స్పీకర్ ఆఫీస్ తీరు ఇదేనా? | Supreme court comment on roja suspention | Sakshi
Sakshi News home page

స్పీకర్ ఆఫీస్ తీరు ఇదేనా?

Published Wed, Mar 16 2016 4:32 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

స్పీకర్ ఆఫీస్ తీరు ఇదేనా? - Sakshi

స్పీకర్ ఆఫీస్ తీరు ఇదేనా?

ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ వ్యవహారంలో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్య
 

 సాక్షి, న్యూఢిల్లీ
 ‘‘ఏవో సాంకేతిక కారణాలు చూపి ఒక సభ్యురాలి హక్కులకు భంగం కలిగిస్తారా? స్పీకర్ కార్యాలయం ఏం చేస్తోంది? ప్రజాప్రతినిధి పట్ల ఇలాగే వ్యవహరిస్తారా? ఒక నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో వ్యవహరించేది ఇలాగేనా? సమ్ థింగ్ రాంగ్.. పిటిషన్‌ను  హైకోర్టు రిజిస్ట్రార్ ఎలా తిరస్కరిస్తారు? హైకోర్టు ఏం చేస్తోంది? జ్యుడీషియల్ ఆర్డర్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది. ఇది కేవలం ఒక్క అసిస్టెంట్ రిజిస్ట్రార్ మాత్రమే చేసినట్లు కనిపించడం లేదు.’’ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెన్షన్‌కు గురైన నగరి శాసనసభ్యురాలు, వైఎస్సార్‌సీపీ నేత ఆర్.కె.రోజా పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం వ్యాఖ్యలివి. నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నుంచి తనను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో రోజా పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. అయితే విచారణార్హత లేదంటూ రోజా పిటిషన్‌ను హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రోజా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రోజా అప్పీలుపై జస్టిస్ గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన సుప్రీం ధర్మాసనం దాదాపు గంటకు పైగా విచారించింది. ఆ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.  ఈ కేసులో సుప్రీం ధర్మాసనం జరిపిన విచారణ ఇలా సాగింది...

 ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే...
 తొలుత రోజా తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు ప్రారంభిస్తూ ‘‘ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాల నిబంధనావళిలోని 340(2) నిబంధన ప్రకారం ఒక సభ్యుడిని ఆ సెషన్‌లో మిగిలిన రోజులకు చెల్లుబాటయ్యేలా మాత్రమే సస్పెండ్ చేసేందుకు వీలుంది. కానీ రోజా విషయంలో నిబంధనలకు విరుద్ధంగా సభా తీర్మానం పేరుతో శీతాకాల సమావేశాల్లో (డిసెంబరు 18న) ఏడాదిపాటు సస్పెన్షన్ విధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులను ఈ సస్పెన్షన్ ఉల్లంఘిస్తోంది. అంతేకాకుండా స్పీకర్ హోదాకు ఉన్న వన్నెను తగ్గిస్తుంది. ఇది సభా నిబంధనావళిని ఉల్లంఘించడమే అవుతుంది. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రోజాను సస్పెండ్ చేశారు. సమావేశాలు డిసెంబరు 22తో ముగుస్తుండగా.. ఆ సెషన్‌లో మిగిలిన దినాలైన 18 నుంచి 22 వరకు మాత్రమే సస్పెండ్ చేసేందుకు నిబంధనల ప్రకారం వీలుంది. కానీ ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినట్టు ఉత్తర్వు కాపీ కూడా ఇవ్వలేదు. అసెంబ్లీకి వెళితే పోలీసులు అమానుషంగా ప్రవ ర్తించారు. సస్పెన్షన్‌కు సంబంధించిన కాపీ ఇవ్వాలని ఎన్నిసార్లు లేఖరాసినా స్పందన లేదు. ప్రతిపక్ష నేత లేఖ రాసినా స్పందన లేదు. చిట్టచివరకు ఆ సస్పెన్షన్ ఉత్తర్వు కాపీని మార్చి 3, 2016న హైకోర్టులో విచారణ సందర్భంలో  ఇచ్చారు..’’ అని వివరించారు.

