హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్కు సంబంధించి ప్రభుత్వ అప్పీల్పై హైకోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ పై ప్రభుత్వం తరఫున పీపీ రావు తమ వాదనలు వినిపించారు.
ఇక ఎమ్మెల్యే రోజా పిటిషన్పై ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. 'ఈ కేసులో కక్షిదారు అసెంబ్లీ మాత్రమే. కానీ ఇక్కవ అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్కు వచ్చారు. శాసనసభ చేసిన అప్పీల్ మాత్రమే ఇక్కడ వర్తిస్తుంది. అసెంబ్లీ అప్పీల్కు రాలేదు కాబట్టి, మధ్యంతర ఉత్తర్వులు అమలుకు అభ్యంతరం లేదనే అర్థం చేసుకోవాలి. అసెంబ్లీ ఉద్యోగులు ఒక పక్షం వహించరు.
అధికారపక్షం, ప్రతిపక్షం రెండు ...ఉద్యోగులకు సమానమే. అలాంటప్పుడు వారు ఎలా అప్పీల్కు వస్తారు. అసెంబ్లీ కార్యదర్శి ఈ కేసులో రెండో రెస్పాండెంట్. 340 నిబంధన కిందే ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ విధించారు. రోజాను సస్పెండ్ చేసింది సభ కాబట్టి..ఇప్పుడు దాన్ని తొలగించాల్సింది కూడా సభే నని' అసెంబ్లీ నియామావళిలోని నిబంధనలు ఇందిరా జైసింగ్ ఈ సందర్భంగా చదివి వినిపించారు.
ఒకవేళ194 కిందే చర్య తీసుకున్నారనుకుంటే ముందుగా నోటీసు ఎందుకు ఇవ్వలేదని ఇందిరా జైసింగ్ ప్రశ్నించారు. 340 కిందే ఎమ్మెల్యే రోజాపై చర్య తీసుకున్నారని స్పష్టమవుతుందన్నారు. సభ పొరపాటు చేసిందని, ప్రభుత్వం వచ్చి కోర్టుకు చెబుతోందని, ఆ పొరపాటును సభే సరిదిద్దుకోవాలని రోజా తరఫు న్యాయవాది తన వాదనలు గట్టిగా వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును మంగళవారానికి వాయిదా వేశారు.