సాక్షి, న్యూఢిల్లీ: గ్రామాల్లో కోవిడ్–19 వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పద్ధతులు అవలంబిస్తోందని, ఇవి అనుసరణీయమని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఏపీలో పంచాయతీల్లో చురుకైన చర్యలు చేపడుతున్నారని, జిల్లా – గ్రామీణ స్థాయిలలో నిత్యం బహిరంగ ప్రదేశాల పరిశుభ్రత, అనాధలు, వలసకార్మికుల కోసం ఆశ్రయాలు, క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటు, పేదలకు రక్షణ సామగ్రి, ఆర్థిక సహాయం, ఉచిత రేషన్, అవగాహన పెంపు వంటి కార్యక్రమాలు అవలంబిస్తున్నాయని చెప్పింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు జిల్లా యంత్రాంగాలు, పంచాయతీలు చురుకైన చర్యలు తీసుకుంటున్నాయని, దిగ్బందం, సామాజిక దూరం నిబంధనలను కచ్చితంగా పాటించేలా సన్నిహితంగా పర్యవేక్షిస్తోందని వివరించింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, పంచాయతీలతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్టు తెలిపింది. (అధిక కేసులున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి)
1.43 కోట్ల కుటుంబాల సర్వే..
- భారత వైద్య పరిశోధన మండలి సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలో కోవిడ్–19 పీడితుల గుర్తింపు నిమిత్తం రాష్ట్ర ప్రభు త్వం ఇంటింటి సర్వే చేపట్టింది.
- మూడోవిడత పూర్తయ్యేసరికి 1.47 కోట్ల కుటుంబాలకు గాను 1.43 కోట్ల కుటుంబాలపై సర్వే ముగియగా ఇప్పటిదాకా 32,349 మందిని ఆస్పత్రుల్లో చేర్చారు.
- 9,107 మందికి పరీక్షలు నిర్వ హించాలని వైద్యులు సిఫారసు చేశారు.
- ప్రభుత్వం ప్రజలకు 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయనుంది.
ఇతర రాష్ట్రాల్లో ఇలా..
ఇదే ప్రకటనలో ఇతర రాష్ట్రాల పరిధిలో పంచాయతీల్లో చేపట్టిన అనుసరణీయ ఉత్తమ ఆచరణ పద్ధతులను కూడా ప్రస్తావించింది. వివరాలు..
- ఉత్తరప్రదేశ్‌లోని సిద్దార్థనగర్ జిల్లాలోని పంచాయతీల్లో పోస్ట్‌మ్యాన్ సూక్ష్మ ఏటీఎం ద్వారా నగదు అందుబాటులో ఉంచడం, మీరట్ డివిజన్‌లో నిరుపేద కుటుంబాలకు రూ.1,000 వంతున ఆర్థిక సహాయం, వలస కార్మికులకు రేషన్, ఆహార ప్యాకెట్లు, పారిశుధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి అందజేయడం వంటి చర్యలు.
- కేరళలో సామాజిక వంట శాలలు, కుటుంబశ్రీ లబ్ధిదారులు తయారు చేసిన 18 లక్షల మాస్కుల పంపిణీ, ఇతర సూక్ష్మ సంస్థల ద్వారా ప్యూరిఫైడ్ వాటర్, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా ప్రజల్లో అవగాహనకు కృషి.
- దాద్రా–నాగర్ హవేలీలో పరిశుభ్రతతోపాటు నిత్యం అవగాహన కార్యక్రమాల నిర్వహణ, గ్రామీణ ప్రాంతాల్లో శానిటైజర్లు, మాస్కుల ఉచిత పంపిణీ.
Comments
Please login to add a commentAdd a comment