బీఆర్‌ఎస్‌ నేతలపైనా నిఘా! | Surveillance on BRS leaders too in Phone Tapping Case | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నేతలపైనా నిఘా!

Published Tue, May 28 2024 5:01 AM | Last Updated on Tue, May 28 2024 5:01 AM

Surveillance on BRS leaders too in Phone Tapping Case

ఎమ్మెల్సీలు,మాజీ మంత్రులను వదలని ప్రభాకర్‌రావు

‘ఎమ్మెల్యేలకు ఎర’ ఆపరేషన్‌లో టాస్క్‌ఫోర్స్‌ కీలకపాత్ర

ఓ కీలక వ్యక్తి కోసం కేరళకు చార్టర్డ్‌ ఫ్లైట్‌లో వెళ్లిన పోలీసులు

తమ నేరాంగీకార వాంగ్మూలాల్లో నిందితుల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ఈ నిఘా కేవలం ప్రతిపక్ష నేతలకే పరిమితం కాలేదని, అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన అసమ్మతి నేతలపైనా సాగినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు, హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు నేతృత్వంలో అనేక అక్రమాలు సాగాయని నేరాంగీకార వాంగ్మూలాల్లో పోలీసులు పేర్కొన్నారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ ఆపరేషన్‌ కోసం అవసరమైన నిఘా పరికరాలను ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి కొనుగోలు చేయగా... కేరళకు చెందిన ఓ కీలక వ్యక్తిని పట్టుకోవడానికి పోలీసులు ఏకంగా చార్టర్డ్‌ ఫ్లైట్‌లో అక్కడకు వెళ్లినట్లు బయటపడింది. పంజగుట్ట పోలీసులు గతంలో అరెస్టు చేసిన మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, డీఎస్పీ నాయిని భుజంగరావులకు సంబంధించిన నేరాంగీకార వాంగ్మూలాల్లో ఈ కీలకాంశాలను పొందుపరిచిన దర్యాప్తు అధికారులు.. వీటిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.  

రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ఆపరేషన్‌  
దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో ఆ పారీ్టకి బ్రేక్‌ వేయాలని నాటి సీఎం కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. 2022 అక్టోబర్‌ చివరి వారంలో నాటి ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి ద్వారా ఓ కీలక విషయం కేసీఆర్‌కు తెలిసింది. బీఆర్‌ఎస్‌ను వీడి తమ పార్టీలో చేరేలా బీజేపీకి చెందిన కొందరు వ్యక్తులు ఎర వేస్తున్నారంటూ రోహిత్‌రెడ్డి నాటి సీఎంకు చెప్పారు. అప్పటికే మునుగోడు ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీని ఇరుకున పెట్టాలని నిర్ణయించుకున్న కేసీఆర్‌ ఈ విషయాన్ని ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావులకు అప్పగించడంతోపాటు వారికి సహకరించాలని రోహిత్‌రెడ్డిని ఆదేశించారు. డీఎస్పీ ప్రణీత్‌రావు ద్వారా కొందరు ప్రైవేట్‌ వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టడం ద్వారా కీలక విషయాలు రాబట్టారు. ఈ ఆడియో క్లిప్స్‌ను కేసీఆర్‌కు అందించారు. 

వీటి ఆధారంగా మొయినాబాద్‌ సమీపంలోని అజీజ్‌ నగర్‌లో ఉన్న రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో ప్రత్యేక ఆపరేషన్‌కు ప్లాన్‌ చేశారు. ఫలానా రోజున అక్కడికి రావాలని రోహిత్‌రెడ్డి ద్వారా నందుతోపాటు ఇద్దరు స్వామీజీలకు సందేశం పంపారు. అప్పట్లో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌లను రాధాకిషన్‌రావు ఢిల్లీకి పంపి ప్రత్యేక స్పై కెమెరాలు ఖరీదు చేయించారు. వీటిని శ్రీకాంత్‌తోపాటు మరో ఇద్దరు ఎస్సైలు మల్లికార్జున్, అశోక్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో బిగించారు. రోహిత్‌రెడ్డితోపాటు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను స్వయంగా కేసీఆర్‌ రంగంలోకి దింపారు. క్షేత్రస్థాయిలో సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. 

ఆపై ఏర్పాటైన సిట్‌ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక నేత బీఎల్‌ సంతోష్‌ను అరెస్టు చేయించాలని తద్వారా బీజేపీని దారిలోకి తెచ్చుకుని తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఉన్న ఈడీ కేసు నీరుగారేలా చేయాలని భావించారు. కొందరు సైబరాబాద్‌ పోలీసుల అసమర్థత కారణంగా కేరళలోని మాతా అమృతానందమయి ఆశ్రమానికి చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తి తప్పించుకున్నాడు. దీంతో ఆయన్ను పట్టుకోవడానికి ఎస్పీ రెమా రాజేశ్వరి, ఇన్‌స్పెక్టర్‌ బి.గట్టుమల్లుతో కూడిన బృందాన్ని ఏకంగా చార్టర్డ్‌ ఫ్లైట్‌లో అక్కడకు పంపించారు. ఈ ప్రయత్నమూ సఫలీకృతం కాకపోవడంతోపాటు ఆయా నిందితులను అరెస్టు చేయొద్దని, కేసును సీబీఐకి అప్పగించాలని న్యాయస్థానం నుంచి ఆదేశాలు రావడంతో అంతా అసంతృప్తి చెందారు. తాను అనుకున్నది జరగకపోవడంపై కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు.  

బీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను గుర్తించి... 
ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు మధ్య తరచూ వివిధ నియోజకవర్గాల్లోని రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిగేవి. బీఆర్‌ఎస్‌తోపాటు దాని నాయకులకు ఇబ్బందికరంగా ఉన్న పరిణామాలను వీళ్లు గుర్తించే వాళ్లు. ఈ సమాచారాన్ని ప్రణీత్‌కు పంపి ఆయా వ్యక్తులపై నిఘా పెట్టమని ఆదేశించే వాళ్లు. ఇలా ఎస్‌ఐబీ నిఘా ఉంచిన వారిలో బీఆర్‌ఎస్‌కు చెందిన వాళ్లూ ఉండటం గమనార్హం. 

నాటి కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యేతో విభేదించిన అప్పటి ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, అప్పట్లో కడియం శ్రీహరితో విభేదాలు ఉన్న మాజీ మంత్రి టి.రాజయ్య, తాండూరు ఎమ్మెల్యేపై అసంతృప్తిగా ఉన్న పట్నం మహేందర్‌ రెడ్డి దంపతులతోపాటు మాజీ ఐపీఎస్‌ అధికారి, నాటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్‌ మల్లన్న, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కుటుంబ సభ్యులు, రెండు మీడియా సంస్థల అధినేతలు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్, గద్వాలకు చెందిన సరిత తిరుపతయ్య, కోరుట్ల వాసి జువ్వాడి నర్సింగరావు, అచ్చంపేటకు చెందిన వంశీకృష్ణ, మానకొండూరుకు చెందిన కవ్వంపల్లి సత్యనారాయణ, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల ఫోన్లు ట్యాప్‌ చేశారు. వీరితోపాటు వివిధ నిర్మాణ సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలకు చెందిన యజమానులు, వ్యాపారవేత్తల ఫోన్ల పైనా అక్రమ నిఘా ఉంచారు.  

ఫోన్‌ కాల్స్‌కు దూరంగా ఉన్న వారిపై.. 
ఎస్‌ఐబీ నిఘా ఉంటుందన్న భయంతో అప్పట్లో అనేక మంది రాజకీయ నాయకులు, న్యాయాధికారులు, ప్రభుత్వ అధికారులు ఫోన్‌ కాల్స్‌కు దూరంగా ఉన్నారు. వీళ్లు ఎక్కువగా సిగ్నల్, స్నాప్‌చాట్‌ తదితర సోషల్‌ మీడియాను వినియోగిస్తూ ఎ¯న్‌క్రిపె్టడ్‌ విధానంలో మాట్లాడటం ప్రారంభించారు. దీన్ని గుర్తించిన ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావు.. వారు ఎవరితో మాట్లాడారో గుర్తించడానికి వారి ఐపీడీఆర్‌లు (ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ డేటా రికార్డ్స్‌) సేకరించి, విశ్లేషించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్‌–నవంబర్‌ల్లో ట్యాపింగ్‌ మరింత పెరిగింది. 

నాటి మంత్రి టి.హరీశ్‌రావు సిఫార్సుతో ఐన్యూస్‌ సంస్థ అధినేత శ్రావణ్‌ కుమార్‌ ప్రభాకర్‌రావుతో సన్నిహితంగా మెలిగారు. అనేక సందర్భాల్లో ఆయన వాట్సాప్‌ ద్వారా ప్రణీత్‌రావుతో టచ్‌లో ఉన్నారు. అలా కాంగ్రెస్, బీజేపీ నాయకులు, వారి మద్దతుదారుల వివరాలు సేకరించి అందించే వారు. ప్రత్యర్థి నాయకులను లక్ష్యంగా చేసుకుని వారి నగదును స్వా«దీనం చేసుకోవడానికి, టార్గెట్‌ చేసిన వ్యక్తులను ట్రోల్‌ చేయడానికి శ్రావణ్‌ పూర్తి సహాయ సహకారాలు అందించారు. తాను 2020లో పదవీ విరమణ చేసిన తర్వాత రెండుసార్లు టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీగా పెద్దాయన (కేసీఆర్‌) అవకాశం ఇచ్చారని, ఈ విశ్వాసంతో కొన్ని కేసులకు అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటపెట్టనని రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement