రైతుల ఆత్మహత్యల నివారణకు ఎట్టకేలకు ప్రభుత్వం చర్యలు
జిల్లా స్థాయిలో ప్రత్యక సెల్
ఫిర్యాదుల విభాగం నెం. 8886613778
జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో విభాగాలు
ఏడీ, డీఎస్పీ, ఆర్డీవోలతో త్రిసభ్య కమిటీ
రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ హైకోర్టు గట్టిగా మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వంలో కదిలిక వచ్చింది. ఎట్టకేలకు నివారణ చర్యలు చేపట్టింది. రైతుల్లో మనోస్థైరాన్ని నింపేలా ప్రత్యేక విభాగాన్ని, కమిటీలను ఏర్పాటుచేసింది.
విశాఖపట్నం: వరుసగా గత ఐదేళ్లుగా విరుచుకుపడుతున్న ప్రకృతి విపత్తులు... ఏయేటికాయేడు చేతికందివచ్చిన పంటలు నేలపాలవుతూ అప్పుల సుడిగుండంలో అన్నదాతలు విలవిల్లాడి పోతున్నారు. గడిచిన ఏడాదిన్నరలో రాష్ట్రంలో వందలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడగా వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇన్నాళ్లు పట్టించుకోవడం మానేసింది. దీనిపై కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేయడంతో ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు స్పందించింది. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను అనేక సూచనలు చేయడంతో ఆ దిశగా ప్రభుత్వం ఉపశమన చర్యలకు శ్రీకారంచుట్టింది. ఇందుకోసం జిల్లా, డివిజన్ స్థాయిలో బుధవారం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయిలో వ్యవసాయ శాఖ డిప్యూటీ డెరైక్టర్ రాజుబాబు నేతృత్వంలో ఈ సెల్ పనిచేస్తుంది. ఈ విభాగానికి 88866 13778 నెంబర్‌తో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. జిల్లాలో పదివ్యవసాయ సబ్ డివిజన్లు ఉండగా. ప్రతీ సబ్ డివిజన్ పరిధిలో వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీలు పర్యవేక్షిస్తుంటాయి. వీఆర్వోలు, వ్యవసాయాధికారులు గ్రామస్థాయిలో రైతుల ఆర్ధిక స్థితి గతులు.. మానసిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటారు.
ఎవరైనా స్థైర్యం కోల్పోయే స్థితిలో ఉంటే వెంటనే ఈసెల్‌కు సమాచారం ఇస్తే ప్రత్యేక కౌన్సెలర్ ద్వారా ఈ విభాగం నేరుగా ఆ గ్రామానికి వెళ్లి సంబంధిత రైతు కుటుంబంతో భేటీ అయి వారిలో మనోస్థైర్యం నింపేందుకు యత్నిస్తారు. అవసరమైతే నిపుణులతో వారికి కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. వారికి ఏవిధమైన సమస్యలున్నాయి.. వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆ రైతు బయట పడతాడు వంటి అంశాలపై అధ్యయనం చేసి సబ్‌డివిజన్ స్థాయిలో కమిటీ జిల్లాకు నివేదిస్తుంది. దాన్ని ప్రభుత్వానికి పంపి ఆ రైతుకు సాంత్వన చేకూర్చేలా చర్యలు చేపడతారు. ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే ఎందుకు ఆ అఘాయిత్యానికి ఒడిగట్టాల్సి వచ్చిందో పరిశీలనచేసేందుకు ఏడీ, డీఎస్పీ, ఆర్డీవోల నేతృత్వంలో త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేశారు. వీరిచ్చే నివేదికను జిల్లా స్థాయిలో కలెక్టర్, వ్యవసాయ శాఖ జేడీ, ఎస్పీల నేతృత్వంలో ఏర్పాటుచేసిన కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సిఫార్సుచేస్తుంది. తదనుగుణంగా ఆ రైతు కుటుంబానికి అందాల్సిన ఆర్థిక సహకారాన్ని అందజేస్తారు.
ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చు
మీ గ్రామంలో ఏ రైతైనా.. వ్యవసాయ పరంగానే కాకుండా వివిధ కారణాలతో మనో స్థైర్యం వీడినట్టుగా గుర్తిస్తే వెంటనే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన విభాగానికి ఫోన్ చేస్తే వెంటనే ప్రత్యేక బృందాన్ని ఆ గ్రామానికి పంపిస్తాం.. ఆ రైతుకు కౌన్సెలింగ్ చేస్తాం.. ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడతాం.
- వి.సత్యనారాయణ, జాయింట్ డెరైక్టర్, వ్యవసాయశాఖ
హైకోర్టు మొట్టికాయలతో వీడిన మొద్దునిద్ర
Published Wed, Dec 2 2015 11:39 PM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM
Advertisement
Advertisement