
సనత్‌నగర్ (హైదరాబాద్): తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, కార్యకర్తలు, నాయకులు అయోమయానికి గురికావద్దని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్పష్టం చేశారు. వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద ఆదివారం నిర్వహించిన సనత్‌నగర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తన సోదరుడు శంకర్‌యాదవ్ మరణం విషాదం నుంచి తాము ఇంకా కోలుకోలేదన్నారు. శంకర్‌యాదవ్‌తో తనకున్న ప్రత్యేక బంధం సికింద్రాబాద్ ప్రజలందరికీ తెలుసునన్నారు. తమ కుటుంబం తీవ్ర దుఃఖంలో ఉందని, ఆ కారణంగానే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనలేకపోతున్నట్లు వివరించారు.