దేవరపల్లిలో దౌర్జన్య కాండ | The disharmony of the ruling party in Dalit lands | Sakshi
Sakshi News home page

దేవరపల్లిలో దౌర్జన్య కాండ

Published Fri, Jul 21 2017 3:58 AM | Last Updated on Tue, May 29 2018 6:01 PM

దేవరపల్లిలో దౌర్జన్య కాండ - Sakshi

దేవరపల్లిలో దౌర్జన్య కాండ

దళితుల భూముల్లో     అధికార పార్టీ దౌర్జన్యం
సాగు భూములను లాగేసుకున్న సర్కారు  
పోలీసులను అడ్డుపెట్టి అర్ధరాత్రి తవ్వకాలు
నీరు–చెట్టు పేరుతో నిధుల స్వాహాకు ఎత్తుగడ
జీవనోపాధి కోల్పోయిన దళిత కుటుంబాలు
ఆందోళనకు దిగిన వైఎస్సార్‌ సీపీ, వామపక్షాల నేతలు
జిల్లా వ్యాప్తంగా 100 మందికిపైగా అరెస్ట్‌
బాధితులకు అండగా నిలుస్తామన్న వైఎస్సార్‌ సీపీ


జిల్లాలో అధికార పార్టీ దౌర్జన్యకాండ పరాకాష్టకు చేరింది. దేవరపల్లి దళిత భూముల్లో దౌర్జన్యకాండ కొనసాగింది. గత ఎన్నికల్లో ఓట్లేయలేదన్న అక్కసుతో దశాబ్దాలుగా సాగు చేసుకొని కడుపు నింపుకుంటున్న భూములు లాగేసుకుంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసి.. అడ్డొచ్చిన వారిని, ఇళ్లలో ఉన్న గ్రామస్తులను సైతం ఈడ్చుకొచ్చి అరెస్టులు చేయించింది. రాత్రికి రాత్రే నీరు–చెట్టు పేరుతో చెరువులను తవ్వేసింది. ఆ భూములపై ఆధారపడి కుటుంబాలు ఇప్పుడు జీవనాధారం కోల్పోయి వీధిన పడ్డాయి. తాము అనుకున్నది సాధించేందుకు అధికార పార్టీ నేతలు ఎంతకైనా తెగిస్తారనడానికి పర్చూరు మండలం దేవరపల్లి ఘటన ఉదాహరణగా నిలిచింది.

దళితుల భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమించిన విషయంపై ఆరా తీసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధితులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ నేతలు దేవరపల్లి వెళ్లేందుకు మరోమారు సిద్ధమయ్యారు. దళితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని వారు ప్రకటించారు.


సాక్షి ప్రతినిధి, ఒంగోలు/పర్చూరు : పర్చూరు మండలం దేవరపల్లి గ్రామంలో 159/1 సర్వే నంబరులో కృష్ణంరాజుకుంట పేరుతో  సుమారు 39.37 ఎకరాల చెరువు పారంబోకు భూమి ఉంది. ఈ చెరువు కుంటలో ఆగ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు 60 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నాయి. 39.37 ఎకరాలకు గాను 22 ఎకరాలను గ్రామానికి చెందిన 40 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి.భూముల్లో 11.37 ఎకరాల్లో గ్రామానికి చెరువు కింద వినియోగించుకుంటున్నారు. దాదాపు ఆరు ఎకరాల భూమిలో ప్రస్తుతం టీడీపీకి చెందిన గ్రామ సర్పంచ్‌తో పాటు, మరికొందరు ఆక్రమించి స్థిర నివాసం ఉంటున్నారు. కాగా దళితుల స్వాధీనంలో ఉన్న 22 ఎకరాల భూములు చెరువుకు సంబంధించినవే అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అనుచరులు గత మూడేళ్లుగా వాటిని లాక్కునే ప్రయత్నానికి దిగారు.

భూములు తమవేనంటూ కోర్టుకెక్కిన దళితులు అధికార పార్టీ నేతలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టి దళితుల భూములు లాక్కునేందుకు అధికార పార్టీ మరోమారు సిద్ధమైంది. గురువారం తెల్లవారుజామున నుంచి దేవరపల్లి దళితుల పొలాల్లో జేసీబీలు, ఇటాచ్‌లు పెట్టి కుంట తవ్వకం ప్రారంభించారు. ఇందుకు భారీగా పోలీస్‌ బలగాలను రక్షణగా పెట్టుకున్నారు. అంతకు ముందే 40 కుటుంబాల దళితులను పడుకున్న వారిని పడుకున్నట్లే... అరెస్ట్‌లు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఆ తర్వాత పదుల సంఖ్యలో జెసిబిలు, ఇటాచ్‌లు పెట్టి దౌర్జన్యంగా నీరు–చెట్టు పథకంలో కుంట తవ్వకం ప్రారంభించారు. గురువారం సాయంత్రం వరకు భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి.

