క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్–19 పరీక్షలను వీలైనంత ఎక్కువగా క్రమంగా పెంచాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పరీక్షలు చేసే విషయంలో ఎక్కడా వెనకడుగు వేయరాదని, రోజు రోజుకూ పరీక్షల సంఖ్య పెరుగుతూ పోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటిదాకా పరీక్షల సంఖ్యను బాగా పెంచినందుకు అధికారులను అభినందించారు. కోవిడ్–19 నివారణ చర్యలు, పరీక్షలు జరుగుతున్న తీరు తెన్నులపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు పేర్కొన్న అంశాలు, సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి.
టెస్ట్‌లు బాగా జరుగుతున్నాయి..
♦ కోవిడ్ లక్షణాలున్న వారికి త్వరతగతిన టెస్ట్‌లు జరిగేలా చర్యలు తీసుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లతో చేసిన ర్యాండమ్ పరీక్షల్లో సుమారు 30కిపైగా కిట్లలో పాజిటివ్ వచ్చాయని, వాటి నిర్ధారణ కోసం పీసీఆర్ టెస్టులకు పంపామని చెప్పారు.
♦ టెలిమెడిసిన్ ద్వారా వైద్య సలహా తీసుకున్న వారికి మందులు కూడా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సింగపూర్, చైనాల్లో మరోసారి వైరస్ వ్యాప్తి ప్రారంభమైందన్నారు.
అత్యవసర కేసుల్లో వెంటనే స్పందించాలి
♦ తలసేమియా, క్యాన్సర్, డయాలసిస్ లాంటి వ్యాధిగ్రస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలి. 104కు కాల్ చేస్తే వెంటనే స్పందించేలా ఉండాలి. డెలివరీ, ఇతరత్రా ఎమర్జెన్సీ కేసులకు ఇబ్బంది రాకుండా చూడాలి.
♦ ఎక్కడా వెనకడుగు వేయకుండా టెస్ట్‌ల సంఖ్యను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలి.
♦ నాడు–నేడు ద్వారా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించే చర్యలు ఊపందుకునేలా చూడాలి. ప్రతిపాదిత కొత్త మెడికల్ కాలేజీలకు వెంటనే స్థలాలను గుర్తించాలి.
♦ ఎవరికి ఏ సమస్య ఉన్నా 1902కు కాల్ చేయాలి. అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా పంటలు, ధరల పరిస్థితులపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలి. ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుంది. గ్రామాల్లోని రైతులు ఏమైనా ఇబ్బందులుంటే అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను సంప్రదించాలి.
♦ 100 రూపాయలకు వివిధ రకాల పండ్లు ఇవ్వటాన్ని కొనసాగించాలి. ఇది శాశ్వత ప్రాతిపదికన ముందుకు సాగేలా చూడాలి.
తప్పుడు కథనాలపై చర్చ
♦ గుంటూరు జిల్లా ఈపూరు మండలానికి చెందిన బొల్లా వీరాంజనేయలు రొంపిచర్ల మండలం విప్పర్ల రెడ్డిపాలెంలో కర్బూజా పంటను పొలంలో వదిలేశారని.. కడప నుంచి తెప్పించిన అరటి విజయవాడలో రైతు బజార్లకు చేరక కుళ్లిపోతోందని ఓ పత్రికలో (సాక్షి కాదు) వచ్చిన కథకాలపై చర్చ జరిగింది.
♦ఈ రెండు కథనాలూ.. తప్పుడు సమాచారం అని అధికారులు సీఎంకు నివేదించారు. కర్బూజా పంట పండించిన రైతు కుటుంబంతో మాట్లాడామని చెప్పారు. ఇప్పటికే రెండు కోతలు కోసి పంటను తీసుకున్నామని, గిట్టుబాటు రేటు కూడా తీసుకున్నామని చెప్పారన్నారు. మూడో కోతలో నాసిరకం కాయలుండటంతో వదిలేశామని, వాటిని తరలిస్తే రవాణా ఖర్చులు కూడా రావని ఆ కుటుంబం తెలిపిందని అధికారులు వివరించారు.
♦ కడప నుంచి విజయవాడకు తెప్పించిన అరటి గెలలను స్థానిక మార్కెట్లకు పంపించామని చెప్పారు. ఎక్కడా అరటి గెలలను వదిలేయలేదని స్పష్టం చేశారు.
♦ అధికారికంగా సమాచారం ఇవ్వకపోయినా ఇష్టం వచ్చినట్టు కేసులు, మరణాల సంఖ్యను చూపిస్తున్నారనే విషయంపై సమావేశంలో చర్చ జరిగింది. కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని అధికారులు వివరించారు.
♦ సమీక్షా సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment