మంత్రులపై పిటిషన్ కొట్టివేత
ఎన్నికల తరువాత పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరినందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డిలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంత్రి పదవులు కట్టబెట్టారని, దీని వెనుక అవినీతి దాగి ఉందని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టేసింది. ముఖ్యమంత్రి సిఫారసు మేరకు మంత్రులను గవర్నర్ నియమిస్తారని పిటిషనర్‌కు గుర్తు చేసిన హైకోర్టు, పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇదే హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే స్పష్టమైన తీర్పునిచ్చిందని, అందువల్ల వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం అవినీతి కింద పరిగణించలేమని స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని అధికరణ 164 కింద గవర్నర్ ఉపయోగించే అధికారాన్ని అవినీతి కిందకు రాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మంగళవారం తీర్పు వెలువరించారు. తలసాని శ్రీనివాసయాదవ్, ఇంద్రకరణ్‌రెడ్డిలకు పదవులు ఆశజూపి పార్టీ మారేలా చేశారని, తద్వారా ప్రతిపక్షాలు లేకుండా చేసేందుకు కుట్ర పన్నారని, దీని వెనుక అవినీతి కూడా దాగి ఉందని, అందువల్ల దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, సామాజిక కార్యకర్త ఫర్హత్ ఇబ్రహీం హైదరాబాద్ మొదటి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన కోర్టు ఈ ఫిర్యాదును తోసిపుచ్చింది. కింది కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇబ్రహీం హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు.
దీనిపై వాదనలు విని ఈ నెల 16న తీర్పును వాయిదా వేసిన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ మంగళవారం తన తీర్పును వెలువరించారు. ముఖ్యమంత్రి తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకష్ణారెడ్డి చేసిన వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. అవినీతి నిరోధక చట్టం కింద చేసే ఫిర్యాదులను ఆ చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టులు మాత్రమే విచారించగలవని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. ఫిర్యాదుదారు ఏ కోర్టులో అయితే ఫిర్యాదు దాఖలు చేశారో అది ప్రత్యేక కోర్టు కాదన్నారు.
అందువల్ల అక్కడ దాఖలు చేసిన ఫిర్యాదుకు విచారణార్హతే లేదని స్పష్టం చేశారు. తలసాని, ఇంద్రకరణ్‌రెడ్డిల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం స్పీకర్ పరిధిలోని అంశమని, ఇందులో జోక్యం చేసుకోలేమంటూ ఇదే హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చిందని, వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్న ఏజీ వాదనలను న్యాయమూర్తి ఈ సందర్భంగా తన తీర్పులో ప్రముఖంగా ప్రస్తావించారు. మంత్రుల నియామకం గవర్నర్ చేస్తారని, గవర్నర్ ఉపయోగించే అధికారాలు అవినీతి చట్ట పరిధిలోకి రావన్నారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు ఏ కోణంలో చూసినా అవినీతి నిరోధక చట్ట పరిధిలోకి రావని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని కొట్టేస్తున్నట్లు జస్టిస్ ప్రవీణ్‌కుమార్ తన తీర్పులో పేర్కొన్నారు.