దళితులకు మద్ధతుగా ఏ ఒక్కరూ దేవరపల్లికి చేరకుండా పోలీసులు అడుగడుగునా కాపు కాశారు. వారికి మద్ధతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కాకుమాని రాజశేఖర్, జజ్జర ఆనందరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, సీపీఐ నేత ప్రకాష్, ఐద్వా నేతలు ఆదిలక్ష్మి, రమాదేవిలతో పాటు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డిలతో పాటు దాదాపు 40 మంది నేతలను పోలీసులు అరెస్ట్‌లు చేశారు. వీరిని జరుగుమల్లి, నాగులుప్పలపాడు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. దేవరపల్లికి చేరుకునేందుకు పర్చూరుకు వచ్చిన సీపీఎం రాష్ట్ర నేత మధును సైతం అక్కడే పోలీసులు అరెస్ట్‌లు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. జిల్లావ్యాప్తంగా వందలాది మందిని అరెస్ట్‌ చేసి నిర్భంధించారు. సాయంత్రం వరకు వారికి వదిలిపెట్టలేదు. మీడియాను సైతం చెరువు తవ్వకం వద్దకు అనుమతించలేదు.

ఆర్థిక లబ్ధే ధ్యేయంగా..
మరోవైపు దళితుల భూములను క్రిష్టంరాజుకుంట విస్తరణ పేరుతో నీరు–చెట్టు పథకం ద్వారా చెరువు తవ్వకాన్ని చేపట్టి పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి పొందేందుకు ఎమ్మెల్యే అనుచరులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే నీరు–చెట్టు పథకం ద్వారా క్రిష్టంరాజుకుంటను ఆధునీకరించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఇందుకోసం రూ.6.80 లక్షలు నిధులు మంజూరైనట్లు ఉంది. ఎటువంటి పనులు జరగకుండానే ప్రభుత్వ రికార్డుల్లో పనులు అయిపోయినట్లు చూపించటం చూస్తే ఇప్పటికే ఈ నిధులు స్వాహా చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు దీనిపై మౌన నిద్ర వహిస్తుండటం గమనార్హం.

దళితులకు అండగా వైఎస్సార్‌ సీపీ..
దేవరపల్లి దళితులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. వైఎస్సార్‌సీపీతో పాటు వామపక్షాలు, ప్రజాసంఘాలు సైతం వారికి మద్ధతు పలుకుతున్నారు. అధికార పార్టీ నేతలు దళితుల భూముల్లో జోలికి వెళ్లొద్దని వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి దళితుల పక్షాన ఇప్పటికే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. సమస్యను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి సైతం తీసుకువచ్చారు. జగన్‌ సూచనల మేరకు దళితుల పక్షాన పోరుబాట సాగించేందుకు వైఎస్సార్‌ సీపీ సిద్ధమైంది.

ఈ నెల 16న దళితులకు అండగా దేవరపల్లిని సందర్శించి భూములు పరిశీలించేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సిద్ధంకాగా పోలీసులు ఆంక్షలు విధించారు. 15వ తేదీ అర్థరాత్రే నుంచి ఆయన్ను గృహనిర్భంధం చేశారు. ఆయనతో పాటు జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలను పెద్ద ఎత్తున అరెస్ట్‌లు చేసి పోలీస్‌స్టేషన్లలో నిర్భంధించారు. తాజాగా దళితుల భూములను అధికార పార్టీ నేతలు స్వాధీనం చేసుకొని గురువారం కుంట తవ్వకానికి సిద్ధమైన నేపథ్యంలో దళితుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. వామపక్షాలు, ప్రజాసంఘాలు సైతం దేవరపల్లి దళితులకు మద్ధతు పలకనున్నారు.

నోరు మెదపని కలెక్టర్‌
తాము సాగుచేసుకుంటున్న భూములను అధికార పార్టీ నేతలు దౌర్జన్యంగా లాక్కోవడంతో దళితులు లబోదిబోమంటున్నారు. అధికారులకు మొర పెట్టుకున్నా వినే పరిస్థితి లేకపోవడంతో వారిది అరణ్యరోదనే అయింది. దేవరపల్లి రాష్ట్రస్థాయి వివాదంగా మారినా జిల్లా కలెక్టర్‌ మాత్రం నోరు మెదపకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement