అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు
♦ రోజా సస్పెన్షన్ వ్యవహారంలో హైకోర్టు ఆదేశం
♦ శాసన వ్యవహారాలశాఖ కార్యదర్శికి కూడా
♦ కౌంటర్లు దాఖలుకు ఉత్తర్వులు
♦ తదుపరి విచారణ 29కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్.కె.రోజా సస్పెన్షన్ వ్యవహారంలో ఉమ్మడి హైకోర్టు బుధవారం శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తనను అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు సస్పెండ్ చేస్తూ స్పీకర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా శాసన వ్యవహారాలశాఖ కార్యదర్శి తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ... రోజాను సభ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయలేదని చెప్పారు. శాశ్వతంగా సస్పెండ్ చేస్తే శాసనసభ్యత్వంతో పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోతారని, అలాగే జీతభత్యాలు కూడా అందవని తెలిపారు. అటువంటి సందర్భంలోనే బాధిత వ్యక్తి వాదనలు వినాల్సి ఉంటుందన్నారు. కానీ రోజాను ఏడాది పాటు మాత్రమే సస్పెండ్ చేశామని, కాబట్టి ఆమె వాదనలు వినాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏడాది సస్పెన్షన్ వల్ల సభకు వచ్చే అవకాశం ఉండదు తప్ప, తన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేందుకు, జీతభత్యాలు పొందేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని ఆయన కోర్టుకు నివేదించారు. సస్పెండ్ చేసేటప్పుడు రోజా అసెంబ్లీలోనే ఉన్నారని, ఎందుకు సస్పెండ్ చేశారో అమెకు కారణాలు స్పష్టంగా తెలుసునని వివరించారు. అసెంబ్లీ అంతర్గత ప్రొసీడింగ్స్ విషయంలో న్యాయసమీక్ష సరికాదని మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చిందంటూ దానిని ఉదహరించారు.
సబ్‌కమిటీ ఎందుకు వేశారు?
రోజా సస్పెన్షన్ నిర్ణయం స్పీకర్‌ది కాదని, అది శాసనసభ మొత్తానిదని ఏఏజీ శ్రీనివాస్ కోర్టుకు నివేదించారు. అలాగైతే సబ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? దాని బాధ్యతలేమిటి? రోజా సస్పెన్షన్‌పై పునఃసమీక్ష చేస్తుందా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అసెంబ్లీలో ఆ రోజు జరిగిన ఘటనలపై విచారించేందుకు సబ్ కమిటీ ఏర్పాటైందని, అది ఇచ్చే నివేదికను బట్టి రోజాపై సస్పెన్షన్ ఎత్తివేయడానికి కూడా అవకాశాలున్నాయని శ్రీనివాస్ తెలిపారు.
తరువాత న్యాయమూర్తి స్పందిస్తూ... అసెంబ్లీ సమావేశాలు ఎప్పటినుంచి ప్రారంభం కానున్నాయని ప్రశ్నించారు. మార్చి మొదటి వారం నుంచి ఉండొచ్చునని, అయితే అధికారికంగా ఇంకా నోటిఫై చేయలేదని శ్రీనివాస్ వివరించారు. న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకే ఈ వివరాలు అడిగినట్లు అర్థం చేసుకున్న శ్రీనివాస్... రాజ్యాంగ సంస్థల్లో ఒకటైన అసెంబ్లీ నిర్ణయంపై యాడ్ ఇంటరిమ్ ఆర్డర్ (కౌంటర్ దాఖలుకు ముందే ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులు) ఇవ్వడానికి వీల్లేదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని తెలిపారు. అంతేకాక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ఇంకా వ్యవధి ఉందన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, కౌంటర్ దాఖలు చేస్తారా? అని ప్రశ్నించారు. తాను అసెంబ్లీ కార్యదర్శి తరఫున వాదనలు వినిపించడం లేదని, తాను కేవలం శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి తరఫునే కోర్టుకు సహకరిస్తున్నానని శ్రీనివాస్ తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, శాసనసభ సమావేశాలకు కొంత వ్యవధి ఉన్నందున, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి, వారి స్పందనను తెలుసుకుంటామన్నారు. ప్రతివాదులుకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు.