బిజినెస్ రూల్స్ ప్రకారం ఏపీ స్పీకర్ వ్యవహరించలేదు
సభా హక్కుల కమిటీ సిఫారసు లేకపోయినా సస్పెన్షన్
సస్పెన్షన్ కాపీని కూడా ఇవ్వలేదు
రాతపూర్వకంగా కోరినా ప్రయోజనం లేకపోయింది
ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం
హైకోర్టుకు నివేదించిన రోజా తరఫు సీనియర్ న్యాయవాది
తదుపరి విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు రోజాపై సస్పెన్షన్ విషయంలో అసెంబ్లీ బిజినెస్ రూల్స్‌కు అనుగుణంగా ఏపీ స్పీకర్ వ్యవహరించలేదని రోజా తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. సభా హక్కుల కమిటీ సిఫారసు లేకపోయినా, సస్పెన్షన్‌కు సంబంధించిన కాపీని ఇవ్వకుండా సస్పెండ్ చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపారు. తాజాగా సుప్రీంకోర్టు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందన్నారు. ఆ తరువాత శాసనసభ వ్యవహారాలశాఖ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ... అధికరణ 194(3) ప్రకారం స్పీకర్‌కు విస్తృత అధికారాలున్నాయని, వాటి ఆధాంగా రోజాపై సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. కోర్టు పని వేళలు ముగియడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం
తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని కోరుతూ రోజా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్‌కుమార్ మంగళవారం దానిని మరోసారి విచారించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... నిబంధనల ప్రకారం శాసనసభ్యుడిని ఆ అసెంబ్లీ సెషన్ వరకు మాత్రమే సస్పెండ్ చేయవచ్చునని, అంతే తప్ప ఏడాదిపాటు సస్పెండ్ చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. సభా హక్కుల కమిటీ సిఫారసులు లేకుండానే సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని, ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని వివరించారు. అంతేకాక సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా స్పీకర్ నిర్ణయం ఉందని తెలిపారు. తమిళనాడు డీఎండీకె పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌నకు సంబంధించి సుప్రీంకోర్టు మూడు రోజుల క్రితం తీర్పు వెలువరించిందంటూ ఆ కాపీని న్యాయమూర్తి ముందుంచారు. అక్కడ కూడా ఆరుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారని, తరువాత సభా హక్కులు కూడా వారి సస్పెన్షన్‌కు సిఫారసు చేసిందన్నారు.
అయితే వీరి సస్పెన్షన్‌కు ప్రధాన ఆధారమైన వీడియో ఫుటేజీని ఆరుగురు ఎమ్మెల్యేలకు ఇవ్వలేదని, దీనిని వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. వీడియో ఫుటేజీ ఇవ్వకుండా, వారి వాదనలు వినకుండా సస్పెన్షన్‌కు సిఫారసు చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇక్కడ కూడా సస్పెన్షన్ ముందు రోజాకు ఎటువంటి నోటీసు ఇవ్వడం గానీ, సస్పెన్షన్ దేని ఆధారంగా చేశారో వాటిని ఆమెకు అందచేయడం గానీ చేయలేదన్నారు. ఇవన్నీ కూడా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన తెలిపారు. తరువాత అదనపు ఏజీ వాదనలు వినిపిస్తూ... రాజ్యాంగంలోని అధికరణ 194(3) కింద స్పీకర్‌కున్న అధికార ప్రకారమే రోజాపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారని తెలిపారు. ఒక ఎమ్మెల్యేగా సభలో వ్యవహరించకూడని రీతిలో పిటిషనర్ వ్యవహరించారన్నారు. శాసనసభా వ్యవహారాల మంత్రి ప్రవేశపెట్టిన తీర్మానం మేరకే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సస్పెన్షన్ వేటు వల్ల ఆమె జీతభత్యాలు ఆగవన్నారు. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది.