సాక్షి, ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలతోపాటు కార్మిక దినోత్సవాలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అనేక తెలుగు సంఘాలు కూడా మహారాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని, కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాయి. ముంబై ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనిట్ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ర్యాలీలు, జెండా ఆవిష్కరణలు, సభలను రిలయన్స్ కంపెనీకి చెందిన నాలుగు జోన్లల్లో నిర్వహించారు. తిలక్ నగర్ జోన్‌లో సైదులు సంగపంప, ఎడ్ల సత్తన్న, దిండోషి జోన్‌లో గుండె శంకర్, మల్లేశ్ ధీరమల్లు, ఎంఎంఆర్‌డీఏ జోన్‌లో కత్తుల లింగస్వామి, శ్రీను జింకల, ఎంఐడీసీ జోన్‌లో పొట్ట వెంకటేశ్ నేతృత్వంలో కంపెనీ గేటు ఎదుట ‘మేడే’ ఎర్ర జెండాలను ఎగురవేశారు.
అనంతరం నినాదాలు చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలకు యూనియన్ నాయకులు దిండోషిలో వాసు, మిలింద్ రానడే, అఖిల భారత తెలంగాణ రచయిత వేదిక కార్యదర్శి మచ్చ ప్రభాకర్ తదితరులు హాజరై అమరవీరులకు నివాళులు అర్పించారు. కార్మికుల హక్కులనుద్దేశించి మచ్చ ప్రభాకర్ మాట్లాడుతూ... ఎనిమిది గంటల పని విధానం కోసం చికాగోలో 1848, మే 1న కార్మికులు రక్తాన్ని చిందించిన రోజును ప్రపంచమంతటా కార్మికదినంగా జరుపుకుంటున్నారన్నారు. ఆ వారసత్వాన్ని ముంబైలోని రిలయన్స్ తెలుగు కార్మికులు కొనసాగిస్తుండడం ఎంతో గర్వంగా ఉందన్నారు.
ఈ సంవత్సరం సుమారు పది ప్రాంతాల్లో శ్రమజీవి సంఘం, తెలంగాణ సంఘీభావ వేదికతోపాటు మరికొన్ని తెలంగాణ ప్రజా సంఘాలు కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. రిలయన్స్ నాయకులు మిలింద్ రానడే, ఎస్. సైదులు తిలక్ నగర్ జోన్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ.. కార్మికుల ఐక్యత వల్లనే రిలయన్స్‌లో యూనియన్ బలపడి ఎన్నో హక్కులను సాధించుకొని ముందుకు పోతున్నామన్నారు. భవిష్యత్తులో మరింత విస్తరించి కార్మికుల సంక్షేమం కోసం పోరాడదామన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కళా బృందం ఆలపించిన ఓ అరుణ పతాకమా.. కార్మికులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాలకు బొమ్మ లజ్మీన్, చెక్క మహేశ్ తదితరులు సహకరించారు. ఎంఐడీసీలో పొట్ట వెంకటేశ్, వాసు కార్మిక హక్కుల గురించి, మేడే ప్రత్యేకతను వివరించి సంఘటిత పోరాటమే లక్ష్యంగా కార్మికులు ముందుకు నడిచి తమ జీవితాలను మెరుగుపర్చుకోవాలన్నారు.
పద్మశాలి సుధారక మండలి ఆధ్వర్యంలో..
పద్మశాలి సమాజ సుధారక మండలి ఆధ్వర్యంలో మహారాష్ట్ర అవతరణ దినోత్సవాలు, కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా జరిగింది. వర్లీ బీడీడీ చాల్స్‌లోని మండలి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండలి సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ధర్మకర్తల మండలి చైర్మన్ మంతెన రమేష్, అధ్యక్షుడు వాసాల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్ తదితరులు మే డే, అవతరణ దినోత్సవాల గురించి ప్రసంగించారు. ముఖ్యంగా సంయుక్త మహారాష్ట్ర కోసం అమరులైన వీరుల్లో తెలుగు వారు కూడా ఉన్నారని గుర్తుచేసుకున్నారు. హరిత పాటిల్, డి.అన్నపూర్ణాదేవి ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి జిందం భాస్కర్, పీఆర్వో సురుకుట్ల సురేష్, కోశాధికారి వక్కల్‌దేవి గణేష్, వేముల రామచందర్, చాప పరమేశ్వర్, నుమల్ల గంగాధర్ తదితరుల పాల్గొన్నారు.
తూర్పు డోంబివలిలో..
సాక్షి, ముంబై: తెలంగాణ శ్రమజీవి సంఘం, తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక సంయుక్త ఆధ్వర్యంలో తూర్పు డోంబివలిలో గురువారం ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకున్నారు. లేబర్ నాకా వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు ప్రసంగించారు. తర్వాత కళాకారులు ఆలపించిన గేయాలు సభికులను ఉత్తేజపరిచాయి. కార్యక్రమంలో శ్రమజీవి సంఘం నాయకుడు గోండ్యాల రమేష్, అక్కనపెల్లి దుర్గేష్, సీపీఐఎంఎల్ మహారాష్ర్ట అధ్యక్షుడు అరుణ్, అక్షయ్, బాలరాజ్, బద్లాపూర్ నర్సింహ్మ, వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
తూర్పు అంధేరీలో..
తూర్పు అంధేరిలోని ‘తెలుగు కార్మికుల అసోసియేషన్ ముంబై’ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ముఖ్యఅతిథిగా హాజరైన బస రాజయ్య మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం ఏర్పడిన అనేక చట్టాలు, శాసనాలు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. కార్యక్రమంలో పదాధికారుల ప్రధాన కార్యదర్శి బత్తుల లింగం, ఉపాధ్యక్షుడు కృపానందం, కార్యదర్శి మగ్గిడి రవి, కోశాధికారులు సంఘం ప్రభాకర్, తలారి భూమన్నలతోపాటు వినోద్, బస మహేష్, మణుకల పోశెట్టి, కోతి గంగారం, బోండోల్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ ములుండ్‌లో..
భారత్ సేవా సంఘం (బిఎల్‌ఎస్‌ఎస్), సంత్ రవిదాస్ మాదిగ సంఘం (ఎస్‌ఆర్‌ఎంఎస్) సంయుక్తంగా గురువారం ఉదయం పశ్చిమ ములుండ్‌లో తెలుగు నాకా వద్ద ప్రపంచ కార్మిక దినం, సంయుక్త మహారాష్ట్ర దినం, నారాయణ మేగాజీ లోఖండే జయంతి సభ నిర్వహించారు. ఈ సభలో బిఎల్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు డి. సాయిలు ముదిరాజ్, ఉపాధ్యక్షుడు గడ్సె స్వామి, కార్యదర్శి బోనగిరి కుమార్, ఎస్‌ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు బి. ద్రవిడ్ మాదిగ, జుట్టు లక్ష్మణ్, శనిగారం రవి, డి. శంకర్, బి. రాజేష్, కిషోర్, కొత్తూరి నందు, గుండ్ల అజయ్ తదితరులు పాల్గొన్నారు.
రెపరెపలాడిన అరుణపతాకం
Published Thu, May 1 2014 10:51 PM | Last Updated on Wed, Sep 5 2018 3:59 PM
Advertisement
Advertisement