
‘చెత్త’శుద్ధి ఏది?
న్యూఢిల్లీ: రాజధాని నగరాన్ని శుభ్రంగా ఉంచేం దుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఏమీ చేయడం లేదని హైకోర్టు మండిపడింది. ఢిల్లీలోని ప్రతి మూలను శుభ్రం చేయాలని ఆదేశించింది. నగర అపరిశుభ్రతకు ఎంపీలను, ఎమ్మెల్యేలను నిం దిస్తారని, కానీ అది పురపాలక సంస్థ బాధ్యత అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఓఖ్లా ఇండస్ట్రియల్ ప్రాంతానికి చెందిన కొందరు వీధి వ్యాపారులు దాఖలుచేసిన ఓ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్, జస్టిస్ ఎస్ మృదుల్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఓఖ్లా ప్రాంతమంతా అపరిశుభ్రం గా, చెత్తతో నిండి ఉందని, దానిని శుభ్రపరిచేం దుకు ఎంసీడీ ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఆ ప్రాంతంలో ఏయే నిర్మాణాలు చేపట్టదలచుకున్నారో వివరిస్తూ ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని ఎంసీడీని ఆదేశిం చింది. అలాగే ఆ ప్రాంతంలో చెత్తను తొలగించేందుకు తీసుకోనున్న చర్యలు, దోమల నిర్మూలనకు అనుసరించే ప్రణాళికపై కూడా వివరించాలని ఆదేశించింది. పిటిషనర్లు లేవనెత్తిన సమస్యలకు సంబంధించి స్థాయీ నివేదికను కూడా జతచేయాలని కోరింది.
ఈ కేసుపై తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసిన కోర్టు అప్పటికి ఢిల్లీ పోలీసులు కూడా ఒక స్థాయీ నివేదికను సమర్పించాలని ఆదేశించింది.తాము గౌరవంగా తమ విధులను నిర్వహించాలనుకుంటున్నామని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఇందిరా ఉన్నినాయర్ తమ వాదనలు వినిపిస్తూ ఓఖ్లా ప్రాం తమంతా రోతగా, దోమలమయంగా ఉందని తెలి పారు. చెత్తను తొలగించడంతో పాటు అక్కడ వ్యాపారులకు, ప్రజలకు ఉపయోగపడేలా మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు.
దీనిని ఎంసీడీ సమాధానమిస్తూ, వెంటనే తాము ఆ ప్రాంతాన్ని శుభ్రపరుస్తామని, మరుగుదొడ్లు కూడా నిర్మిస్తామని తెలిపింది. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ ‘కట్టండి, మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు? మీరు ఏమి కట్టాలనుకుంటున్నారో ముందుగా మాకు చూపండి. అవసరమైతే మేము అందుకు అనుమతి నిస్తాం’ అని పేర్కొన్నారు. వీధి వ్యాపారులను అడ్డుకోరాదని, అది వారి హక్కు అని హైకోర్టు గత జనవరి 16న ఢిల్లీ పోలీసులను ఆదేశించింది.
అయితే కోర్టు ఆదేశాలను అటు పోలీసులు, ఇటు మున్సిపల్ అధికారులు ఖాతరు చేయడం లేదని ఆరోపిస్తూ హాకర్లు ఈ పిటిషన్ దాఖలు చేశారు. తాము వ్యాపారాలు చేసుకోకుండా ఎంసీడీ తమ చుట్టూ చెత్తను పోగు చేస్తోందని వారు ఆరోపిం చారు. తాము ప్రశాంతంగా తమ నిరసనను తెలియచేస్తే, తమపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలిపారు. దీనిపై కోర్టు ఈ నెల 12న ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు, మరో 37 మంది ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీ చేసింది.