‘సెస్’ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు
► అభ్యర్థి లేదా ఏజెంట్‌కు అనుమతి
► కౌంటింగ్‌కు నాలుగు టేబుళ్లు
► హైకోర్టు నిర్ణయంపైనే
► ఉత్కంఠ కోర్టు నిర్ణయానికి లోబడి ఫలితాలు
► ఎన్నికల అధికారి చంద్రమోహన్‌రెడ్డి
సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిరిసిల్ల పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, పోటీ చేసిన అభ్యర్థులు, లేదా వారి తరఫున ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఎన్నికల ఫలితాలు సాయంత్రం 3 గంటల వరకు వెల్లడయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.
పోలింగ్ సరళిపై చర్చలు
‘సెస్’ ఎన్నికల్లో పోలింగ్ సరళిపై అంచనాలు వేస్తూ.. తమకు వచ్చే ఓట్ల గురించి అభ్యర్థులు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. సిరిసిల్ల పట్టణంలో పది మంది బరిలో ఉండగా ఇద్దరి మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటల్లో ద్విముఖ పోటీ ఉండడంతో గెలుపుపై ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు. ముస్తాబాద్‌లో నలుగురు పోటీలో ఉండగా అధికార టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థి గెలుపుపై ధీమాగా ఉన్నారు. వేములవాడ పట్టణంలో ఆరుగురు బరిలో ఉండగా విజయంపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. వేములవాడ రూరల్‌లో అధికార పార్టీ గెలుపుపై ధీమాగా ఉంది. చందుర్తిలో చతుర్ముఖ పోటీ ఉన్నా విజయంపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కోనరావుపేటలో చతుర్ముఖ పోటీలో గెలుపెవరిదో అంతుచిక్కని పరిస్థితి. ఇల్లంతకుంటలో ఆరుగురు, బోయినపల్లిలో నలుగురు పోటీలో ఉన్నారు. 11 డెరైక్టర్ స్థానాలకు 50 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.
హైకోర్టుదే తుది నిర్ణయం
‘సెస్’ ఎన్నికల ఫలితాలపై హైకోర్టుదే తుది నిర్ణయంగా భావిస్తున్నారు. ఎన్నికల్లో అర్హులైన ఓటర్లను బకాయిల పేరుతో ఓటింగ్‌కు దూరం చేశారని, చనిపోయిన ఓటర్ల స్థానంలో వారి వారసులకు అవకాశం కల్పించలేదని పేర్కొంటూ సిరిసిల్లకు చెందిన డి.ప్రభాకర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల పక్రియను కొనసాగించాలని, ఫలితాలు ఎలా వచ్చినా కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. పిటిషనర్ ప్రభాకర్‌రావు వాదనను కోర్టు సమర్థిస్తే ఎన్నికలే రద్దయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఆయన వాదనతో ఏకీభవించకుంటే ‘సెస్’ ఎన్నికలకు ఎలాంటి ప్రమాదం లేదని సహకార శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
కోర్టు నిర్ణయానికి లోబడి ఫలితాలు
సెస్’ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తిచేశాం. మంగళవారం కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తాం. బుధవారం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అభ్యర్థి లేదా అతని తరఫున ఏజెంట్‌ను కౌంటింగ్ కేంద్రంలోకి ఎవరినో ఒక్కరినే అనుమతిస్తాం. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం అందిస్తాం. ఆ పత్రంలో నోట్ పెట్టి కోర్టు నిర్ణయానికి లోబడి ఉండాలనే నిబంధనను స్పష్టం చేస్తాం. ఓట్ల లెక్కింపునకు 25 సిబ్బందిని నియమించాం. గురువారం ‘సెస్’ ఆఫీస్‌లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మెజార్టీ డెరైక్టర్ల ఆమోదం మేరకు జరుగుతుంది. అంతిమంగా కోర్టు నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే - జి.చంద్రమోహన్‌రెడ్డి, ఎన్నికల అధికారి