ఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్ ఎన్నికకు ముందర రసాభాస చోటు చేసుకుంది. నామినేటెడ్ కౌన్సిలర్‌లు ప్రమాణం చేసే సమయంలో ఆప్, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో సంయమనం పాటించాలని ప్రిసైడింగ్ ఆఫీసర్ సత్య శర్మ(బీజేపీ) తోటి సభ్యులకు పిలుపు ఇచ్చారు. అయినప్పటికీ పరిస్థితి చల్లారకపోవడంతో ఎన్నిక నిర్వహణ కాసేపు వాయిదా వేస్తున్నట్లు సత్య శర్మ ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. పది మంది నామినేటెడ్ కౌన్సిలర్లను లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఎనుకున్నారు. అయితే వాళ్లను తమతో సంప్రదించకుండానే ఏకపక్షంగా ఎన్నుకున్నారంటూ ఆప్ ఆరోపించింది. శుక్రవారం ఉదయం మేయర్ ఎన్నికకు ముందు వాళ్లు ప్రమాణం చేస్తుండగా.. ఆప్ కౌన్సిలర్లు నిరసనకు దిగారు. దీంతో ఈ రసాభాస చోటు చేసుకుంది.
ఇదిలా ఉంటే.. ఎంసీడీకి జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. ఓటమిపాలైనప్పటికీ.. మేయర్ పదవిని తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఆప్ తరపున షెల్లీ ఒబెరాయ్ పోటీపడుతుండగా, బీజేపీ నుంచి రేఖా గుప్తా బరిలో నిలిచారు. మరోవైపు బ్యాకప్ అభ్యర్థిగా అషు థాకూర్‌ను ఆప్ నిలబెట్టనుంది. మరోవైపు డిప్యూటీ మేయర్ పోస్ట్ కోసం ఆప్ నుంచి ఆలె ముహమ్మద్ ఇక్బాల్, జలాజ్ కుమార్‌లు, బీజేపీ నుంచి కమల్ బార్గీలు పోటీ పడుతున్నారు.
#WATCH | Delhi: Huge ruckus at Civic Centre, before the commencement of voting for the Delhi Mayor elections, regarding swearing-in of nominated councillors. pic.twitter.com/BCz3HLC9qL
— ANI (@ANI) January 6, 2023
బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులు
ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్
బీజేపీ కౌన్సిలర్ సత్య శర్మ ఈ ఎన్నికకు ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. మరోవైపు ముఖేష్ గోయల్ పేరును ఆప్ ప్రతిపాదించినప్పటికీ.. లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం బీజేపీ అభ్యర్థినే ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా నియమించడం విశేషం. ఈ పరిణామంపై ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఈ ఎన్నికలను ఎల్జీ ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఎల్జీ సక్సేనాపై మండిపడ్డారు.
సాధారణంగా గెలిచిన అభ్యర్థుల్లో సీనియర్‌ని ప్రొటెం స్పీకర్ లేదంటే ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా ఎంపిక చేస్తారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కౌన్సిలర్‌లు అందరిలోకెల్లా ముకేష్ గోయల్ సీనియర్. అందుకే ఆప్ ఆయన్ని హౌజ్ ఆఫ్ లీడర్‌గా నియమించుకుంది కూడా.
పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. 250 స్థానాలు ఉన్న ఎంసీడీలో.. 134 ఆప్, బీజేపీ 104 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్ 9 స్థానాలు మాత్రమే సరిపెట్టుకుంది. తొలుత ఓటమి కారణంతో మేయర్ పదవికి పోటీ చేయమని బీజేపీ ప్రకటించింది. తదనంతర పరిణామాలతో ఎందుకనో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ పోటీలోకి దిగుతున్నట్లు అభ్యర్థిని నిలిపింది.
ఢిల్లీ మేయర్ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్ చేశారు. రెండో ఏడాది ఓపెన్ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్ కేటగిరీ కింద మేయర్ అభ్యర్థిని ఎన్నుకుంటారు.
ఇదీ చదవండి: ఢిల్లీ మేయర్ ఓటింగ్: సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్.. ఏదైనా జరగొచ్చు!
Comments
Please login to add a commentAdd a comment