 హైకోర్టు రిజిస్ట్రార్ తిరస్కరించారు...
 ‘‘రోజా పిటిషన్ హైకోర్టులో ఫిబ్రవరి 15, 16, 17, 29 తేదీల్లో విచారణకు వచ్చింది. ఫిబ్రవరి 29న కౌంటర్‌దాఖలు చేయాలంటూ సింగిల్ జడ్జి ప్రతివాదికి నోటీసులు ఇస్తూ మార్చి 9కి విచారణను వాయిదావేశారు. మరోవైపు బడ్జెట్ సెషన్ మార్చి 5న ప్రారంభం కానున్న నేపథ్యంలో పిటిషనర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతుండగా మార్చి 3న అదనపు అడ్వొకేట్ జనరల్ సస్పెన్షన్ తీర్మానం కాపీని హైకోర్టులో ఇచ్చారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అత్యవసర పిటిషన్‌గా పరిగణించాలని రోజా కోరినా సింగిల్ జడ్జి బెంచి ఈ పిటిషన్‌ను వినేందుకు తిరస్కరించింది. మార్చి 9నే విచారిస్తానని పేర్కొంది. ఈ నేపథ్యంలో మార్చి 4వ తేదీనే సింగిల్ జడ్జి బెంచ్ వద్ద ఉన్న పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు వీలు కల్పించాలని, తమకు లభించిన సస్పెన్షన్ తీర్మానం ప్రతి ఆధారంగా మరిన్ని వాదనల తో తాజాగా మరో రిట్‌పిటిషన్ దాఖలు చేసుకుంటామని పిటిషనర్ రోజా దరఖాస్తు చేసుకున్నారు. అందుకు బెంచ్ సమ్మతించింది. ఈ నేపథ్యంలో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయగా రిజిస్ట్రార్ ఆ పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ తిరస్కరించారు. అందుకే సుప్రీం కోర్టును ఆశ్రయించాం.. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నందున సభ్యురాలిని సమావేశాలకు హాజరయ్యేలా ఉత్తర్వులు జారీచే యాల్సిందిగా కోరుతున్నాం..’’ అని విన్నవించారు.

 హైకోర్టు ఏం చేస్తోంది?
 రోజా తరపు న్యాయవాది అభ్యర్థన విన్న తరువాత జస్టిస్ అరుణ్‌మిశ్రా జోక్యం చేసుకుంటూ ‘మరో పిటిషన్ దాఖలు చేసుకునేందుకు సింగిల్ జడ్జి బెంచ్ స్వేచ్ఛనిచ్చినా రిజిస్ట్రార్ తిరస్కరించారా? రిజిస్ట్రార్‌కు ఏం సంబంధం? పిటిషన్‌ను ఎలా తిరస్కరిస్తారు?’ అని ప్రశ్నించారు.. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇచ్చిన తిరస్కరణ ఉత్తర్వును న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ‘అయితే అది చట్టబద్ధం కాని కారణాల వల్ల అలా జరిగి ఉండొచ్చు..’ అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో జస్టిస్ గోపాల గౌడ జోక్యం చేసుకుంటూ ‘హైకోర్టు ఏం చేస్తోంది? జ్యుడీషియల్ ఆర్డర్‌ను ఎందుకు పరిగణనలోకి తీసుకోరు? పిటిషన్‌కు విచారణార్హత లేదంటూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎలా రాస్తారు? అలా చెప్పే పని ఆయనది కాదే? ’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇది పద్ధతి కాదు. ఇలా ఎలా వ్యవహరిస్తారు? బడ్జెట్ సెషన్ జరుగుతుండగా.. ఇలాంటి పద్ధతికి ఎలా పాల్పడుతారు?’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో రోజా తరఫు న్యాయవాది మరోసారి లేచి బడ్జెట్ సెషన్‌లో రోజా మహిళల సమస్యలను లేవనెత్తాల్సి ఉందని ప్రస్తావించారు. దీంతో జస్టిస్ గోపాల గౌడ స్పందిస్తూ ‘అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎలా జ్యుడీషియల్ ఉత్తర్వులను పట్టించుకోకుండా తనకు సంబంధం లేని విధులను ఎలా నిర్వర్తిస్తారు? హైకోర్టు రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఏం జరుగుతుందో హెకోర్టు చీఫ్ జస్టిస్ తప్పకుండా తెలుసుకుని తీరాలి..’ అని వ్యాఖ్యానించారు. ‘రెండు రోజుల్లో ఈ కేసును పరిష్కరించాలని మేం చీఫ్ జస్టిస్‌కు సూచనలు ఇస్తాం.’ అని చెబుతుండగా న్యాయవాది మరోసారి తన వాదనలు వినిపించారు.

