
బీఆర్‌ఎస్‌పై డైలమా!
హైకోర్టు ఆదేశాలతో ‘క్రమబద్ధీకరణ’పై గందరగోళం
ప్రత్యామ్నాయాలపై తర్జనభర్జన
సిటీబ్యూరో : దాదాపు మరోవారం రోజుల్లో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసిపోనున్న తరుణంలో బీఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో అటు దరఖాస్తుదారులు, ఇటు జీహెచ్‌ఎంసీ అధికారుల్లో గందరగోళం నెలకొంది. తదుపరి ఉత్తర్వులిచ్చేంతవరకు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించరాదంటూ మంగళవారం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం గ్రేటర్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై స్పందిస్తూ హైకోర్టు, తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించవ ద్దని పేర్కొంది. అయితే దరఖాస్తులను స్వీకరించవచ్చునని పేర్కొనడం వారికి కొంత ఊరట కలిగించింది. వాస్తవానికి జీహెచ్ ఎంసీ అధికారులు కూడా ఇంతవరకు దరఖాస్తుల పరిశీలన చేపట్టలేదు.
ఈనెలాఖరువరకు దరఖాస్తుల స్వీకరణకు గడువుండటంతో అది ముగిశాకే సర్కిళ్ల వారీగా దరఖాస్తులను పంపిణీ చేసి, పరిష్కరించాలనే యోచనలో ఉన్నారు. జీహెచ్‌ఎంసీకి ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ కోసం దాదాపు 36 వేల దరఖాస్తులందాయి. జీహెచ్‌ఎంసీ అంచనా మేరకు ఇవి దాదాపు 30 శాతం మాత్రమే. మిగతావారు ఈ వారంరోజుల్లో దరఖాస్తుచేసుకుంటారని భావిస్తున్న తరుణంలో వెలువడిన హైకోర్టు అదేశాలతో ఇంకా దరఖాస్తుచేసుకోనివారితో పాటు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు సైతం గందరగోళానికి గురయ్యారు.
2007-08లో బీఆర్‌ఎస్‌ను అమల్లోకి తెచ్చినప్పుడే ఇది ఒకేసారి ఇస్తున్న మినహాయింపు అని, దీని ద్వారా క్రమబద్ధీకరణ అనంతరం భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు జరుగకుండా ఆది లోనే అడ్డుకుంటామని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ంఎసీ అధికారులు అప్పట్లో హైకోర్టుకు నివేదించినట్లు సమాచారం. దాన్ని అమలు చేయకపోగా, అప్పటి చట్టానికి సవరణ చేస్తూ దాన్నే 2015 వరకు పొడిగించారని పద్మనాభరెడ్డి పిల్‌లో పేర్కొన్నారు. చట్టసభలో ఆమోదం లేకుండానే చట్టసవరణ చేశారని కూడా పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది.
అమలుపై సందేహాలు..
హైకోర్టు బ్రేక్ వేయడంతో ఈ పథకం అమలవుతుందా.. లేదా ? అనే సందేహా లు వ్యక్తమవుతున్నాయి. తుదితీర్పు ఎ లా ఉంటుందోననే అనుమానాలున్నా యి. అనుమతి పొందిన నిర్మాణ ప్లాన్‌కు భిన్నంగా డీవియేషన్లకు పాల్పడిన వారు, అసలు అనుమతే లేకుండా నిర్మాణాలు చేసిన వా రు బీఆర్‌ఎస్‌తో క్రమబద్ధీకరించుకునేందుకు సిద్ధమయ్యారు. ఎంతో కాలంగా వారు ఈ పథకం కో సం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం దీని అమలు ద్వారా జీహెచ్‌ఎంసీ ద్వారానే దాదాపు రూ.1000 కోట్ల ఆదాయం సమకూరగలదని అంచనా వేసింది. ఇప్పటి వరకు అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటే దాదా పు రూ.300 కోట్ల వరకు మాత్రమే రాగలవని అంచనా. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ఉభయవర్గాలను అయోమయంలో పడవేశాయి.
ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు
జీహెచ్‌ఎంసీకి బీపీఎస్ ద్వారా సోమవారం వరకు గడచిన నెలన్నర రోజుల్లో 25 వేల దరఖాస్తులందగా , మంగళవా రం ఒక్కరోజే దాదాపు పదివేల దరఖాస్తులందాయి.హైకోర్టు ఉత్తర్వులతో గడువు పొడిగిస్తారో లేదోననే తలంపుతో మంగళవారం మధ్యాహ్నంనుంచే ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
అడ్డగోలుగా ఓసీల జారీ
2008లో ఒకసారి మినహాయింపు అని పేర్కొన్న అధికారులు దానిని 2015 వరకు పొడిగించారు. అధికారుల అంచనా మేరకే కనీసం 50 వేల అక్రమనిర్మాణాలున్నాయి. భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామని, అన్నీ సవ్యంగా ఉంటేనే తనఖానుంచి విముక్తి చేసి ఓసీ(ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఇస్తామని పేర్కొన్న అధికారులు దానిని అమలు చేయలే కపోయారు. అడ్డగోలు నిర్మాణాల క్రమబద్ధీకరణ వల్ల ఎందరికో నష్టం జరుగుతుంది. జీప్లస్1కు అనుమతి తీసుకొని ఐదారు అంతస్తులు నిర్మిస్తే పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. రహదారి విస్తీర్ణం తగినంత లేనందున ఏదైనా ప్రమాదం జరిగితే ఫైరింజను కూడా వెళ్లలేదు. 2008 నాటి మినహాయింపునే కొనసాగించడం వల్ల ఇలాంటి మినహాయింపులు ఎప్పటికీ ఉంటాయనే అభిప్రాయాలు ఏర్పడతాయి. ఇది మంచిది కాదు. మేం వేసిన పిల్ కొన్ని వేలమందికి ఇబ్బం దిగా అని పించినా, లక్షల మందికి నష్టం జరుగకుండా ఉం టుంది.
- పద్మనాభరెడ్డి,
కార్యదర్శి, ఫోరంఫర్ గుడ్‌గవర్నెన్స్