సాక్షి, అమరావతి: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రివెంటివ్ కేర్‌పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇప్పటికే వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి నివారణకు చర్యలు చేపడుతున్నారు. ప్రివెంటివ్ కేర్‌ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్(బీపీయూహెచ్)లను ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 334 యూనిట్లు నిర్మించాల్సి ఉండగా, తొలి దశలో 166 యూనిట్లు నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్‌కు భవన నిర్మాణానికి రూ.50 లక్షలు, వైద్య పరికరాల కోసం రూ.30 లక్షలు చొప్పున రూ.80 లక్షలు ఖర్చు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో నిర్మాణాలన్నీ చేపడుతున్నారు. ఇప్పటి వరకూ 141 యూనిట్ల భవన నిర్మాణాలకు టెండర్లు ఖరారు కాగా, 94 చోట్ల పనులు కొనసాగుతున్నాయి.
మండల స్థాయి సర్వేలెన్స్ యూనిట్లుగా..
పీహెచ్‌సీ ప్రాంగణాల్లో నిర్మిస్తున్న బీపీయూహెచ్‌లు మండల స్థాయి సర్వేలెన్స్ యూనిట్లుగా వ్యవహరిస్తాయి. వీటిల్లో హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(హెచ్‌ఎంఐఎస్) యూనిట్‌తోపాటు పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
సెమీఆటో అలైజర్, సెల్ కౌంటర్, ట్రూనాట్, అల్ట్రాసౌండ్, హెచ్‌బీ1సీ పరికరాలు ల్యాబ్‌లలో ఉంటాయి. కరోనా వైరస్, డయేరియా, విష జ్వరాలు, ఇతర వ్యాధులు వ్యాపించినప్పుడు ఈ యూనిట్‌ల ద్వారా సర్వేలెన్స్ ఉంచుతారు. ఎపిడమాలజిస్ట్‌లతోపాటు విజిలెన్స్ సెల్ కూడా అందుబాటులోకి వస్తాయి. యూనిట్‌లన్నింటినీ జిల్లా, బోధనాస్పత్రుల్లోని ల్యాబ్‌లకు అనుసంధానం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment