♦ రోజాను అసెంబ్లీకి రానీయకపోవడంపై
♦ భగ్గుమన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు
♦ అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఆందోళన
♦ మండల కేంద్రాల్లో నల్లబ్యాడ్జీలతో ప్రదర్శన
♦ జిల్లావ్యాప్తంగా వివిధ రీతుల్లో నిరసన
శాసనసభ్యురాలు రోజాపట్ల సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ అసెంబ్లీలోకి అనుమతించకపోవడం దుర్మార్గమంటూ నిరసన వ్యక్తం చేసింది. శనివారం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు వివిధ రీతుల్లో తమ నిరసనను వెలిబుచ్చాయి. కోర్టు తీర్పునూ సర్కారు కాలరాస్తోందంటూ దుమ్మెత్తిపోశాయి. రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని ధ్వజమెత్తాయి. నల్లబ్యాడ్జిలు ధరించి ఆందోళన నిర్వహించాయి.
శ్రీకాకుళం అర్బన్: రోజాను అసెంబ్లీలోకి రానీయకుండా అడ్డుకున్న తీరుపై శ్రీకాకుళంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతితోపాటు నేతలు కార్యకర్తలు నిరసన వెలిబుచ్చారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు లు అర్పించారు. అంబేడ్కర్ రూపొం దించిన రాజ్యాంగంలోని హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని వీరంతా దుయ్యబట్టారు. పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జి వరుదు కళ్యాణి ఆదివారంపేటలోగల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గార మండలంలో ప్రభు త్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆమదాలవలసలో పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించా రు. ఎచ్చెర్లలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాజాం, సంతకవిటి, వంగర, రేగిడి మండలాలకుచెందిన ప్రతినిధులు రాజాంలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలి పారు. మానవహారం నిర్వహించారు. పాలకొండలో యాలాం కూడలిలో అంబేడ్కర్ విగ్ర హం వద్ద పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలవలస విక్రాంత్‌తోపాటు పార్టీ శ్రేణులు నల్లబ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపాయి. నరసన్నపేటలో పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ సారథ్యంలో శ్రేణు లు నల్లబ్యాడ్జీలతో కదంతొక్కాయి. టెక్కలిలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వాడ వాణి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చింతాడ మంజు, జెడ్పీటీసీ కర్నిక సుప్రియ, పార్టీ జిల్లా ప్రతినిధి టి.జానకిరామయ్యల నేతృత్వంలో కార్యకర్తలు అంబేడ్కర్ కూడలిలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. నందిగాంలో పార్టీ జిల్లా యువజన అధ్యక్షుడు పేరాడ తిలక్‌తోపాటు కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కాశీబుగ్గలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జుత్తు జగన్నాయకులు..కార్యకర్తలు నల్లబాడ్జీలతో నిరసన తెలిపారు. పాతపట్నంలో పార్టీ ప్రతినిధి సలాన మోహనరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఇక్కడకు వెళ్లి సంఘీభావం ప్రకటించారు. ఇచ్చాపురం నియోజకవర్గం కవిటిలో నర్తు రామారావుతోపాటు కార్యకర్తలు నల్లబ్యాడ్జీలతో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన నిర్వహించారు.