సస్పెన్షన్ చెల్లదు
ఆ తీర్మానం సభ నిబంధనలకు విరుద్ధం
అందుకే నిలుపుదల చేస్తున్నాం
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్: అసెంబ్లీ నుంచి అక్రమంగా సస్పెన్షన్ వేటుపడ్డ వైఎస్సార్‌సీపీకి చెందిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ శాసనసభ నిబంధన 340 (2) కింద చేసిన తీర్మానం అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. ఈ తీర్మానం సభ నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. సస్పెన్షన్ తీర్మానాన్ని సవాలు చేస్తూ రోజా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ప్రతివాదులుగా ఉన్న శాసన వ్యవహారాల ము ఖ్య కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ పెండింగ్‌లో ఉండగా రోజా సస్పెన్షన్‌ను కొనసాగిస్తే, అది సభ ప్రొసీడింగ్స్‌లో పాల్గొనే ఆమె హక్కును ప్రభావితం చేస్తుందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అంతేకాక రేపు ఈ వ్యాజ్యంలో రోజా విజయం సాధిస్తే ఆ హక్కును తిరిగి వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదన్నారు. అందువల్ల 18.12.2015న రోజాను సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానం అమలును నిలిపేస్తున్నట్లు జస్టిస్ రామలింగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ మధ్యంతర ఉత్తర్వులతో శాసనసభకు హాజరయ్యేందుకు రోజాకు అడ్డంకులు తొలగిపోయాయి. శాసనసభ నిబంధనల్లో రూల్ 340 (2) కింద తనను ఏడాది పాటు సస్పెండ్ చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయ తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు గురువారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల్లోని అంశాలిలా ఉన్నాయి..
స్పీకర్‌గా పనిచేసినా.. నిబంధనలు తెలియవా?
స్పీకర్ స్థానాన్ని అవమానించడం, శాసనసభ నిబంధనలను దుర్వినియోగం చేయడం, సభ కార్యకలాపాలను అదే పనిగా అడ్డుకోవడం చేస్తున్నప్పుడు రూల్ 340 (2) కింద చర్యలు చేపట్టవచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ సభ్యుడినైతే సస్పెండ్ చేయదలచారో ఆ సభ్యుడి పేరును స్పీకర్ ప్రస్తావించాలి. ఆ తరువాతనే సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టాలి. తరువాత స్పీకర్ ఆ సభ్యుడిని ఆ నిర్ధిష్ట సెషన్ వరకు మాత్రమే సస్పెండ్ చేయాలి. ఈ కేసులో కూడా శాసన వ్యవహారాల మంత్రి తీర్మానం ప్రవేశపెట్టేటప్పుడు ఈ340 (2) రూల్‌నే ఉపయోగించారు. శాసనవ్యవహారాల మంత్రి నిబంధనను తప్పుగా ప్రస్తావించారన్న అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనను ఆమోదించలేం. ఎందుకంటే సదరు మంత్రి గతంలో స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అటువంటి వ్యక్తికి ఏ నిబంధన ఉపయోగించాలో తెలియదని చెప్పడానికి వీల్లేదు. ప్రస్తుతం ఏ ఉద్దేశంతో తీర్మానం చేశారో ఈ కోర్టుకు అవసరం లేదు. ఆ తీర్మానం నిబంధనలకు లోబడి ఉందా?లేదా? అన్నదే ముఖ్యం. రూల్ 340 (2) ఆధారంగా సెషన్‌కు మించి సస్పెండ్ చేసేందుకు చేసిన ఈ తీర్మానం చట్టవిరుద్ధమైంది. రోజా సస్పెన్షన్‌ను రూల్ 340 (2) కింద కాకుండా అధికరణ 194 (3) కింద చూడాలన్న అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనను ఈ దశలో ఆమోదించడం సాధ్యం కాదు. రాజ్యాంగంలోని అధికరణ 208 అనుసరించి చట్ట సభల నిబంధనలను రూపొందించడం జరిగింది. రూల్ 340 (2)ని విస్మరించి, అధికరణ 194 (3)ను పరిగణనలోకి తీసుకోవాలనడం సరికాదు. ఏఏజీ ప్రస్తావించిన పలు సుప్రీంకోర్టు తీర్పులు ఈ కేసుకు వర్తించవు.
శాసనసభ చేసిన తీర్మానాన్ని న్యాయస్థానం అధికరణ 212 ఆధారంగా సమీక్షించవచ్చు. ఇక సహజ న్యాయసూత్రాల ఉల్లంఘన, నిబంధనలకు విరుద్ధంగా సభ్యుడిని సస్పెండ్ చేసే అధికారం శాసనసభకు ఉందా? లేదా? వంటి అంశాలన్నీ తదుపరి విచారణలో తేలుతాయి. ఈ ఉత్తర్వులు 18.12.15న సభలో జరిగిన వ్యవహారాలకు ఎంత మాత్రం సమ్మతి కాదు. అలాగే తప్పు చేసిన సభ్యులపై చర్య తీసుకునే విషయంలో స్పీకర్‌కున్న అధికారానికి విరుద్ధం కాదు. తీర్మానం చట్టబద్ధత గురించి మాత్రమే ప్రాథమిక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా. పెండింగ్‌లో ఉన్న సభా హక్కుల ప్రొసీడింగ్స్ విషయంలో తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈ ఉత్తర్వులు అడ్డంకి కాదు.
అప్పీల్ దాఖలు
సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ శాసనవ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. రోజా అసెంబ్లీకి హాజరయ్యేందుకు వీలుగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని ముఖ్య కార్యదర్శి తన అప్పీల్‌లో ధర్మాసనాన్ని కోరారు. అయితే ఈ అప్పీల్‌కు రిజిస్ట్రీ గురువారం సాయంత్రం వరకు నంబర్ కేటాయించలేదు. శుక్రవారం కేటాయించే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం ఈ అప్పీల్ గురించి ముఖ్య కార్యదర్శి తరఫు న్యాయవాదులు ధర్మాసనం ముందు ప్రస్తావించే అవకాశాలు కూడా ఉన్నాయి.