కోర్టు ఉత్తర్వులు అమలు కావడం లేదు
అంబేడ్కర్, తెలుగు వర్సిటీల వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చిన ఏపీ ఏజీ
తీవ్రంగా పరిగణిస్తామన్న ధర్మాసనం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల సేవా కేంద్రాలకు గతంలో మాదిరిగా యథాతథంగా సేవలు అందించడంతో పాటు, పరీక్షలను సైతం నిర్వహించాలని ఇరు విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లను ఆదేశిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు అమలు కావడం లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ మంగళవారం హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ, ఇది చాలా తీవ్రమైన అంశమని, సేవలు కొనసాగింపు, పరీక్షల నిర్వహణలో తామిచ్చిన ఉత్తర్వులను అమలు చేయకుండా ఉంటే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 5కు వాయిదా వేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌వీ భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని క్యాంపస్‌లకు తమ సేవలను నిలిపేస్తూ తెలుగు వర్సిటీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ ఏపీ ఉన్నత విద్యాశాఖ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో ఉన్న ప్రాంతీయ కేంద్రాలకు అంబేడ్కర్ వర్సిటీ తన సేవలను నిలిపేసిందని, దీని వల్ల 3.5 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన సంగతి విదితమే. ఈ రెండు వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం మంగళవారం వాటిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ, ఏపీలోని ఈ రెండు విశ్వవిద్యాలయాల సేవా కేంద్రాల నిర్వహణ ఖర్చులను, అందులో పనిచేస్తున్న బోధనా, బోధనేతర సిబ్బంది జీతాలను ఏపీ ప్రభుత్వమే భరించాల్సిందేనంటూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. అలాగే ఏపీలోని సేవా కేంద్రాలకు యథాతథంగా సేవలను కొనసాగించడంతో పాటు పరీక్షలను సైతం నిర్వహించాలని ఇరు విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్‌లను గత విచారణ సమయంలో ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అయితే ఈ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం వివరాలు తమ ముందుంచాలని ఆదేశించింది.