ప్రైవేటు వైద్య కళాశాలలకు షాక్ | Shock to the private medical colleges | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వైద్య కళాశాలలకు షాక్

Published Tue, Sep 30 2014 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

ప్రైవేటు వైద్య కళాశాలలకు షాక్

ప్రైవేటు వైద్య కళాశాలలకు షాక్

మార్కుల వెసులుబాటు నిబంధనలను కొట్టేసిన హైకోర్టు   
55 శాతం విద్యార్థికి 14.. 72 శాతం విద్యార్థికి సున్నా మార్కులా!
వచ్చే ఏడాది నుంచి ప్రతిభ ఆధారంగానే ప్రవేశాలు జరగాలి
ఇప్పటికే పూర్తయిన ప్రవేశాలకు ఈ తీర్పు వర్తించదని స్పష్టీకరణ

 
హైదరాబాద్: ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్యాలకు హైకోర్టు పెద్ద షాక్‌నిచ్చింది. ఇప్పటివరకు 15 శాతం ఇంటర్వ్యూ మార్కుల ను అడ్డంపెట్టుకుని యాజమాన్యపు కోటా కింద సీట్లను తమకు అధిక మొత్తాలు చెల్లించిన విద్యార్థులతో భర్తీ చేసుకుంటున్న యాజమాన్యాలకు బ్రేక్ వేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) మెడికల్, డెంటల్ తదితర కోర్సుల్లో యాజమాన్యపు కోటా కింద ప్రవేశాలు కల్పించే సమయంలో విద్యార్థులకు ఇంటర్వ్యూ ద్వారా 15 శాతం మార్కులు కేటాయించే వెసులుబాటును యాజ మాన్యాలకు కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది రూపొందించిన నిబంధనలను కొట్టివేసింది. ఈ ఉత్తర్వులు పీజీ వైద్య విద్య నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాక ఏపీ విద్యా సంస్థలు (ప్రవేశాల నియంత్రణ, క్యాపిటేషన్ ఫీజు నిషేధం) చట్టం 1983కు, మృదుల్ ధార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సైతం విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. వెంటనే కొత్త నిబంధనలు రూపొందించాలని ఆదేశిం చింది. అంతేకాక వచ్చే విద్యా సంవత్సరం నుంచి యాజమాన్యపు కోటా కింద జరిగే పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ఇంటర్వ్యూతో సంబంధం లేకుండా ప్రతిభ (మెరిట్) ఆధారంగా మాత్రమే జరిగేలా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ ఎ.శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 15 శాతం ఇంటర్వ్యూ నిబంధనల ప్రకారం యాజమాన్యపు కోటా కింద ఆయా కాలేజీల్లో ఇప్పటికే పూర్తయిన ప్రవేశాలకు వైద్య విశ్వవిద్యాలయం ఆమోదముద్ర వేసి ఉంటే, ఆ ప్రవేశాలపై ఈ తీర్పు ఎటువంటి ప్రభావం చూపదని, ఆ ప్రవేశాలు యథాతథంగా కొనసాగవచ్చునంటూ ధర్మాసనం తన తీర్పులో స్పష్టతనిచ్చింది.

ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజీ ప్రవేశాలను విశ్వవిద్యాలయం ఆమోదిం చలేదు కాబట్టి, ఆ కాలేజీలకి సంబంధించి తాజాగా ప్రతిభావంతుల జాబితాను తయారుచేసి, ఆ జాబితాను సదరు కాలేజీకి పంపాలని యూనివర్సిటీని ఆదేశించింది. యూనివర్సిటీ నుంచి వచ్చే జాబితా ఆధారంగా ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రతిభ ఆధారంగా ఆయా విద్యార్థులకు వారు కోరిన కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలని ఎన్‌ఐఆర్ కాలేజీకి ధర్మాసనం స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ మూడు సంవత్సరాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా కాకుండా 15 శాతం ఇంటర్వ్యూ మార్కులను పరిగణనలోకి తీసుకుని ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజీ తమకు ప్రవేశాలు నిరాకరించిందని, అసలు ఈ 15 శాతం మార్కుల నిబంధనలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ డాక్టర్ ఎస్.పి.శివాని, మరో నలుగురు వైద్య విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 25న తీర్పు వెలువరించింది. ‘‘ఈ కేసులో ఎన్‌ఆర్‌ఐ కాలేజీ తయారు చేసిన మెరిట్ జాబితాను పరిశీలిస్తే, ఎంబీబీఎస్ కోర్సులో 55.95 శాతం మార్కులు వచ్చిన విద్యార్థికి ఇంటర్వూలో 15 మార్కులకు14 ఇచ్చారు. అదే 72.08 శాతం మార్కులు వచ్చిన విద్యార్థికి ఇంటర్వ్యూలో 15కు గాను సున్నా మార్కులు కేటాయించారు. 72 శాతం మార్కులు వచ్చిన విద్యార్థికి పీజీ సీటు దొరకే పరిస్థితి లేకుండా పోయింది. ఫీజు కింద భారీ మొత్తాలు చెల్లించిన వారికే యాజమాన్యాలు సీట్లు కేటాయిస్తున్నాయని చెప్పేందుకు ఇదే పెద్ద ఉదాహరణ. 15 శాతం మార్కుల నిబంధనలు క్యాపిటేషన్ ఫీజు నిషేధం చట్టానికి విరుద్ధంగా ఎలా ఉన్నాయో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ 15 శాతం మార్కుల నిబంధనలను చట్ట విరుద్ధమని ప్రకటిస్తూ, వాటిని కొట్టివేస్తున్నాం’’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఈ సందర్భంగా ధర్మాసనం ప్రైవేటు వైద్య కళాశాల తీరును ధర్మాసనం ఎండగట్టింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement