రోజా సస్పెన్షన్ విషయంలో న్యాయం గెలిచింది
► వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా
► అధ్యక్షురాలు గాయత్రీదేవి
► రోజా సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టేయడంపై సంబరాలు
► యనమల రాజీనామాకు డిమాండ్
చిత్తూరు (అర్బన్): రోజా సస్పెన్షన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో న్యాయం గెలిచిందని, అసెంబ్లీ ప్రజా సమస్యల ప్రస్తావన వేదికని, ఇది ఎన్టీఆర్ భవనం కాదనే విషయాన్ని టీడీపీ నాయకులు ఇప్పటికైనా గుర్తుంచుకుంటే మంచిదని వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పీవీ.గాయత్రీదేవి హితవుపలికారు. కోర్టు తీర్పు నేపథ్యంలో చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద గాయత్రీదేవి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ మహిళా కార్యకర్తలు బాణ సంచా పేల్చి, స్వీట్లు పంచుకుని, రంగులు చల్లుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గాయత్రీదేవి మాట్లాడుతూ అసెంబ్లీని ఎన్టీఆర్ భవనంలా భావిస్తూ టీడీపీ నాయకులు ఇష్ట ప్రకారం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సస్పెన్షన్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేస్తే అసెంబ్లీ నిబంధనలనే మార్చేయడం.. రోజా విషయంలో ఏడాది పాటు సమావేశాలు రాకుండా చేయడం ప్రభుత్వ పరాకాష్ట చేష్టలకు నిదర్శమన్నారు. సభలో జరుగుతున్న తీరుపై వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిబంధనలను కాలరాస్తున్నారని చెబుతున్న మంత్రి యనమల రామకృష్ణుడు ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రోజా విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం నైతికత ఉన్నా రోజాకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని, యనమల రామకృష్ణుడు అసెంబ్లీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
జిల్లాలో పలు ప్రాంతాల్లో సంబరాలు
రోజా సస్పెన్షన్ ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నగరి నియోజక వర్గ కేంద్రంతో పాటు పుత్తూరులో బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకు న్నారు. పాకాలలో కూడా వైఎస్సార్ సీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అలాగే పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.