మెట్రోరైల్ నిర్మాణంలో భాగంగా అమీర్‌పేటలో సేకరించ తలపెట్టిన భూముల్లో ఉన్న భవనాలను కూల్చవద్దని హైకోర్టు శుక్రవారం అధికారులను ఆదేశించింది.
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైల్ నిర్మాణంలో భాగంగా అమీర్‌పేటలో సేకరించ తలపెట్టిన భూముల్లో ఉన్న భవనాలను కూల్చవద్దని హైకోర్టు శుక్రవారం అధికారులను ఆదేశించింది. భూసేకరణ ప్రక్రియను మాత్రం యథాతథంగా కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మెట్రోరైల్ నిర్మాణంలో భాగంగా అమీర్‌పేటలో రోడ్డు విస్తరణకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను సవాలు చేస్తూ గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట, మధురానగర్, కృష్ణానగర్ సంయుక్త కార్యాచరణ కమిటీ, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని న్యాయమూర్తి విచారించారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి వాదనలు వినిపిస్తూ, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ చేస్తున్నారని, దీనివల్ల పిటిషనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం చేస్తున్న భూ సేకరణ ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చని, అయితే ఏ ఒక్క భవనాన్నీ కూల్చవద్దని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ వ్యాజ్యాలను ఇప్పటికే మెట్రోరైల్ వ్యవహారంలో ధర్మాసనం ముందు విచారణలోనున్న వ్యాజ్యాలతో జత చేయాలని రిజిస్ట్రీకి సూచించారు.