 ఆ తీర్పులు చూడండి..
 న్యాయవాది లేచి ‘ఆర్టికల్ 32 కింద నా అభ్యర్థనను ఇక్కడే విచారించండి. గతంలో సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో ఇలాంటి విషయాలను విచారణకు స్వీకరించింది. ఇటీవలే అలగాపురం ఆర్.మోహనరాజు అండ్ అదర్స్ వర్సెస్ తమిళనాడు శాసనసభ కేసులో జస్టిస్ చలమేశ్వర్ ఇచ్చిన తీర్పును పరిశీలించండి. రాజారాంపాల్ వర్సెస్ లోక్‌సభ స్పీకర్ కేసును పరిశీలించండి..’ అని విన్నవించారు. దీంతో జస్టిస్ గోపాల గౌడ స్పందిస్తూ ‘మీ పిటిషన్ విచారించాలని మేం హైకోర్టుకు సూచిస్తాం. రిజిస్ట్రార్ చేసిన వ్యాఖ్యలు సరికాదు. చాలా తెలివిగా రాశారు. వెంటనే రోస్టర్ బెంచికి ఈ పిటిషన్ కేటాయించాలని సూచిస్తాం..’ అని పేర్కొన్నారు. దీంతో మరోసారి ఇందిరా జైసింగ్ వాదిస్తూ ‘త్వరలో బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి. ఈ నేపథ్యంలో నేను అక్కడికి వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు గానీ, ఉపశమనం గానీ దక్కించుకుంటానన్న నమ్మకం లేదు.. ’ అని వాపోయారు. ‘ఈ కోర్టులో కూడా రెండు ధర్మాసనాలు కేసు విచారణ నుంచి తప్పుకున్నాయి..’ అని వాపోయారు. దీనికి జస్టిస్ గౌడ స్పందిస్తూ ‘లేదు. మా ఉత్తర్వులు తప్పకుండా అమలవుతాయి.. ఒకవేళ మా ఉత్తర్వులు అమలు కానిపక్షంలో ఎలా అమలు చేయించాలో మాకు తెలుసు.. హైకోర్టులో ఒక పిటిషన్ విచారణలో ఉండగా మేం దీనిని విచారించలేం..’ అని పేర్కొన్నారు.
 
 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాదిపై ఆగ్రహం..
 ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది బసవ ప్రభు పాటిల్ లేచి వాదనలు వినిపించబోతుండగా జస్టిస్ గోపాల గౌడ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మీరు ఒకవేళ ఈ కేసులో వాదనలు వినిపిం చడం ప్రారంభిస్తే పిటిషన్‌ను ఇక్కడే విచారిస్తాం. ఇది డెలిబరేట్‌లీ(ఉద్దేశపూర్వకంగా) జరిగింది. ఇది కేవలం ఒక్క అసిస్టెంట్ రిజిస్ట్రార్ మాత్రమే చేసినట్లు కనిపించడం లేదు..’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పాటిల్ మరోసారి ‘మా వాదన కూడా వినండి..’ అని కోరగా ‘ఇంకేం వినమంటారు? అసిస్టెంట్ రిజిస్ట్రార్ రాసింది మేం చూశాం కదా.. మీరు ఒకవేళ వాదనలు ప్రారంభిస్తే మేం కేసును వింటాం..’ అని హెచ్చరించారు. ‘దక్షిణ భారత దేశంలో ఎన్ని రిట్ పిటిషన్లు ఉన్నాయి. మా దగ్గర సమాచారం లేదా? ఒక అసిస్టెంట్ రిజిస్ట్రార్ చేయాల్సిన పనా ఇది? డిప్యూటీ రిజిస్ట్రార్, అదనపు రిజిస్ట్రార్ లేరా?..’ అని జస్టిస్ గౌడ వ్యాఖ్యానించారు. పిటిషనర్ సస్పెండయ్యాక రెండు నెలల వరకు కోర్టును ఆశ్రయించలేదని మళ్లీ పాటిల్ వాదించబోగా ‘మీరు ఇన్‌బిట్వీ న్ లైన్స్(మా భావాన్ని) గా అర్థం చేసుకోండి..’ అని పేర్కొన్నారు.

ఈ సందర్భంలో జైసింగ్ లేచి కనీ సం సస్పెన్షన్ తీర్మానం కాపీని కూడా ఇవ్వలేదని విన్నవించారు. ‘ఎందుకు ఇలా.. స్పీకర్ కార్యాలయం సస్పెన్షన్ తీర్మానాన్ని ఇవ్వలేదా? దేశంలో ఏం జరుగుతోంది? మీరు ఏదో సాంకేతిక కారణా లు చూపి ఒక సభ్యురాలి హక్కులకు భంగం కలిగి స్తారా? స్పీకర్ కార్యాలయం ఏం చేస్తోంది? ప్రజాప్రతినిధి పట్ల ఇలాగే వ్యవహరిస్తారా? ఒక నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో వ్యవహరించేది ఇలాగేనా? మమ్మల్ని బాధించింది.. సమ్ థింగ్ రాంగ్.. సమ్ థింగ్ రాంగ్..’ అంటూ పేర్కొన్నారు. జస్టిస్ అరుణ్ మిశ్రా కల్పించుకుని ‘పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉందని ఊరుకుంటున్నాం. కానీ మీరు ప్రభుత్వానికి మద్దతుగా వాదిస్తున్నారు. అలాగే డిఫెండ్ చేస్తానంటే ఈ కేసును ఆర్టికల్ 32 కింద ఇక్కడే విచారిస్తాం.. అసెంబ్లీ నడుస్తుండగా ఇలా ఎలా వ్యవహరిస్తారండీ? మీ క్లయింట్‌కు సరైన సలహా ఇవ్వండి’ అంటూ ఏపీ ప్రభుత్వ న్యాయవాది బసవ ప్రభు పాటిల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు.

 అదే మా తొలి ప్రశ్న అవుతుంది..
 ‘మీరు వాదిస్తానంటే చెప్పండి.. 340(2) నిబంధన కింద ఏడాదిపాటు ఎలా సస్పెండ్‌చేస్తారన్నదే మా తొలి ప్రశ్నగా ఉంటుంది. అది మిమ్మల్ని ఇరకాటంలో పెడుతుంది..’ అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉత్తర్వులు జారీ చేసేందుకు సంసిద్ధులవుతూ ‘సింగిల్ జడ్జి బెంచ్ విని ఉండాల్సింది. వినకపోవడం న్యాయంగా లేదు.. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పని చట్టబద్ధంగా లేదు..’ అని పేర్కొన్నారు. ‘మేం పిటిషనర్‌ను బుధవారం ఉదయం 10 గంటలకు హైకోర్టు చీఫ్ జస్టిస్ వద్ద కేసును ప్రస్తావించాలని సూచిస్తున్నాం. చీఫ్ జస్టిస్ ఈ కేసును రోస్టర్ ప్రకారంగా గానీ, లేదా ఏ బెంచికైనా గానీ ఈ పిటిషన్‌ను కేటాయించి విచారించేలా చూడాలి. మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీచేయాలి. ప్రతివాదులు కూడా ఈ కేసులో హాజరవ్వాలి. అలాగే మా ఉత్తర్వుల అమలుతో కూడిన నివేదికను ఈమెయిల్ ద్వారా, టెలెక్స్ ద్వారా మాకు సాయంత్రానికల్లా తెలపాలి.. అలాగే పిటిషన్‌కు విచారణార్హత ఉందని మా ఉత్వర్వుల్లో స్పష్టం చేస్తున్నాం. తక్షణం ఈ ఉత్తర్వులను హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు తెలియపరచాలి..’ అని రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
 
 సంతోషంగా ఉంది: రోజా
 ‘ఆర్టికల్ 32 కింద మా పిటిషన్‌ను విచారించాలని కోరాం. ఒక్క రోజులోనే పిటిషన్‌ను విచారించాలని హైకోర్టుకు సుప్రీం కోర్టు మార్గదర్శనం చేసింది.. నాకు చాలా సంతోషంగా ఉంది..’ అని రోజా పేర్కొన్నారు. విచారణ అనంతరం సుప్రీం కోర్టు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు.  ‘సస్పెండైన రెండు నెలల వరకూ కోర్టుకు రాలేదని ప్రతివాది తరపు న్యాయవాది ఏదో చెప్పే ప్రయత్నం చేశారు.. కానీ మా ఎమ్మెల్యేలు, మా నేత రాసిన ఉత్తరాలు ఉన్నాయి.. అవన్నీ చెప్పాం.. బడ్జెట్ సమావేశాల్లో మహిళల సమస్యలపై, అధికార పార్టీ అకృత్యాలపై మాట్లాడతానని నన్ను సస్పెండ్ చేశారు. కాల్ మనీ రాకెట్‌పై మాట్లాడినందుకే, వారిని నిలదీసినందుకే నన్ను సస్పెండ్ చేశారు.. నన్ను మాత్రమే టార్గెట్ చేశారు..’ అని విమర్శించారు. అసెంబ్లీ జరుగుతున్న తీరుపై మాట్లాడుతూ ‘అధికార పార్టీ నేతలు బజారు రౌడీల్లాగా వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలపై కూడా మాట్లాడొద్దంటే ఎలా? అవిశ్వాస తీర్మానం పెడితే మా నేతను అన్‌పార్లమెంటరీ పదాలతో తిట్టారు. మా నేత మాట్లాడుతుండగానే తీర్మానాన్ని ముగించారు. ప్రజల బాధను ప్రతిపక్షాలు ఆవేదనగా, ఆవేశంగా చెప్తాయి. దాన్ని వక్రీకరించి ఇలా చేయడం సరికాదు..’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement