్న మార్క్స్ మాటకు మర మనుషులు కూడా గొంతు కలిపే రోజు వస్తుంది. అయితే అప్పుడెప్పుడో ఆయన చెప్పినట్టే కార్మికులు జీవిస్తున్నారా? యంత్రాలు అన్ని పనులూ సులభం చేయలేదా? కంప్యూటర్ల వినియోగంతో శ్రమ తగ్గి నైపుణ్యం, నాణ్యత మెరుగుపడలేదా? మరి కఠోరశ్రమ అవసరముందా?
మనిషికి మరమనిషి ప్రత్యామ్నాయం కావడం ఎప్పటికీ జరగదు. ఎందుకంటే సాంకేతిక నైపుణ్యం మనకు యంత్రాలనిస్తుంది కాని నడిపేది మనిషే. అవి తమకు ఇవ్వబడిన ఆదేశాల ప్రకారం చెప్పింది చెప్పినట్టు చేసుకుపోతాయి తప్ప తేడాపాడాలు వాటికి తెలియవు. కనుక మ్యాన్ అండ్ మెషీన్ ఒక కాంబినేషన్. ఒకటి వుంటేనే మరొకటి.
మేధా శారీరక శ్రమతో సాంకేతిక పరికరాలను సృష్టించాల్సింది మనుషులే. సృజనాత్మకంగా ఉత్పాదకత పెంచడం ఎలాగో కూడా మనుషులే ఆలోచించాలి తప్ప వాటికవే లక్ష్యాలు నిర్దేశించుకోలేవు. వాటికి కావలసిన సరఫరాలు సమన్వయం మనుషులతోనే జరుగుతుంది. మరలు కూడా ఒక దశ వరకే పనిచేస్తాయి. తర్వాత వేడిక్కిపోతాయి. చెడిపోతాయి. ఆగిపోతాయి. ఏదో ఒక ఇంధనం లేకుంటే నడవలేవు. కనుకనే మానవ రహిత మరప్రపంచాన్ని వూహించడానికి లేదు.
- తెలకపల్లి రవి,సీనియర్ పాత్రికేయులు